Abn logo
Jul 11 2020 @ 04:32AM

గ్రామాలకు కొత్త రూపు

పీఎంఎ్‌సజీవై నిధులతో తారు రోడ్ల నిర్మాణం

రూ. 86.14 కోట్లతో పనులు

తొలగనున్న పల్లెవాసుల కష్టాలు


హన్మకొండ, జూలై 10, (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు గ్రామీణ రోడ్లు తారు రోడ్లుగా రూపుదిద్దుకోబోతున్నాయి. వెరసి పల్లెవాసుల కష్టాలు తీరబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సడక్‌ యోజన (పీఎంఎ్‌సజీవై) కింద ఇందుకోసం రూ 86.14 కోట్లు కేటాయించింది. వీటితో 123.468 కిలోమీటర్ల మేర 11 రోడ్లను అభివృద్ధి చేస్తారు. వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈ బీటీ రోడ్ల నిర్మాణాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన  వంతుగా నిధులను సమకూర్చాల్సి  ఉంటుంది.


కూడళ్ళను కలుపుతూ..

పల్లెల నుంచి మండల కేంద్రాలను కలుపుతూ ఈ తారు రోడ్లను నిర్మిస్తారు. ఇందుకు సంబంధించి ఆయా శాసన సభ్యులు   పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా ప్రతిపాదనలను పంపించారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం పీఎంజీఎ్‌సవై కింద నిధులను మంజూరు చేసింది. పంచాయతీ రాజ్‌ శాఖ త్వరలో ఈ రోడ్ల నిర్మాణాలను చేపట్టనుంది. ప్రతిపాదిత రోడ్ల పనులను ఎనిమిది నెలల్లోగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రహదారుల టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. మరో పక్షం రోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి.


 ప్రతిపాదిత రోడ్లు..

మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలంలో  శ్రీరామగిరి, వెంకటాపూర్‌ మీదుగా రాజులకొత్తపల్లి వరకు పీడబ్ల్యుడీ 5.17 కిమీ రోడ్డును రూ. 2.68 కోట్లతో చేపట్టనున్నారు. అదేవిధంగా డోర్నకల్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి తోడెళ్ళగూడెం, వెన్నారం మీదుగా ముల్కలపల్లి జాతీయ రహదారి వరకు మట్టి రోడ్డును తారు రోడ్డుగా చేస్తారు. 13.22 కీమీ ఈ రోడ్డు నిర్మాణానికి రూ 8.33 కోట్లను వెచ్చిస్తారు.


వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ మండలం అశోక్‌నగర్‌ నుంచి పెద్దమ్మగడ్డ వరకు 5.72 కిమీ మేర తారు రోడ్డును రూ 3.15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తారు. దుగ్గొండి మండలం బిక్కోజిపల్లి, పొనకల్‌ మీదుగా శివాజీనగర్‌ నుంచి లక్ష్మీపూర్‌ వరకు ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డును తారు రోడ్డుగా మారుస్తారు. 6.29 కిమీ ఈ రోడ్డును రూ 3.11 కోట్ల వ్యయంతో చేపడతారు. 


జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బాసిరెడ్డి పల్లి నుంచి కొడవటూరు మీదుగా 9.60 కిమీ మేర రూ. 5.53 కోట్ల ఖర్చుతో బీటీ రోడ్డును నిర్మిస్తారు. దేవరుప్పుల నుంచి  కొత్తగుడిసెలు, ధర్మాపురం, మైలారం మీదుగా విస్నూర్‌ వరకు ఉన్న మట్టి రోడ్డును తారు రోడ్డుగా మారుస్తారు. ఈ రోడ్డు పొడవు 13.5 కిమీ. రూ. 9.72 కోట్లతో దీనిని అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా పాలకుర్తి మండలం గూడూరు పీడబ్ల్యుడీ రోడ్డు నుంచి ఈరవెన్ను, శాతాపూర్‌, మాధాపూర్‌ మీదుగా ధర్మాపురం వరకు ఇప్పుడున్న మట్టి రోడ్డు స్థానంలో తారు రోడ్డు వేస్తారు. 20.03 కిమీ పొడవైన ఈ రోడ్డుకు రూ. 14.97 కోట్ల వ్యయంతో కొత్తరూపు నిస్తారు.


దాంతోపాటు పాలకుర్తి నుంచి వల్మిడి, ముత్తారం మీదుగా కొడకండ్ల వరకు 18.49 కిమీ రోడ్డును రూ 13.09 కోట్ల వ్యయంతో తారు రోడ్డుగా మారుస్తారు. జనగామ జిల్లా కేంద్రంలో చౌడారం పీడబ్ల్యుడీ రోడ్డును మరిగడి, టీక్యాతండా, ఎర్రగొల్లపహాడ్‌, దొడ్లగడ్డ తండా మీదుగా హనుమంతాపూర్‌ పీడబ్ల్యుడీ రోడ్డు వరకు తారు రోడ్డుగా మారుస్తారు. ఈ రోడ్డు పొడవు 6.20 కిమీ. రూ. 3.59 కోట్లను ఇందు కోసం వెచ్చిస్తారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలోని పీడబ్ల్యుడీ రోడ్డు నుంచి నీర్మాల, రామరాజుపల్లి మీదుగా జీడికల్‌ వరకు 13.50 కిమీ రోడ్డును రూ. 11.49 కోట్లతో తారు రోడ్డుగా మారుస్తారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను నుంచి కోతులబాద్‌, గబ్బెట మీదుగా రఘునాథపల్లి మండలం కంచనపల్లి వరకు 12.10 కిమీ రోడ్డును రూ. 10.43 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. 


ఈ మూడు జిల్లాలకు..

ప్రధాన మంత్రి సడక్‌ యోజన కింద  ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి,  వరంగల్‌ అర్బన్‌ జిల్లాలకు నిధులు మంజూరు కాలేదు. అర్బన్‌ జిల్లా పరిధిలో చాలా వరకు  తారు రోడ్లు ఉన్నాయి. అంతర్గత రోడ్ల అభివృద్ధి జరిగింది.  ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు ఏజెన్సీ ఏరియాలో కావడం వల్ల వాటికి వేరే పద్దు కింద కేంద్ర ప్రభుత్వం ఇది వరకే నిధులను మంజూరు చేసింది. తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో మెరుగైన రహదారుల నిర్మాణానికి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.320 కోట్లను మంజూరు చేసింది.  తీవ్రవాద ప్రభావిత  ప్రాంతాలుగా కేంద్రం నిర్ణయించిన అయిదు జిల్లాల్లో ములుగు,  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి.  కేంద్రం  ఇచ్చిన ఈ నిధులతో ఈ రెండు జిల్లాల్లో రహదారులను నిర్మిస్తారు. త్వరలో టెండర్లను ఆహ్వానించాలని రహదారులు, భవనాల శాఖ నిర్ణయించింది.

Advertisement
Advertisement