Abn logo
Sep 29 2020 @ 01:24AM

నయా దోపిడీ..!

Kaakateeya

ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో మూడింతలు వసూల్‌

దరఖాస్తుకు అదనంగా రూ.5వేల వరకు దోచేస్తున్నారు..

అక్రమార్కులకు కాసులపంట.. పట్టించుకోని అధికారులు


పరిగి: లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) అక్రమార్కులకు కాసుల పంట కురిపిస్తోంది. అవినీతికి తావు లేకుండా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ ఉన్నప్పటికీ మీ-సేవా కేంద్రాల్లో ప్రతి అప్లికేషన్‌కు అద నంగా వసూలు చేస్తున్నారు. రూ.1000 ఫీజు ఉండగా, ప్రైవేట్‌ నెట్‌ సెంటర్లు, ప్లానర్లు రూ.1500 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌లో మునిసిపాలిటీల ఆదాయం మాట అటుంచితే.. దళారులకే ఎక్కువగా లాభం జరుగుతోంది. మునిసిపల్‌ శాఖ అధికారుల తీరుతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా దోపిడీకి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలవారు డబ్బులు కూడ బెట్టుకునో, భూములు అమ్ముకునో, అప్పులు చేసో పట్టణంలో ప్లాట్‌ కొనుక్కున్నారు. ఇప్పుడు వారిని ఎల్‌ఆర్‌ఎస్‌ కుదేలు చేస్తున్నది. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ వివిధ స్థాయిల్లో ముట్టజెప్పుతుండటంతో దోపిడీ దందా సవ్యంగా సాగుతున్నది. ఇందులో సామాన్య, మధ్యతరగతి వారే బాధితులవుతున్నారు. పరిగి పురపాలక సంఘం పరిధిలో 117 అక్రమ లేఅవుట్లను గుర్తించారు. వీటిలో 4,745 ప్లాట్లు ఉన్నట్లు తేల్చారు. ఈ ప్లాట్ల యజమానులంతా కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రెగ్యులరైజ్‌ చేసుకుంటేనే ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. అయితే అధికారులు కూడా ఎల్‌ఆర్‌ఎస్‌పై అవ గాహన సదస్సులు నిర్వహించారు. ఇప్పటివరకు దాదాపుగా ఒక్క పరిగిలోనే  2400మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అక్రమ వసూళ్లు లక్షలు కాదు, కోట్లలో ఉందనడంలో సందేహం లేదు. 


నెట్‌ సెంటర్లు, ప్లానర్ల ఇష్టారాజ్యం

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ ఆన్‌లైన్‌, నెట్‌ సెంటర్లతోపాటు, ప్లానర్లకు కాసుల పంట కురిపిస్తున్నది. ఈ నెల 8 నుంచి రిజిస్ర్టేషన్లు రద్దు చేసి, ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చింది. ప్రజలు తాము ఉంటున్న స్థలంలో వారి ఆధీ నంలో ఉన్న స్థలాన్ని తమ పేరిట రెగ్యులరైజేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అదే అదునుగా భావించిన నెట్‌ సెంటర్ల నిర్వా హకులు, ప్లానర్లు సరికొత్త దందాకే తెరలేపారు. ఏకంగా వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌మీడియాలో ఇచ్చట ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేయబడునని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది నమ్మి ఆశ్రయించిన వారిని మాటల్లో దించుతున్నారు. ఒక్కసారి మీరు దరఖాస్తు చేసుకుంటే మిగతా వ్యవహారమంతా మేమే చూసుకుంటామంటూ ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చిన దరఖాస్తుదారులను మభ్యపెడుతున్నారు. ఇందుకు అదనంగా ఖర్చు అవుతుందని తేల్చి చెబుతున్నారు. రూ.1500 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ దందా పరిగి మునిసిపల్‌ పరిధిలో ఇష్టారాజ్యంగా నడుస్తున్నది. మీ-సేవా సెంటరు నిర్వాహకులు భారీగా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్లాట్‌ దరఖాస్తుకు రూ.1000, యూజర్‌ చార్జీలు రూ.45 చెల్లించాల్సి ఉంటుంది. కానీ అడిగేవారు లేక ఇష్టా రాజ్యంగా మీసేవ కేంద్రాల వారు నిలుపునా దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే డెత్‌, బర్త్‌, పహానీ, నివాసం, ఇలా తదితర సర్వీసులకు అదనంగా వసూలు చేస్తున్నారు. 


