Abn logo
Oct 12 2020 @ 01:24AM

నిస్సంగుని నిర్గమన వాచకం

Kaakateeya

చిత్రకొండ గంగాధర్‌ ఇరవై సంవత్సరాల క్రితమే pandemic backdrop లో ‘మృత నగరంలో’ నవల రాశాడు. తన ఆత్మ కథనాత్మక నవల ఇది. స్థల కాలాలను వెనుకాముందుకు జరిపి ఒక భీతావహ నిర్మానుష్య నగరంలో అనుభవాలను చవిచూసిన ఒక ముగ్గురి కథ. ఇళ్ళల్లో వీధుల్లో మనుషుల జాడలే లేని, ఏ చిన్నపాటి శబ్దం కూడా లేని, టీవీ సెల్‌ఫోన్‌ల చొరబాటు లేని మహా నిశ్శబ్దపు నగర వాకిలిలోకి ఆగంతకుడి ప్రవేశంతో మొదలవుతుందీ నవల.


మహావిధ్వంసాలూ, విలయాలూ మనకు చెప్పిరావు. వాటి మార్మికత తెలుసుకోవడం అటుంచి కనీసం వాటి అడుగుల చప్పుళ్ళు కూడా మనకు వినిపించవు. మన స్వప్నాల్లోనే వాటి architecture, composition రేఖామాత్రంగా తెలిసివస్తూం టుంది. అవి కమ్ముకుంటున్నప్పుడు ఒక్కడే తనను తాను ఏ ఉద్విగ్నం లేకుండా.. ఏ protest లేకుండా నిలబడి వినయంగా విలయానికి సమర్పించుకోవాల్సివుంటుంది. అంతే. మన అభివృద్ధి రంగస్థలమంతా పెచ్చులూడి, వేదిక కూలి annihilationకి దారి ఇవ్వవలసిందే. And all development is hoax అంటూ నిర్భయంగా ప్రకటించిన కవిత్వం, కథ, నవలల ఉనికి మనకు లేదు. అటువంటి సాహిత్యం మనకు దూరం. తత్వాన్నీ, విచారాన్నీ, చింతననూ దరిచేరనివ్వం. అంతిమత్వాన్ని ఒప్పుకోం. నిశ్చయమని కూడా మనకు అనిపించదు. కనుమరుగైపోయేదానిని వీక్షిస్తూ మన లోపలి శక్తి మొత్తం వొక అని వార్య నిస్సహాయతగా వ్యక్తమవుతుంటే మెల్లగా absenceలోకి జారి పోవటమన్నది గొప్ప literary experience. అటువంటి అనుభవం దొరుకుతుంది చిత్రకొండ గంగాధర్‌ రచనల్లో లేదా నెరెటివ్‌లో. 

గంగాధర్‌ వొక అరుదైన కవిత్వ రచయిత. అతని కవిత్వానికీ వచనానికీ మధ్య పెద్ద సరిహద్దు గీతలుండవు. వొకదానికొకటిగా మారిపోయే భాషా చిత్ర సమ్మేళనం తన రచన. సరిహద్దులు దాటితే పాఠక విమర్శకులు కొరడా శిక్ష విధిస్తారని తెలిసినా తను అలాగే రాస్తూపోయాడు. ప్రధానంగా వొక సత్యాన్వేషి కావడం వల్ల, ఛీట్ఛ్చఝ్ఛట కావడం వల్ల, విప్లవ సంచారి కావడం వల్ల.. సరిహద్దులు తనని ఎప్పుడూ భయపెట్టలేకపోయాయి. 


ఏ రచన అయినా కొత్త ఆలోచనను పాఠకుల అనుభవానికి ప్రెజెంట్‌ చెయ్యాలి. అటువంటి రచనాకారుడి consciousness ని పట్టించుకోవాలి. దాని గురించి సాహిత్యంలో ముచ్చట్లు పెట్టాలి. మూలసారాలను వెలికితీసి మరుగుపరిచిన సత్యాలను విడుదల చెయ్యాలి. సాహిత్య నిర్బంధాలను వెక్కిరించాలి. ఇదంతా జరగాలంటే పాఠకులుండాలి. పాఠకులే కొత్త పనిముట్లను అందివ్వగలుగుతారు. పాఠకులే కరువైన దుస్థితి మనది. ఆధిపత్య రాజకీయ సామాజిక సాహిత్య ఎజెండాలలో పాఠక విమర్శ పనిముట్లు సానదేలవు. చదవడం, మనలోపలి పాఠకుడ్ని evolve చేయడం అన్నది గొప్ప ప్రాసెస్‌. అదంతా సృజనశక్తికి సంబంధించిన అంశమే. ఇప్పుడు కొత్త పాఠకుని పుట్టుక అవసరం. అనివార్యం. 


అటువంటి కొత్త పాఠకుడి కోసమే చిత్రకొండ గంగాధర్‌ కవిత్వమూ, నవల ఎదురుచూస్తుంటా యని నాకనిపిస్తూఉంది. అవి సిద్ధంగా తయారయ్యి పాఠక సమా గమంకోసం ప్రియ ప్రేమికుడిలాగా, ప్రేయసిలాగా ఎదురు చూస్తు న్నాయి: ‘‘స్నేహితులు వీడ్కోలు తీసుకొని విడిపోయారు/ కానీ/ వారి కరచాలనపు ఎముకలు ఇంకా విడిపోలేదు/ వాటికింకా జీవించాలని వుంది/ వాళ్ళ మరణం తర్వాతా’’. (‘ఆత్మహత్యా సదృశ దేశదిమ్మరి ఆఖరి కోరిక పత్రశకలం’) పుస్తకాలతో పాఠకునికి ఎప్పుడూ ఒక శాశ్వత సంబంధం వుంటుంది. అది ఎప్పటికీ తెగిపోదు. అంతమూ కాదు. మనకోసం ప్రతిసారీ వొక కొత్త తలుపు ఆకాశాన్ని తెరుస్తూనే ఉంటుంది. 


గంగాధర్‌ ‘పత్రశకలం’ కవిత్వ సంకలనం కానీ, ఇప్పుడు మనముందుకొచ్చిన ఈ ‘మృతనగరంలో’ నవల కానీ.. వాచకస్థాయిని సంతరించుకొన్న పుస్తకాలు. మన ఉద్వేగాలను, చింతననూ తట్టిలేపి, మనకోసం వొక ప్రత్యేక కాల నిర్మాణాన్ని రచించే పుస్తకాలు. వాటిని మనం చదవడం మామూలుగా పూర్తిచేసినా పఠనం ఇంకా మొదలే కాలేదు. ‘The School of Dreams’లో Hélène Cixous చెప్పుకున్నట్లు చదవ డానికి పఠనానికీ మధ్య చాలా అగాధముంటుంది. చదవడం ఆగి పోతుంది. పఠనమే పూర్తికాదు. రచన లోపలి విస్మ్రృతాంశాల్లోంచే కొత్త సముద్రాల సూర్యకిరణాలు, వెన్నెలమెట్లూ జారిపడుతుంటాయి. త్రిపురగార్ని కలిసి మాట్లాడినప్పుడు తను కాఫ్కాని పూర్తిగా ఎప్పుడూ complete య్యలేకపోయానని దుఃఖపడ్డాడు. అందుకే పఠనం- చాలావరకూ అసమగ్రమే అవుతుందనిపిస్తుంది ఎప్పటికీ. 


