Advertisement
Advertisement
Abn logo
Advertisement

పసిడి మళ్లీ డీలా!

కరోనా మూడో దశ ఉధృతితో  తగ్గుతున్న బంగారం కొనుగోళ్లు 


న్యూఢిల్లీ: సాధారణంగా పెళ్లిళ్ల సీజన్‌లో భారీగా బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. ఈ నెల ద్వితీయార్ధం నుంచి మే చివరివరకు పెళ్లి ముహూర్తాల సీజన్‌. కానీ, దేశంలో ఒమైక్రాన్‌  విజృంభణ కారణంగా పెళ్లిళ్లపై అనిశ్చితి పెరగడంతో పసిడికి గిరాకీ మళ్లీ తగ్గిందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే, గత నెలాఖరులో 10వేల స్థాయిలో నమోదైన రోజువారీ కరోనా కేసులు.. గురువారం నాటికి రెండున్నర లక్షల స్థాయికి పెరిగాయి. వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, ప్రజలు అధిక సంఖ్యలో ఒకే చోట గుమిగూడటంపై నిషేధం వంటి ఆంక్షలు విధించాయి. దాంతో గోల్డ్‌ షాపులను సందర్శించే కస్టమర్ల సంఖ్య కూడా తగ్గిందని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఆశిష్‌ పేటే అన్నారు. మూడో దశ వైరస్‌ ఉధృతి ప్రభావంతో ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం గిరాకీ మళ్లీ మందగించనుందని అన్నారు. అయినప్పటికీ, ఆభరణ వర్తకులు జాగ్రత్తతో కూడిన ఆశాభావంతో ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్చిలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడవచ్చని, ఏప్రిల్‌-మే నెలల్లో వివాహాలు మళ్లీ జోరందుకోవచ్చని ఆయన అన్నారు. రెండో దశ వైరస్‌ వ్యాప్తి దెబ్బకు గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో తగ్గిన పసిడి గిరాకీ.. ద్వితీయార్ధం (జూలై-డిసెంబరు)లో క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. దాంతో దేశంలోకి బంగారం దిగుమతులు ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. 


గడిచిన రెండేళ్లలో బులియన్‌ మార్కెట్‌కు నిరాశే మిగిలింది. కరోనా వ్యాప్తి కారణంగా చాలా పెళ్లిళ్లు వాయిదా పడటం పసిడి గిరాకీపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే, పూర్తి లాక్‌డౌన్‌లు విధించే ఆలోచన లేనందున వ్యాపారాలపై మూడో దశ వ్యాప్తి ప్రభావం అంతగా ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ప్రకారం.. గత ఏడాది జనవరి-మార్చి కాలానికి దేశంలో పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 37 శాతం పెరిగి 140 టన్నులుగా నమోదైంది. గత సంవత్సరం మొత్తానికి నమోదైన గిరాకీ గణాంకాలను ఇంకా విడుదల చేయాల్సి ఉంది.


ఫెడ్‌ రేట్లు, ద్రవ్యోల్బణమే  ఈ ఏడాది బంగారం డిమాండ్‌కు కీలకం 


అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు, డాలర్‌-రూపాయి మారకం రేటులో మార్పులకు అనుగుణంగా మన దేశంలో బంగారం, వెండి ధరలు పెరగడం లేదా తగ్గుతాయి. ఈ ఏడాది అంతర్జాతీయంగా పసిడి ధరలను ప్రభావితం చేయనున్న అంశాలపై డబ్ల్యూజీసీ గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఎంత వేగంగా పెంచనుంది..?, వడ్డీ రేట్ల పెంపు ఆ దేశ ద్రవ్యోల్బణాన్ని ఎంతవరకు నియంత్రించగలదన్న అంశాలే స్వల్పకాలంలో బంగారం ధరలకు దిశా నిర్దేశం చేయనున్నాయని రిపోర్టు పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు.. 


ఫెడ్‌ రేట్ల పెంపు బంగారం ధరల ర్యాలీకి ప్రతిబంధకం కావచ్చు. అయితే, ఈ ప్రభావం పరిమితమేని చరిత్ర చెబుతోంది. 


అమెరికాలో ఆందోళనకర స్థాయికి పెరిగిన ధరల ద్రవ్యోల్బణం, కరోనా సంక్షోభ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్ల పతనం వంటి అంశాలు పసిడి డిమాండ్‌ను పెంచే అవకాశాలున్నాయి. ఎందుకంటే, బంగారానికి అనిశ్చిత పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరుంది.


ఆభరణ వర్తకులు, సెంట్రల్‌ బ్యాంక్‌ల కొనుగోళ్లు బంగారానికి దీర్ఘకాలికంగా మద్దతు కల్పించనున్నాయి. ఈ ఏడాది భారత వంటి బడా ఆభరణాల మార్కెట్‌ నుంచి బంగారం గిరాకీకి మద్దతు లభించనుంది.  


హెడ్జింగ్‌ సాధనంగా బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఏడాది సరైన సందర్భం. 

Advertisement
Advertisement