Jul 26 2021 @ 04:03AM

కొత్త జోడీలు... కుదిరాయా?

జోడీ కుదిరిందా? లేదా? 

కొబ్బరికాయ కొట్టకముందే...

సినిమా సెట్స్‌కు వెళ్లకముందే...

ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమ వర్గాల్లోనూ...

అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్నాయి.

అటువంటి కొత్త జోడీలేవో చూడండి!


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ చేయబోయే చిత్రాల్లో కథానాయికల ఎంపిక పూర్తవలేదింకా. ఎన్టీఆర్‌-కొరటాల శివ చిత్రంలో కియారా అడ్వాణీ నటించే అవకాశం ఉన్నట్టు భోగట్టా. మధ్యలో పూజా హెగ్డే పేరూ వినిపించింది. చివరకు, కియారాకు ఓటేసినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రామ్‌ చరణ్‌-శంకర్‌ సినిమాలో కథానాయికగా ఉత్తరాది కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే, కన్నడ కస్తూరి రష్మికా మందన్నాను తీసుకుంటే ఎలా ఉంటుందని దర్శక-నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఎన్టీఆర్‌-కియారా, చరణ్‌-రష్మిక... జోడీలు కుదిరితే? వాళ్లు నటించే తొలి చిత్రాలు పైన చెప్పుకొన్నవి అవుతాయి. ఈ జోడీలను పక్కన పెడితే... మరో మూడు కొత్త జోడీలు తెరపైకి వచ్చాయి.


‘ఛత్రపతి’ రీమేక్‌తో హిందీ చలనచిత్ర పరిశ్రమకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభమైంది. అందులో కథానాయికగా రెజీనా కసాండ్రాను ఎంపిక చేశారట. ఇంతకు ముందు ‘ఏక్‌ లడకీ కో దేఖా తో ఐసా లగా’ అనే హిందీ చిత్రంలో నటించారామె. ఇద్దరు అమ్మాయిల మధ్య చిగురించిన ప్రేమకథతో రూపొందిన చిత్రమది. ఆ తర్వాత మళ్లీ హిందీలో నటించలేదు. బెల్లంకొండతోనూ ఇప్పటివరకూ సినిమా చేయలేదు. ‘ఛత్రపతి’ రీమేక్‌లో అవకాశం వస్తే... ఆమెకు బెల్లంకొండతో తొలి, హిందీలో మలి సినిమా అవుతుంది.


కొంచెం ఆలస్యంగా తెలుగుపై దృష్టి పెట్టిన తమిళ కథానాయకుడు ధనుష్‌. అయితే, ఇతర తమిళ హీరోలు చేస్తున్నట్టు అనువాద చిత్రాలతో కాకుండా స్ట్రయిట్‌ తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలుగు దర్శకులతో పాన్‌ ఇండియా చిత్రాలు ప్లాన్‌ చేస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. అది కాకుండా వెంకీ అట్లూరితో మరో సినిమా చర్చల్లో ఉంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ... సినిమా చేయడం ఖాయమే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు ముందువరుసలో ఉంది. ఇటీవల ఆమెకు కథ వినిపించినట్టు సమాచారం.


నితిన్‌ కొత్త సినిమాలో కథానాయిక విషయమూ కొన్నాళ్లుగా నలుగుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అందులో కృతీ శెట్టిని ఎంపిక చేశారనే వార్త చక్కర్లు కొడుతోంది. కృతీ శెట్టిని తీసుకున్నది వక్కంతం వంశీ సినిమాకు కాదనీ, ఎడిటర్‌ ఎస్‌ఆర్‌ శేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చేయబోయే సినిమా కోసమని తెలుస్తోంది. వక్కంతం వంశీ సినిమాలోనూ పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ కథ కూడా పూజా హెగ్డే విన్నారు. అయితే, సంతకం చేయలేదు. జోడీ అని చెప్పలేం కానీ... వరుణ్‌ తేజ్‌, తమన్నా ఓ పాటలో కనువిందు చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘ఎఫ్‌ 2’లో వీళ్లిద్దరూ స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నారు. పాటల్లో కలిసి కనిపించారు. అయితే, జోడీగా కాదు. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’లోనూ నటిస్తున్నారు. ఇందులోనూ జోడీగా కాదు. మరి, ఎందులో? అంటే... వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘గని’. ఇందులో సయీ మంజ్రేకర్‌ కథానాయిక. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ కొత్త జోడీకి తోడు మరో కొత్తదనం ఉంటే బావుంటుందని దర్శక-నిర్మాతలు భావించారు. వరుణ్‌ తేజ్‌, తమన్నాపై ప్రత్యేక గీతం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త జోడీలతో పాటు మరికొన్ని కొత్త జోడీలు చర్చల దశలో ఉన్నాయి.