తెలుగులో మనకు ఇప్పుడు కావలసింది పఠన స్థాయిని అందుకొని మంచికో చెడుకో, రక్తపాతానికో రక్తశుభ్రతకో,  implosionకో explosionకో గురిచేసి ఈ నిచ్చెనమెట్ల అవ్యవస్థని లోపలినుంచీ బైటినుంచీ కూల్చి మనల్ని విధ్వంసం చేయాల్సిన పుస్తకాలు. తిరిగి మనల్ని కొత్తగా గర్భస్థం చేయాల్సిన పుస్తకాలు. అవి మనల్ని ఎప్పటికీ చేరుకోవు. మన పాఠకత్వం మెరుగుపరుచుకున్నప్పుడు మంచి పుస్తకాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం గంగాధర్‌ కవిత్వానికి వివశుణ్ణై మొదటిసారి పలకరించాను ‘ప్రెజెంటెన్స్‌’ పాఠక వ్యాసాలలో. పలవరించి అనుభవించిన సాంద్రత, కొత్త imagery ఇంకా ఇంకా నన్ను వివశత్వంలోకి ఊయల ఊపుతూనే ఉంది. ఇటువంటి energy ఈ నవలాకారుడికి ఎలా సంక్రమించింది. ఏ DNA విస్ఫోటనం వలన, traits వల్ల సంభవిస్తుందో మనమెప్పటికీ ఆలోచించలేదు. 


రాయటమే కాదు, చదవటం కూడా సృజనలో భాగమని అనుకున్నప్పుడే మంచి పుస్తకాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎదురు నిలబడి మనం మొహాలు తిప్పుకుంటున్నా ఆపి పలకరిస్తాయి. ముందు మనం చదవడం కూడా సృజనలో భాగమేనని అంగీకరించాలి. చిత్రకొండ గంగాధర్‌ ఇరవై సంవత్సరాల క్రితమే pandemic backdropలో ‘మృతనగరంలో’ నవల రాశాడు. తన ఆత్మకథనాత్మక నవల ఇది. స్థల కాలాలను వెనుకాముందుకు జరిపి ఒక భీతావహ నిర్మానుష్య నగరంలో అనుభవాలను చవిచూసిన ఒక ముగ్గురి కథ. తను ఎంతో ఇష్టపడే గ్రీకు మైథాలజీలోని ఇకారస్‌, ఎడ్వర్డ్‌, స్ర్టోకర్‌ పాత్రలను morph చేసుకొని నడిపిన dramatic monologue కథనం ఇది. ఇళ్ళల్లో వీధుల్లో మనుషుల జాడలే లేని, ఏ చిన్న పాటి శబ్దం కూడా లేని, టీవీ సెల్‌ఫోన్‌ల చొరబాటు లేని మహా నిశ్శబ్దపు నగర వాకిలిలోకి ఆగంతకుడి ప్రవేశంతో మొదలవుతుందీ నవల.


గంగాధర్‌ ఈ నవలలో చాలావరకు చిత్రిక పట్టిందంతా మృత నిశ్శబ్దాన్నే. అంతా చనిపోయి, అచేతన మయిపోయి మనల్ని క్రమంగా మృతనిశ్శబ్దపు అంచులవరకూ నడిపించి ఆకాశ సముద్ర లోయల్లోకి నెట్టిపారేసే భయా నకమైన వొంటరితనం. దాంతో ఎదురుబడి తలబడి పోరాటం చేసే సజీవ నిశ్శబ్దం. నగ రంలో అన్నీ వుంటాయి. మనుష్య సంచారం ఉం డదు. ఎవరు ఎక్కడికి వె ళ్ళారో తెలియదు. నగరం చుట్టూ వొక సముద్రతీరం. నిద్ర లోపల, మన కల ల్లోపల వొంటరిగా మసలే నగరం వంటి జీవితం. రచయిత తన అనుభవాల్ని ఫస్ట్‌పెర్సన్‌లో చెప్పుకుంటూ వెళ్తూ వొక మహా దారుశిల్పం.. నగ్న స్త్రీ రూపంతో కనబడితే ఆశ్రయం కోసం అందు లోకి దిగి సేద తీరతాడు. శిల్పపు లోగోడల మధ్య అతనికీ, అతని అంతరంగ ప్రపంచానికీ నడుమ సంభాషణలు మొదలవుతాయి. ఆ తరువాత రోజుల్లో.. నిర్మానుష్య నగరంలో తిరుగుతూ తారసపడే ఎడ్వర్డ్‌, స్ర్టోకర్‌ వంటి పాత్రలు ఇకారస్‌తో కలిసి ఉనికి కోసం చుట్టూవున్న కేవల వస్తు ప్రపంచంతో, ప్రకృతితో మెల్లమెల్లగా unfold అవుతూపోయే అస్తిత్వ అగాధ పోరాటం. గంగాధర్‌ ఎన్నుకున్న వచనం పూర్తిగా కవిత్వ వచనమే అవ్వడం ఈ నవలలోని విశిష్టత. చాలా సందేహాలు, ప్రశ్నలు (సమాధానాలు కూడా భయపడే ప్రశ్నలు) కమ్ముకుని, భయంలో చిక్కుకుని, భీతిగా బయటి ప్రకృతిలోకి చొరబడి మళ్ళీ తన తనంలోకి చొరబడతాయి. ఎవరెవరో ఖాళీచేసి హఠాత్తుగా ఏదో విరుచుకుపడి తోసుకువెళ్తే, తన పనుల్ని ఉన్నపళంగా మధ్యలోనే వదిలేసి, స్పర్శల్నీ గొంతునీ నొక్కుకుపోయిన వెక్కిళ్ళనీ వొదిలేసి, భయాలతో మాత్రమే చేసుకున్న వాంతుల్నీ అపశబ్దాల్నీ అపనిశ్శబ్దాల్నీ వొదిలేసి, తట్టాబుట్టా వొదిలేసి, ఉన్న దాన్ని ఉన్నట్టుగా తన్ని ఎక్కడికో  వెళ్ళిపోవడం... అటువంటి స్థితి ఎటువంటి భయసందేహాల్ని కలిగిస్తుంది! మృత్యువుకంటే మరింత లోతైన డార్క్‌నెస్‌ ఏదో తరుముతుంటుంది. అటువంటి స్థితిని... సాధ్యమయినంతవరకు పాఠకుడికి దగ్గరగా తీసుకువచ్చేది నిజాయితీ. ఏ తాత్విక pretentions లేని బరువైన సిద్ధాంతాల ముళ్ళకిరీట ధారణలేని జీవితాన్ని సూటిగా దర్శించిన poetic dreamerకే ఇటువంటి నిజాయితీ సాధ్యమవుతుంది. ఈ గుణం కోసం కవి, రచయిత అన్నింటినీ వదులుకోగలగాలి. చివరికి తన సృజన లౌల్యాన్నికూడా. 


దేంట్లోనూ మనిషితనం కనబడక, తనని తానే ఎప్పటికప్పుడు తను మారాలనుకునే అస్తి త్వంతో శుభ్రపడుతూ, స్థలాలు మారుస్తూ, మౌనాన్నే తన భాషగా మార్చు కుని, నిస్సంగత్వంతో జీవించిన spiritual protaganist కి మాత్రమే సాధ్యమయ్యే కథ ఇది. తన జీవితంలో ముం దుగా జరగబోయే సన్నివే శాలను, తన అవాంతరాలను, తొలిచే దుఃఖాలనూ, చివరగా తన నిష్క్రమణాన్ని కూడా స్ర్కిప్ట్‌ చేసి కథగా చెప్పుకొచ్చాడు గంగాధర్‌. తనకి సంపదలంటే, అంకెలంటే, planned life అంటే అయిష్టం. 


