Abn logo
Sep 1 2021 @ 00:53AM

న్యాయవ్యవస్థలో నవ క్రియాశీలత

‘అత్యవసర ప్రస్తావన ఏమీ వద్దు. ఎవరైనా విడుదలయితే, కానివ్వండి, ఎవరినైనా ఉరితీస్తే తీయనివ్వండి, ఎవరినైనా ఖాళీ చేయిస్తే చేయనివ్వండి, ఎవరి ఇంటినైనా కూలగొడితే కూలగొట్టనివ్వండి...’. అని మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు. న్యాయస్థానం ఉన్నదే అత్యవసర ప్రాణావస్థలో ఉన్న వారిని కాపాడేందుకు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ముందుగా కాపాడాల్సిన వైద్యుడే అందుకు నిరాకరిస్తే ఎవరైనా ఏమి చేయగలరు?


ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్లు కనబడుతోంది. గుజరాత్‌లో రైల్వే భూమిలో దాదాపు 60 ఏళ్లుగా గుడిసెలు వేసుకున్న పదివేల మందిని అక్కడి నుంచి తొలగించి, ఆ గుడిసెలను కూలగొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ గతవారం అత్యవసర ప్రాతిపదికన విచారణకు స్వీకరించి కూల్చివేతపై స్టే విధించింది. తర్వాత ఆ స్టేను పొడిగించింది. గుడిసెవాసులకు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు చేయకుండా రాత్రికి రాత్రి గుడిసెలను కూల్చివేస్తున్నారని ప్రముఖ న్యాయవాది కోలిన్ గోన్ స్లేవ్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెంటనే స్పందించింది. కొవిడ్ సమయంలో తమ పరిస్థితి దయనీయంగా మారిందని గుడిసెవాసులు విజ్ఞప్తి చేశారు. నిజానికి రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద నివాసం పొందే హక్కు అత్యంత ముఖ్యమైనదని సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చినప్పటికీ, ఈ దేశంలో 2022 కల్లా అందరికీ ఇళ్ల వసతి కల్పిస్తామని ప్రభుత్వమే చెప్పుకున్నప్పటికీ, ప్రధానమంత్రి స్వంతరాష్ట్రంలో గుడిసెవాసుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే వారు సుప్రీంకోర్టు తలుపు తట్టకుండా ఉండగలరా? ‘మేము అత్యవసర ప్రస్తావనలు వినం’ అని సుప్రీంకోర్టే భీష్మించుకుంటే వారి పరిస్థితి ఏమిటి?


జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి అత్యవసర ప్రస్తావనలకు మళ్లీ అవకాశం లభించింది. అంతేకాదు, ఇలాంటి విషయాలకు సంబంధించి సీనియర్, జూనియర్ న్యాయ వాదులన్న వివక్ష చూపకుండా అందరికీ అవకాశం కల్పించాలని ఆయన చెప్పడంతో ప్రాణాంతక, ప్రమాదకర సమయాల్లో ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చని భరోసానిచ్చినట్లయింది.


ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాదాపు 9 మందితో గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది మందితో న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించడం, వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండడం న్యాయశాస్త్ర చరిత్రలో ఒక నూతన దృశ్యాన్ని ఆవిష్కృతం చేసినట్లయింది. 2019 సెప్టెంబర్‌లో అయిదుగురు న్యాయమూర్తులను నియమించిన తర్వాత ఇంత పెద్దస్థాయిలో నియామకాలు జరగనే లేదు. ప్రతి ప్రధాన న్యాయమూర్తీ తన హయాంలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రయత్నించి విఫలురైనవారే. 2019 నవంబర్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసే నాటికి సుప్రీంలో ఏడు ఖాళీలున్నాయి. అప్పటి నుంచీ ఆయన స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన శరద్ బాబ్డే హయాంలో ఒక్క న్యాయమూర్తి పోస్టును కూడా భర్తీ చేయలేకపోయారు. 


కాని జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజియం ఒకేసారి తొమ్మిదిమంది న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేసిన వారం రోజుల్లోనే కేంద్రప్రభుత్వం వాటికి ఆమోద ముద్ర వేసింది. కొందరు ఊహించిన ఒకరిద్దరు పేర్లు కొలీజియం సిఫారసు చేయలేకపోవచ్చు కాని ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం కూడా కాదనలేని విధంగా సిఫారసులు చేసి వివాదాలు నివారించిన ఘనత జస్టిస్ రమణకు దక్కుతుంది. గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రమాణాలను కాపాడుతూనే సరైన వ్యక్తుల్ని నియమిస్తూ ఏకాభిప్రాయం సాధించడం, వివిధ రాష్ట్రాలకు, వివిధ వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యం కల్పించగలగడం సులభమైన విషయం కాదు. అలా సాధించడానికి అద్భుతమైన నాయకత్వ ప్రతిభ అవసరం. కొలీజియం సిఫారసు చేసిన వారిలో మెజారిటీ న్యాయమూర్తులు ప్రజాసంక్షేమాన్ని ఆశించే ప్రతిభావంతులే. ఉదాహరణకు కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా కరోనా సమయంలో కర్ణాటక ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. లాక్‌డౌన్ పరిస్థితుల్లో వలస కార్మికుల సంక్షేమం గురించి పలు కీలకతీర్పులు వెలువరించారు. ‘వలస కార్మికులను పట్టించుకోవడం ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి సమయంలో కార్మికుల పనిగంటలు పెంచి జీతభత్యాలు తగ్గించేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఆయన ఉపసంహరించుకునేలా చేశారు. జస్టిస్ నాగరత్న బాలల హక్కులు, విద్య, బాలికలసంక్షేమం గురించి అద్భుతమైన తీర్పులు ఇచ్చారు. తాను బతికున్నంతవరకూ తన కుమార్తెకు ప్రమోషన్ ఇస్తే అది తాను సిఫారసు చేసినట్లే అవుతుందని సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఎస్ వెంకటరామయ్య అడ్డుపడకపోతే జస్టిస్ నాగరత్న ఎప్పుడో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేవారు. ఈ ఆలస్యం వల్ల ఆమెకు కేవలం 36 రోజులే సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం దక్కనుంది. 32 సంవత్సరాలు ఢిల్లీలో ప్రాక్టీసు చేసిన పమిడిఘంటం నరసింహ న్యాయవాదిగా అనేక ప్రజాసమస్యలపై పోరాడడమే కాక దేశం ఎదుర్కొంటున్న అనేక క్లిష్టసమస్యలకు పరిష్కారం చూపారు. ఆయన నియామకం ద్వారా మరో తెలుగువ్యక్తి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఏర్పడింది. నిజానికి ప్రకాశం జిల్లాకు చెందిన మరో సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు పావని పరమేశ్వరరావు దాదాపు 40 సంవత్సరాలు సుప్రీంలో ప్రాక్టీసు చేసినా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి దక్కకుండానే దివంగతులయ్యారు.