పట్టించుకునేవారేరి..?

ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో వేలకు వేలు దోపిడీ జరుగుతోంది. అయితే ప్రజలు తమ పని జరిగితే చాలు అనుకుంటూ అదనంగా డబ్బు ఇస్తు న్నారు. అయితే ఈ దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కళ్లెదుటే ఇదంతా జరుగుతున్నా జనం ఫిర్యాదు చేయడం లేదనే కారణంతో పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేస్తే తప్ప స్పందించేది లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. వచ్చేనెల 15వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టుకోవాలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, అధికారులు ఈ వసూళ్ల దందాను అరికట్టాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.


వాల్యువేషన్‌ సర్టిఫికెట్‌కు అదనంగా డబ్బులు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుకు ఆస్తి వాల్యువేషన్‌, ఈసీ(ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌)లకు రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలోనూ అదనంగా వసూలు చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఇంటిస్థల వాల్యువేషన్‌, ఈసీలు తప్పనిసరిగా ఉండాలి. మామూలు రోజుల్లోనే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కూడా పైసలు ఇవ్వనిదే పని చేయరు. అవకాశం వచ్చినప్పుడు రెట్టింపుగా వసూలు చేస్తుంటారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పుణ్యమా అని అధికారులకు, దళారులకు కాసులపంట పండుతున్నది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా రెండు వేలకుపైగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి వాల్యువేషన్‌ ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. ఇంటి వాల్యువేషన్‌ సర్టిఫికెట్‌ను కేవలం రూ.10కే ఇవ్వాలి. అయితే ఇక్కడి కార్యాలయంలో రూ.100 నుంచి రూ.500ల వరకు వసూలు చేస్తున్నారు. ఈసీల గురించి అడిగితే ఇక్కడ ఇవ్వం, మీ-సేవలో తీసుకోండని సమాధానం ఇస్తున్నారు. ఒక వేళ ఈసీ ఇస్తే రూ.120కిగాను రూ.200 తీసుకుంటున్నారని చెబుతున్నారు. 


ఇదేం విచిత్రం..

ఎల్‌ఆర్‌ఎస్‌లో ప్రభుత్వం, అధికారులు చెబుతున్న విధానం విచిత్రంగా ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌లో ఫీజు తగ్గించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి విధితమే. ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ నాటి విలువ ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోవచ్చని సూచించారు. అది అమలులో మాత్రం భిన్నంగా ఉంది. దశాబ్దాల క్రితమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాటికి కూడా ఇప్పటి ఫీజు వసూలు చేయడం విచిత్రంగా ఉంది. పరిగిలో సర్వేనంబర్లు 271, 272, 273, 275లలో 1983లో అప్పటి జిపి నామ్స్‌ ప్రకారమే వెంచర్‌ వేశారు. అప్పట్లో 180 గజాల స్థలాన్ని రూ.750ల వాల్యువేషన్‌తో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. అదే వాల్యువ్‌తో ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు దీని ఎల్‌ఆర్‌ఎస్‌కు రూ.12 వేలకుపైగా అవుతుందని చెబుతున్నారు. ప్లాట్‌ విలువ కంటే ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎక్కువ కావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


ఎల్‌ఆర్‌ఎస్‌లో దోపిడీ - శశాంక్‌రెడ్డి, పరిగి

ఎల్‌ఆర్‌ఎస్‌లో వివిధ స్థాయిలో కుమ్మక్కై దోపిడీ చేస్తున్నారు. మా నాన్న 1983లో రూ.750లకు 180 గజాల ఇంటి స్థలాన్ని కొన్నాం. మంత్రి కేటీఆర్‌ చెప్పిన ప్రకారం రిజిస్ట్రేషన్‌ నాటి విలువతోనే ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని చెప్పారు. రూ.750ల విలువ ఉన్న స్థలానికి రూ.12 వేలు అడుగుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

Advertisement
Advertisement