Abn logo
Sep 18 2021 @ 00:24AM

గూడు.. గోడు

కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న లబ్ధిదారులు

డబుల్‌ ఇళ్ల కోసం రోడ్డెక్కుతున్న లబ్ధిదారులు

ఎమ్మెల్యేలను వెంటాడుతున్న అసమ్మతి భయం

లబ్ధిదారులను మభ్యపెడుతున్న దళారులు

సొంతింటి కోసం నాలుగేళ్లుగా నిరీక్షణ

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రప్రభుత్వం అత్యం త ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లపథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. నాలుగేళ్లుగా అర్హులైన లబ్ధిదారులు గూడు కోసం పడరాని గోసపడుతున్నారు. ఇదిగో..అదిగో అంటూ అధికారపార్టీ నేతలు కాలం గడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తమవుతుంది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇప్పటికి నేరవేర్చడం లేదంటూ ఆవేదనకు గురవుతున్నారు. జిల్లాకు రాష్ట్రప్రభుత్వం 3499 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 1967 ఇళ్లకు మాత్రమే టెండర్లను పూర్తి చేశారు. ఇప్పటి వరకు కేవలం 518 ఇళ్లకు నిర్మాణాలను పూర్తిచేశారు. మిగితా 1449 ఇళ్ల నిర్మాణాలు వివిధదశలో కనిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా ఓ అడుగుముందుకు, రెండడుగులు వెనక్కివేయడంతో పేదప్రజల సొంతింటి కలనేరవేరడమే లేదు. జిల్లాలో డబుల్‌ఇళ్ల నిర్మాణాలలో నిండునిర్లక్ష్యం కనిపిస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం మాత్రం తేలికగానే తీసుకోవడం దురదృష్టకరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇవే పరిస్థితులు మరికొన్నాళ్ల పాటు కొనసాగితే జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయడం కష్టసాధ్యంగానే కనిపిస్తుంది. అర్బన్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇళ్లకు రూ.5లక్షల 30వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.5లక్షల 4 వేలు నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నా..అవి ఏ మూలన సరిపోవడం లేదంటూ కాంట్రాక్టర్లు చేతులేత్తేస్తున్నారు. ఇలా అరకొర నిధులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇక డబుల్‌ ఆశలు ఆవిరవుతున్నాయని ఆందోళనకు గురవుతున్నారు. 

లబ్ధిదారుల ఆందోళన బాట

యేళ్ల తరబడి డబుల్‌బెడ్‌రూం ఇళ్లకోసం ఎదురు చూసే ఓపిక లేక అర్హులైన లబ్ధిదారులు ఆందోళనబాట పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టిన డబుల్‌బెడ్‌రూంలను కేటాయించక పోవడం పై జనం మండిపడుతున్నారు. ప్రధానంగా వానాకాలంలో నిరుపేద కుటుంబాలకు కష్టాలు తప్పడం లేదు. ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతూకాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల నిర్మా ణం పూర్తయిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని ఉట్నూర్‌ ఆర్డీఓ కార్యాలయం ముందు లబ్ధిదారులు ధర్నా చేపట్టి ఆందోళనకు దిగారు. అలాగే జైనథ్‌ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని గత వారంరోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మండల వాసులు ఆందోళన చేశారు. 2015లో పంచాయతీ పాలకవర్గం, రెవెన్యూ సిబ్బంది కలిసి గ్రామసభలో లబ్దిదారులను ఎంపిక చేసి నాలుగేళ్లు గడుస్తున్న అధికారికంగా ఇళ్లను కేటాయించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కేటాయించకపోతే బలవంతంగా గృహ ప్రవేశాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

ఎమ్మెల్యేల ఊగిసలాట

పూర్తయిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై జిల్లా ఎమ్మెల్యేలు ఊగిసలాడుతున్నట్లు తెలుస్తుంది. ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజక వర్గాల్లో ఇప్పటి వరకు 518 డబుల్‌బెడ్‌రూం ఇళ్లుపూర్తికాగా ఇప్పటికే వేలసంఖ్యలో లబ్దిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికీ ఇళ్లు కేటాయించినా అసమ్మతి తప్పదనే భయం ఎమ్మెల్యేలను వెంటాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులు వాయిదాపడుతూ వస్తున్నట్లు అధికారపార్టీలో చర్చ జరుగుతుంది. ప్రస్థుతం ఎలాంటి ఎన్నికలు లేకపోయినా డబుల్‌బెడ్‌రూంల పేరు ఎత్తితేనే ఎమ్మెల్యేలు జంకుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించిన సొంతపార్టీ నుంచే అసమ్మతి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థానికనేతలు సిఫార్సు చేసిన వారికి కాకుండా లక్కీడ్రా ద్వారా ఇళ్లను కేటాయింపులు చేస్తే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లను కేటాయింపులు జరుగడం కష్ట సాధ్యమనే వాదనలు ఎక్కువగావినిపిస్తున్నాయి. 

నేతల దళారిదందా

పూర్తయిన డబుల్‌ బెడ్‌రూంలను మంజూరు చేయిస్తామంటూ కొం దరు నేతలు దళారిదందాకు ఎగబడుతున్నారు. ఒక్కో ఇంటికి 50వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. జైనథ్‌ మండలంలో పూర్తయిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తామని ఇప్పటికే కొందరు మండలస్థాయి నేతలు లబ్దిదారుల నుంచి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక నేతలు చెప్పడంతో కొందరు లబ్దిదారులు ప్రస్థుతం డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో అనధికారికంగా నివాసం కూడా ఉంటున్నారు. అలాగే బోథ్‌ మండలంలో కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు విచ్చలవిడిగా లబ్దిదారుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు అదేపార్టీకి చెందిన బోథ్‌ ఎంపీపీ తులశ్రీనివాస్‌ జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గుడిహత్నూర్‌ మండలంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని ఓ మండల స్థాయి టీఆర్‌ఎస్‌ నేత లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆపార్టీ నేతలే చెబుతున్నారు. అయిన ఇళ్ల నిర్మాణాలను అసంపూర్తిగానే వదిలేశాడన్న విమర్శలు వస్తున్నాయి.