Abn logo
May 21 2020 @ 02:47AM

కాలు దువ్వుతున్న నేపాల్‌!

  • చైనా దన్నుతోనే సరిహద్దుపై వివాదాలు?
  • కొత్త మ్యాప్‌లో భారత భూభాగాలు 
  • తాజాగా కరోనా సాకుతో విమర్శలు
  • ప్రధాని కేపీ ఓలీ తీవ్ర వ్యాఖ్యలు
  • నేపాల్‌ మ్యాప్‌పై భారత్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ, మే 20: చిరకాల మిత్రదేశమైన నేపాల్‌ ఇప్పుడు భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. చైనాలాగే సరిహద్దు వివాదాలపై చీటికీమాటికి కాలుదువ్వే ప్రయత్నం చేస్తోంది. నిరుడు అక్టోబరులో జమ్మూకశ్మీరు పునర్విభజన తర్వాత భారత్‌ కొత్త రాజకీయ మ్యాప్‌ విడుదల చేసింది. అందులో సరిహద్దు ప్రాంతాలైన లిపులెక్‌, కాలాపానీ, లింపియధుర కూడా ఉన్నాయి. నేపాల్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి తన భూభాగాలని వాదిస్తూ ఏకంగా పార్లమెంటులోనే తీర్మానం చేసింది. కానీ ఈ ప్రాంతాలు భారత్‌ అంతర్భాగాలే. అయితే జమ్మూకశ్మీరు పునర్విభజనను వ్యతిరేకించిన చైనా ప్రోత్సాహంతోనే నేపాల్‌ వివాదాలకు దిగుతోందని భారతీయ అధికారులు అంటున్నారు. టిబెట్‌లోని మానస సరోవర్‌ యాత్రకు భారతీయ భక్తులు, పర్యాటకులు వెళ్లేందుకు వీలుగా లిపులెక్‌ పాస్‌ను ఉత్తరాఖండ్‌లోనిఽ దర్చులా రోడ్డుకు అనుసంధానం చేసే రోడ్డును ఈ నెల 8న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లిపులెక్‌ రోడ్డును ప్రారంభించారు. నేపాల్‌ దీనిపైనా వ్యతిరేకత వ్యక్తంచేసింది. నేపాల్‌ విదేశాంగ మంత్రి నేరుగా భారతీయ రాయబారి వినయ్‌ క్వాత్రాను పిలిపించి నిరసన తెలిపారు. ఆయన అది తమ భూభాగమేనని నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు. ‘ఇతరుల’ దన్నుతోనే ఆ దేశం ఇలా వ్యవహరిస్తోందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నర్వాణే పరోక్షంగా చైనాను వేలెత్తిచూపడం గమనార్హం. ఇలా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే.. నేపాల్‌ మంగళవారం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. లిపులెక్‌, కాలాపానీ, లింపియధురలను తన భూభాగంలో చేర్చింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరిస్తామని ప్రధాని ఓలీ మంగళవారం వెల్లడించారు. బుధవారం పార్లమెంటులో ప్రసంగిస్తూ నేరుగా భారత్‌పై విమర్శలు గుప్పించారు.


దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి ఇండియానే కారణమని ఆరోపించారు. సరిహద్దుల ఆవలి నుంచి అక్రమంగా వస్తున్నవారి వల్లే మహమ్మారి విజృంభిస్తోందన్నారు. చైనా, ఇటాలియన్‌ వైరస్‌ కంటే భారతీయ వైరస్సే భయంకరమని ఆరోపించారు. ఇదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లిపులెక్‌, కాలాపానీ, లింపియధురలను తిరిగి తీసుకొస్తామని ప్రకటించారు. ఇన్నేళ్లలో నేపాల్‌ ఎప్పుడూ ఇంత ఘర్షణాత్మక వైఖరిని అవలంబించలేదు. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చాక భారత్‌కు వ్యతిరేకంగా చైనాతో సన్నిహితంగా ఉంటోంది. తాజా పరిణామాలపై ఆ పార్టీలోనూ వ్యతిరేకత వస్తోంది. కరోనా నియంత్రణకు దేశమంతా ఓపక్క పోరాడుతుంటే.. భారత్‌తో అనవసరంగా ఉద్రిక్తతలు పెంచుకోవడంపట్ల నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత గణేశ్‌ షా అభ్యంతరం వ్యక్తంచేశారు. తక్షణమే సమస్య పరిష్కారానికి రాజకీయ, దౌత్య చర్యలు ప్రారంభించాలని సూచించారు.లద్దాఖ్‌ సరస్సులో చైనా బలగాలు

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పొడవునా కొంతకాలంగా చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. రెండు వారాల క్రితం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్‌ త్సో వద్ద భారత బలగాలతో ఘర్షణకు దిగింది. తాజాగా లద్దాఖ్‌లోని ఓ సరస్సులో తన నౌకాబలగాలను పెంచింది. గతంలో 3 బోట్లు గస్తీ తిరిగేవి. వాటి సంఖ్యను 9కి పెంచింది. అలాగే అక్కడ భారత్‌ తన భూభాగంలో రోడ్డు నిర్మిస్తుంటే అడ్డుకుంటోంది. దీంతో సరస్సు పశ్చిమ ప్రాంతంలో 45 కిలోమీటర్ల మేర తన అధీనంలో ఉన్న ప్రాంతంలో భారత్‌ కూడా బోట్లను పెంచింది. బలగాలనూ దించింది.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement