Abn logo
Aug 4 2020 @ 04:24AM

సొంత భవనాలేవీ?

పాలనా సౌలభ్యం కోసం 49 కొత్త పంచాయతీల ఏర్పాటు

రెండేళ్లు గడుస్తున్నా చేపట్టని సొంత భవనాల నిర్మాణం 

అసౌకర్యాల నడుమ కార్యకలాపాల నిర్వహణ

సమావేశాల నిర్వహణకు తప్పని ఇబ్బందులు


ఆమనగల్లు: పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం తగిన జనాభా కలిగిన తండాలు, గ్రామాలను రెండేళ్ల క్రితం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ప్రజలకు మెరుగైన సేవలందిం చాలన్న లక్ష్యంతో ప్రత్యేక పంచాయతీలకుగా ఏర్పాటు చేసినా నేటికీ వాటికి సొంత భవనాలు లేవు. దీంతో కొన్ని గ్రామాల్లో పాలకవర్గాలు చెట్ల కింద, గ్రామ కూడళ్లలో సమావేశాలను నిర్వహిస్తున్నాయి. 2018 ఆగస్టు 2న ప్రభుత్వం నూతన పంచాయ తీలను ఆర్భాటంగా ఏర్పాటు చేసి తాత్కాలికంగా అద్దె భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించింది. 2019 జనవరి 25న పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలకు నిర్వహించింది. గెలుపొందిన పాలకవర్గాలు ఫిబ్రవరి 2న పదవీ బాధ్యతలు స్వీకరించాయి. భవనాలు లేని కారణంగా పంచాయతీ సమావేశాల నిర్వహణ, గ్రామసభల ఏర్పాటు వారికి ఇబ్బందిగా మారింది.


52 పంచాయతీలకు సొంత భవనాలు లేవు 

ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలో 53పాత పంచాయితీలు ఉండేవి. అప్పటికే సుమారు ఎనిమిది పంచాయతీలకు సరైన భవనాలు లేవు. ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోగా సొంత భవనాల నిర్మాణానికి అప్పటి పాలక వర్గాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నేటికీ నిధులు మంజూరు కాలేదు. భవనాల నిర్మాణం జరుగలేదు. నాలుగు మండలాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 49  పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఆమనగల్లు మండల పరిధిలో నాలుగు, కడ్తాల మండలంలో 13, మాడ్గుల మండలంలో 17, తలకొండపల్లి మండలంలో 15 కొత్త పంచాయితీలు ఆవిర్భవించాయి. పాత, కొత్త పంచాయతీలు కలిపి 102 ఉండగా వాటిలో 52 పంచాయతీ కార్యాలయాలకు భవనాలు లేవు.  అదేవిధంగా అద్దె, ఇతర ప్రభుత్వ భవనాల్లో తాత్కాలికంగా కార్యాలయాలను కొనసాగిస్తున్నారు.  


పాలకవర్గాల  ఇబ్బందులు 

పంచాతీలకు సొంత భవనాలు లేక పాలకవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నఅద్దె భవనాలు కూడా అనువుగా లేవు. కొత్త పంచాయతీల్లో చెట్లకింద, గ్రామాల కూడళ్లలో సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవనాల నిర్మాణానికి, వసతుల కల్పనకు చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 


ప్రభుత్వానికి నివేదించాం

ఆమనగల్లు మండలంలోని కొత్త, పాత పంచాయతీలు 13 ఉన్నాయి. వాటిలో రాంనుంతల, చెన్నంపల్లి భవనాలు శిథిలావస్థకు చేరాయి. కొత్త భవనాల నిర్మాణంతో పాటు కొత్తగా ఏర్పాటైన శంకర్‌కొండ తండా, చింతలపల్లి, కొత్తకుంటతండాలకు పంచాయతీలకు భవనాల నిర్మాణం గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఈజీఎస్‌ లో నిధుల మంజూరుకు అధికారులకు నివేదించాం.

-  వెంకట్రాములు, ఎంపీడీవో, ఆమనగల్లు 

Advertisement
Advertisement