Abn logo
Sep 21 2021 @ 00:21AM

వచ్చే ఏడాది కష్టకాలమే

  • ధరల పోటు తప్పదు 8  నెస్లే ఇండియా చీఫ్‌ సురేశ్‌ నారాయణన్‌


న్యూఢిల్లీ: ధరలపరంగా చూస్తే వచ్చే ఏడా ది కష్టకాలమవుతుందని నెస్లే ఇండియా భావిస్తోంది. ఆహారోత్పత్పుల ధరలు పెరిగి ఆ ప్రభావం ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపైనా పడుతుందని నెస్లే ఇండియా చీఫ్‌ సురేశ్‌ నారాయణన్‌ చెప్పారు. ముఖ్యంగా పాలు, కాఫీ, కోకో, వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వియత్నాంలో కాఫీ పంట దెబ్బతినడంతో కాఫీ ధరల సెగ ఇప్పటికే కనిపిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గత ఆరు నెలలుగా చూస్తే మాత్రం పాలు, గోధుమ వంటి ప్రధాన ముడి పదార్ధాల ధరలు స్థిరంగానే ఉన్నట్టు చెప్పారు. అయితే ముడి చమురు, ప్యాకింగ్‌ ఖర్చులు పెరగడంతో నెస్లే ఉత్పత్తుల ధరలు ఒకటి నుంచి మూడు శాతం వరకు పెంచాల్సి వచ్చిందన్నారు. 


పాల ‘పొంగు’ తప్పదు: వచ్చే ఏడాది దేశంలో పాల ధర మరింత పెరుగుతుందని నెస్లే ఇండియా భావిస్తోంది. కొవిడ్‌ కారణంగా ఏర్పడిన అవాంతరాలతో రైతులు కొత్త పాడి పశువులను సమకూర్చుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణమని నారాయణన్‌ చెప్పారు. అమెరికా, యూరప్‌ వంటి ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడమూ.. కొన్ని ఆహారోత్పత్తుల ధరల పెరుగుదలకు కారణం కానుందన్నారు. ఉత్పాదకత పెంచుకోవడం ద్వారా ధరల పెరుగుదల ప్రభావం నుంచి బయటపడేందుకు నెస్లే ఇండియా ప్రయత్నిస్తుందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉండడం ఇందుకు కలిసి వస్తుందన్నారు.


డిమాండ్‌కు ఢోకా లేదు: ప్రస్తుతం డిమాండ్‌కైతే ఎలాంటి ఢోకా లేదని నారాయణన్‌ అన్నారు. పట్టణ వినియోగదారులతో పాటు మధ్య తరగతి ప్రజలు విశ్వసనీయమైన కంపెనీల ఉత్పత్తుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్టు ఆయన చెప్పారు. పొషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారోత్పత్తులపై వినియోగదారులు ప్రస్తుతం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం పండగల సీజన్‌ అమ్మకాలు గత ఏడాది కంటే మెరుగ్గా ఉంటాయని నారాయణన్‌ తెలిపారు.