గాఢత లేనిది ఎంత గొప్పదయినా కాలితో తన్నడమే. ఇష్టం పుట్టించనిది ఎంత ఉన్నతమయి నదయినా ఆ ప్రదేశాన్ని ఖాళీచేయటమే. తన దృష్టిలో.. dead bodies మాత్రమే మృత నగరంలో ఉంటాయి. అతినీచపు పద్ధ తుల్లో తోటి మనుషులపై అజమాయిషీ చెలాయించడం ఎలాగో train చేస్తాయి. గింజలు పడేసి పనులు చేయించడం నేర్పుతాయి. ఒకరి భుజాలమీద నిలబడి కింద మోసేవాడ్ని తెలివి హీనుడ్ని చేసి ఆనందించే తెలివితేటల్నిస్తాయి. ఎన్నెన్ని ఉపద్రవాలు వచ్చినా ముంచినా పూర్తిగా జీవితం తుడిచిపెట్టుకుపోయినా ఇక మనిషి మారడని తెలిసిపోయింది. ఈ భూమి తనకు చెందిన ప్రదేశం కాదని స్పష్టమయింది. అందుకనే తన స్వస్థలాన్ని, తన ఇంటిని వెదుకుతూ నీటితో తన పూర్వికులకు వున్నటువంటి రక్త సంబంధాన్ని invoke చేస్తూ ప్రాణాలను ఖాళీచేతుల్తో మోస్తూ తను కలలు గన్న లోకాలకు వెళ్ళిపోయాడు. ఇదంతా చాలా metaphorical గా అనేక సందర్భాలలో నవలలో చెప్పుకువస్తాడు. నవలలోని ఇకారస్‌ పాత్రగా మృత్యువుని అంగీకరిస్తూ, చనిపోవడానికి ఉప్పొంగి మీదికి వచ్చే సముద్రం వంటి మొండితనం కావాలి అనిపిస్తాడు.


శ్రీకాకుళం ప్రాంతం నుంచి బయలుదేరి, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర లోని చాలా ప్రాంతాలను తిరుగుతూ, హౌరా, చెన్నై, బెంగుళూరు వెళ్ళి, హైదరాబాద్‌ అటునుంచి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను తిరుగుతూ.. ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్స్‌లో తన స్నేహితుల్తో మసుల్తూ... చాలావరకు నిశ్శబ్దంగా వుంటూ.. ఎక్కువగా వింటూ.. చాలా చాలా చదువుతూ.. బతకడానికి సెంట్రింగ్‌ పనులు చేస్తూ తనను తాను వెదుక్కునే క్రమంలో.. తన సాహిత్య భాషగా.. ఇంత ఈ semi urban stylish language ఎన్నుకోవడం.. అది పాఠకులకు చదువుతున్న కొద్దీ ‘నీరా’లాగ గుండెలోకి దిగుతూ..  భయోద్విగ్న విషాదలీనమవుతూ వుంటుంది. 


ఇది పాఠకుడి నవల. తనతో తాను.. తానెవరో తెలియని ఇంకొకడితో చేసే సంభాషణ. ఈ కరోనా కాలంలో ఇటువంటి ఇప్పటి మానవ అస్తిత్వ సంక్షోభాన్ని ఇరవై ఏళ్ళ క్రితమే ఎదుర్కొన్నాడు. మన సాహిత్యక్షేత్రంలో ఇప్పటి literary generationలో చిత్రకొండ గంగాధర్‌ నిస్సంగ కవి. ఇతని రచనల్లో దుఃఖం, ప్రేమ రాహిత్యం, తీవ్రమైన అస్తిత్వ దప్పిక.. దూప... ఆర్తి.. పండీ... పండీ పుండై రాలి పడిపోతుంది. గాయం ఎప్పుడూ పచ్చిగానే ఉండి తనను జ్ఞాపకం చేసుకుంటూ వుంటుంది. అతని అధోజగత్‌ సహోదరులతోపాటు. I write at night. I write: the Night. The Night is such a great deity that one day she ended by incarnating herself and appearing in one of my plays. The Night is my other day. - Hélène Cixous

సిద్ధార్థ, 73306 21563

(చిత్రకొండ గంగాధర్‌ ‘మృతనగరంలో’ నవల 

పల్లవి పబ్లికేషన్స్‌ ద్వారా ప్రచురితం)

Advertisement
Advertisement