Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘దురదృష్టం’ అని తేల్చడానికా చర్చలు!

ఈపార్లమెంట్ల మీదా, అసెంబ్లీల మీదా, నాకు నమ్మకం లేదు. ఎందుకంటే, ఈ సభలు, ‘దోపిడీ వర్గ’ రాజకీయ ప్రయోజనాలతో, ఆ వర్గానికే అనుకూలమైన చట్టాలు చేసే చట్టసభలే. ఇన్నాళ్ళూ, వీటికి ‘‘బాతాఖానీ క్లబ్బులు (టాకింగ్ షాప్స్)’’ అని విమర్శ వుండేది. ఇప్పుడు ‘‘బూతుల పంచాంగ’’ శ్రవణ క్లబ్బులుగా మారినట్టు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దాన్ని చూస్తే అనిపిస్తుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో భక్తులు, తమ అసెంబ్లీని, ‘దేవాలయం’తో పోల్చుకుంటున్నారు. రెంటికీ సవ్యమైన పోలికే ఇది. దేవాలయం, ఏ మహిమల్నీ చూపలేని అబద్దపు స్తావరం! అలాగే, ఆంధ్ర అసెంబ్లీ, ఎన్నడూ ఏ శుద్ధ విలువనీ పరిగణించలేని అబద్దపు శాసనసభ! ఈ రకంగా, ఈ రెండు సంస్తలకూ పోలిక, అక్షరాలా తగిన సవ్యమైన పోలికే అవదూ?ఆంధ్ర రాష్ట్రపు స్త్రీకి, భారత దేశపు స్త్రీకి, ఇంత అవమానమా! -అన్న ఆందోళనలు, పత్రికల్లోనూ, టీవీల్లోనూ కనిపించాయి. 


‘ఆంధ్ర రాష్ట్ర స్త్రీకి! భారతదేశ స్త్రీకి!’ మరో రాష్ట్ర స్త్రీకి అయితే? మరో దేశ స్త్రీకి అయితే? ఆమెకి అదే అవమానం జరిగి వుంటే, ఆందోళన కలగదా? కలగనక్కర లేదా? అదే కాకపోతే, ఈ చర్చల్లో మేధావులు, ‘భారత స్త్రీకి’, ‘భారత స్త్రీకి’ అనగలరా? కొందరు చర్చకుల మాటల్లో, భారతదేశపు గొప్ప అయినా నిలబడ లేదు. ఆ స్త్రీ వ్యక్తిత్వం గానీ, స్వచ్ఛత గానీ, ఆమె తండ్రి పేరు మీదా, భర్త కీర్తి మీదా, మాత్రమే ఆధారపడి వున్నాయి! ‘ఆ గొప్ప పేరు గల తండ్రి గారి కుమార్తెకి, ఈ అవమానమా? ఆ గొప్ప భర్త గారి భార్యకి, ఈ అవమానమా?’ ఇవీ ప్రశ్నలు! ఈ స్త్రీకి వున్న తండ్రి పేరూ, ఈ స్త్రీకి వున్న భర్త కీర్తీ, ఇతర స్త్రీల తండ్రులకూ, భర్తలకూ వుంటాయా? తల్లుల కైతే, తల్లుల పేర్లకి చోటే వుండదనుకోండీ! ఇతర స్త్రీలకి జరిగే అవమానాలకు వ్యతిరేకంగా, ఆ స్త్రీల కోసం, ప్రసిద్ధులు కాని వారి తండ్రుల్నీ, భర్తల్నీ తీసుకురావడం సాధ్యమా? ఒక వేళ, ఒక భారత స్త్రీ తండ్రీ, భర్తా, దారి తప్పిన వాళ్ళు - అని ఎవరో అనుకుంటే, ఇక ఆ మొగవాళ్ళని బట్టి, వాళ్ళ స్త్రీ కూడా దారి తప్పినదే అయి వుంటుందని తీర్మానిస్తారా? అలా కాకపోతే, ఆ మొగవాళ్ళ పేర్లెందుకు? దేవాలయం వంటిది - అని అసెంబ్లీని నమ్ముతూ, ఆ ‘పవిత్ర అసెంబ్లీ’లోనే నిలబడి కారుకూతలు కూసేవాళ్ళని, ఈ చర్చల మేధావులు, ‘ఆ ఫలానా గారూ, ఈ ఫలానా గారూ’ అంటూ, ‘గారు, గారు’ గౌరవాల్నీ, మర్యాదల్నీ, వదలకుండానే ఆగ్రహాలు చూపారు! అది, మర్యాద కదా - అంటారేమో! ‘దేవాలయ అసెంబ్లీ’ లోనే, ఎదటి పక్షం వాళ్ళని, ‘ఆ వెధవ - ఈ వెధవ’, ‘ఆ సన్నాసీ -ఈ సన్నాసీ’ అని వాచాలత్వంతో ఏ మర్యాదా పాటించని వారికి, బైటి చర్చల్లో కూడా, మర్యాదలూ, గౌరవాలూ, చూపించ వలిసిందేనా? ఆ మాత్రపు తెగింపు లేకుండా ఆగ్రహాల్ని ప్రకటించితే, అవి ఆగ్రహాలు అవుతాయా? ‘గార్లు’ లేకుండా పేర్లని ఉదహరిస్తే, అది నేరమా, దోషమా? ఆ మాత్రం ఆగ్రహమే లేకపోతే, ఎందుకా చర్చలు? ఎదుటి స్త్రీ గర్భాన్ని ప్రశ్నించే దురహంకారులను, వారి తల్లుల, భార్యల గర్భాల్ని ప్రశ్నిస్తారా - అని చర్చల మేధావుల్లో ఒక్కరిద్దరైనా ప్రశ్నించి, చర్చల గౌరవాల్ని కాపాడారనుకోవచ్చు. 