న్యాయమూర్తుల నియామకాలను జస్టిస్ రమణ తాను అనుకున్న విధంగా ప్రభుత్వం ఆమోదించేలా చేయడమే కాదు, తనకు ముందున్న ఒకరిద్దరు న్యాయమూర్తుల హయాంలో దిగజారిన న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ నిలదొక్కుకునేలా చేశారనడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా హైకోర్టుల తీర్పుల్లో జోక్యం చేసుకోబోమని భరోసా ఇచ్చి కింది న్యాయస్థానాల ఆత్మవిశ్వాసాన్ని ఆయన పెంచారు, న్యాయస్థానాల్లో ఖాళీలే కాదు, ట్రిబ్యునల్స్‌లో ఖాళీలు కూడా భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్క వలస కార్మికుడు కూడా రోడ్డు మీదకు రాలేదని ప్రభుత్వం చేసిన వాదనను మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆమోదిస్తే జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత వలస కార్మికులకు సంక్షేమం ప్రసాదించాలని కోర్టు ఆదేశించింది. ఆక్సిజన్ సరఫరా నుంచి వాక్సినేషన్ విధానం వరకు ప్రభుత్వాన్ని నిలదీసింది. సెక్షన్ 124-–ఏ కింద రాజద్రోహనేరాన్ని విధించడం రాజ్యాంగవ్యతిరేకమని దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బాబ్డే బెంచ్ తిరస్కరిస్తే జస్టిస్ రమణ బెంచ్ 75 సంవత్సరాల తర్వాత ఈ వలస కాలపు చట్టం కొనసాగాలా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. జస్టిస్ గొగోయ్ హయాంలో హెబియస్ కార్పస్, మీడియా స్వేచ్ఛ మొదలైన వాటిపై ఆంక్షల విషయంలో సుప్రీంకోర్టు చాలా నత్తనడకన పనిచేస్తుందని మానవహక్కులపై ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ విమర్శించారు. జస్టిస్ రమణ పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత మానవ హక్కులను కాలరాయడంపై సుప్రీం కోర్టు బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేసింది. హత్రాస్ కేసులో అరెస్టు అయిన జర్నలిస్టు కప్పన్‌కు ఢిల్లీలో సరైన చికిత్స లభించేలా జస్టిస్ రమణ చూశారు. హేతుబద్ధమైన సమయంలో విచారణ జరిగే అవకాశం లేకపోతే యుఏపిఏ వంటి క్రూరచట్టాల కింద అరెస్టు చేసిన వారికి కూడా బెయిల్ ఇవ్వవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు న్యాయమూర్తుల హత్య జరిగినా కనీస విచారణ జరిగేది కాదు. కాని ధన్‌బాద్‌లో ఒక క్రింది కోర్టు న్యాయమూర్తిని ఆటోతో గుద్ది చంపితే జస్టిస్ రమణ తనంతట తాను కేసును విచారణకు స్వీకరించారు. దేశంలోని పోలీస్ స్టేషన్‌లలో పోలీసులు ఇష్టారాజ్యంగా మానవహక్కులు కాలరాస్తున్నారని, అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారని కూడా చెప్పేందుకు ఆయన వెనుకాడలేదు. ఐబీ, సిబిఐ వంటి సంస్థలు, పోలీసులు సరిగా పనిచేయడం లేదని విమర్శించి ఆయా సంస్థల్లో చైతన్యం తెచ్చేందుకు ఆయన తోడ్పడ్డారు. నేరచరితులైన ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయడమే కాక, ప్రభుత్వాలు తమంతట తాము ఆ కేసులను ఉపసంహరించుకోకుండా చేసి హైకోర్టులకు అధికారాలు అప్పజెప్పడం ద్వారా ఆయన న్యాయవ్యవస్థకు మనోబలాన్ని సమకూర్చారు.


భారతదేశంలో అన్ని వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం సడలిపోతున్న దశలో, ప్రభుత్వాలే ఇష్టారాజ్యంగా, అరాచకంగా వ్యవహరిస్తూ ప్రజాజీవనంలో బీభత్సం సృష్టిస్తున్న సమయంలో న్యాయవ్యవస్థ బలోపేతం కావడం అనేది ఆరోగ్యకరమైన పరిణామం. ప్రతి ఒక్కరిపై నిఘా వేస్తూ, వ్యక్తుల్ని, వ్యవస్థల్ని నీరుకారుస్తూ ప్రభుత్వమే ఒక రహస్యయంత్రాంగంగా మారడం, న్యాయస్థానాల్లో కూడా సీల్డుకవర్ల సంస్కృతిని ప్రవేశపెట్టడం ఒక దుష్పరిణామం. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి ప్రాణం అన్న విషయం న్యాయస్థానాలు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సి ఉన్నది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)