Abn logo
Oct 23 2020 @ 07:45AM

‘అయ్యో పాపం’ అంటూ మొసలికన్నీరు

Kaakateeya

హత్య చేశాడు.. అందరిలో కలిసి తిరిగాడు

మహబూబాబాద్‌: జర్నలిస్టు రంజిత్‌రెడ్డి కుమారుడు దీక్షిత్‌రెడ్డి(9)ని కిడ్నాప్‌చేసిన ఆదివారం రాత్రే గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే మంద సాగర్‌ బాలుడిని అంతమొందించాడు. ఆరోజు నుంచి బుధవారం తెల్లవారుజాము దాకా దీక్షిత్‌ తల్లి వసంతకు పలుమార్లు ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా రూ.45 లక్షలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాడు. అయితే నిందితుడు మంద సాగర్‌ తనకు ఏమీ తెలియనట్లు సోమవారం నుంచి మూడు కొట్ల సెంటర్‌లో తన ఆటోమొబైల్‌ షాపునకు వస్తూ విధులు నిర్వర్తిస్తునాడు. పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో జనంలోనే కలిసి తిరుగుతున్నాడు. బుధవారం కూడా మూడు కొట్ల సెంటర్‌కు రూ.45 లక్షలు తీసుకురావాలని బాలుడి తల్లికి ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా తెలిపి అక్కడ జరిగే తంతును కళ్లారా చూస్తూ రాక్షసానందం పొందినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ‘అయ్యో పాపం’ అంటూ మొసలికన్నీరు కార్చినట్లు తెలుస్తోంది.

పోలీస్‌ అధికారులకు డ్రైవర్‌గా..

నాలుగు సంవత్సరాల క్రితం మహబూబాబాద్‌ రూరల్‌, టౌన్‌ పోలీస్టేషన్‌లలో పోలీస్‌ అధికారులకు సాగర్‌ డ్రైవర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. అప్పుడు అన్ని రకాల కేసులకు సంబంధించిన నేరస్తులను చూసేవాడు. అప్పుడు బాగానే ఉన్నప్పటికీ ఆతర్వాత చాలా దురలవాట్లకు లోనైనట్లు తెలుస్తోంది. గంజాయిలాంటి వ్యసనాలకు అలవాటి పడి ఇంట్లో సరిగా ఉండేవాడు కాదని సమాచారం తెలుస్తోంది. ఈ క్రమంలో మూడుకొట్ల సెంటర్‌లో ఓ మెకానిక్‌ షాపులో ఆటోమొబైల్‌ వస్తువులను అమ్ముకుంటున్నాడు. పదిహేను రోజుల కిత్రం హత్య చేసిన బాలుడి ఇంటి వద్దకు వస్తూ తినుబండారాలకు రూ.పది, ఇరవై ఇస్తూ దీక్షిత్‌ను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాడు. ఆదివారం కూడా ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో బాలుడిని తన బైక్‌పై వచ్చి ఎక్కించుకుని వెళ్లాడు. పరిచయం ఉన్న వ్యక్తే కదా అని బాలుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ బైక్‌పై ఎక్కాడు. ఇదే అదనుగా బావించిన మంద సాగర్‌, దీక్షిత్‌ను అడ్డుపెట్టుకుని డబ్బులు డిమాండ్‌ చేయాలనుకున్నాడు.

Advertisement
Advertisement