Abn logo
May 16 2021 @ 17:09PM

ఐసిస్ ప్రచారంపై మధురైలో ఎన్ఐఏ సోదాలు

మధురై : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం మధురైలో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించింది. నేరారోపణ చేయదగిన ఫేస్‌బుక్ పోస్ట్‌లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా సోదాలు చేసింది. మహమ్మద్ ఇక్బాల్ ఈ పోస్ట్‌లు పెట్టినట్లు, ఆయన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు  అనుమానిస్తున్నారు. హిజ్బ్-ఉట్-తహ్రీర్ అనే ఛాందసవాద సంస్థ సిద్దాంతాలను కూడా ఆయన ప్రచారం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ వివరాలను ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. 


తమిళనాడు పోలీసులు గత ఏడాది నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ దర్యాప్తు జరుగుతోంది. ఫేస్‌బుక్‌లో నేరారోపణ చేయదగిన పోస్ట్‌లను పెడుతున్నట్లు ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఏప్రిల్ 15న ఎన్ఐఏ చేపట్టింది. 


నిందితుడు ఇక్బాల్ వివిధ మతాల మధ్య అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఫేస్‌బుక్ పోస్టులు పెట్టినట్లు ఎన్ఐఏ ప్రకటన పేర్కొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిధంగా ఈ పోస్ట్‌లు ఉన్నట్లు తెలిపింది. ఇక్బాల్ వురపు సెంథిల్ కుమార్ మధురైలోని కజిమర్ వీథిలో ఉంటున్నాడని, డిసెంబరు 2న స్థానిక పోలీసులు అరెస్టు చేశారని, ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని తెలిపింది. 


మధురైలోని కజిమర్ వీథి, కే పూడూర్, పెథనియపురం, మెహబూబ్ పలయంలలో సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సోదాల్లో ఓ లాప్‌టాప్ సహా 16 డిజిటల్ డివైసెస్, హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు, మెమరీ కార్డులు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు, పుస్తకాలు, కరపత్రాలు వంటివాటిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.