‘దేవాలయ అసెంబ్లీ’లో అసలు వ్యక్తులు కనపడకుండా, వాళ్ళ కంఠాల్ని రికార్డు చేసిన వాగుళ్ళు వినపడుతోంటే, ఆ ప్లాను చేయించిన అసలైన అధినేత అసెంబ్లీ కుర్చీలోనే వుండి ముసిముసి నవ్వులు నవ్వడాన్ని స్పష్టంగా చూసినట్టు అందరూ అన్నారు. ఆ అన్నవారు కూడా, ఇదంతా ఆ అధినేతకి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? అప్పుడైనా ఆ అధినేత, ఆ కంఠాల వాళ్ళని మందలిస్తాడా? ఇవతలి వారిని క్షమాపణ అడుగుతాడా? ఆయన సిగ్గుపడడా? అని కొన్ని కొన్ని వింత, విచిత్ర సందేహాలేమిటి? ఆ అధినేత అక్కడే వున్నాడు, వింటున్నాడు, నవ్వుతున్నాడు. ఆ మనిషే ఆ ప్లానుని ఏర్పాటు చేయించాడని ఏ మాత్రమూ పట్టని, గ్రహించని మేధావులు కూడా చర్చల్లో వున్నారు! 


దానికి, ఒక ఛానల్‌లో చర్చ నిర్వాహకుడు, చాలా సందర్భాల్లో, హెచ్చరిస్తూనే వున్నారు. ఏమని? సిగ్గుపడ వలిసింది అతడు కాదే; చూసేవాళ్ళూ, వినేవాళ్ళూ, తమ సిగ్గులేని తనాలకే సిగ్గుపడాలి. అసలు, ఆ ప్లాను చేయించిన అధినేత మీద, ‘అతడికి తెలుసా ఇది?’ అనే సందేహాలు ఎందుకు వస్తున్నాయి? అని ఆయన, మేధావులకు చెప్పడానికి చాలా ప్రయత్నించారు. 


ఇవతలి మహిళని అవమానాల్లోకి తెచ్చిన ఆ అధిపతి, పురుషాహంకారి - అని గ్రహించవచ్చు. అయినా, అతడి పాదాల కింద వున్న మహిళలు కూడా, తమ కంఠాల్ని ప్రయోగించిన మహిళలు కూడా ఆ ప్లానులో వున్నారని తెలుస్తూనే వుంది. ఈ సంఘటనలో, ‘పురుషులు, పురుషులు’ అనే పునరుక్తులే గానీ, ఆ నీచ ప్లానులో భాగం అయిన మహిళల పాత్రనే చూడలేదు, ఇటువేపు మేధావులు! 


ఛానల్ వారు, మహిళల్నీ, పురుషుల్నీ కూడా చర్చల్లో కూర్చోబెట్టినా, ఒక మహిళ పట్ల జరిగిన అవమానానికి వ్యతిరేకంగా మహిళల స్పందనలే చూడదలిచారు. మహిళకి జరిగే అవమానం, మహిళ సమస్యేనా? మహిళలు మాత్రమే తిరస్కరించవలిసిన సమస్యేనా అది? ఆ సమస్యలో పురుషుడు నేర్చుకోవలిసిందీ, ఆగ్రహించ వలిసిందీ, ఏదీ లేదా? చర్చల్లో పాల్గొన్న పురుషులు కూడా, ఆ సమస్యని మహిళల సమస్యగానే చూశారు! ‘మహిళకి ఇంత జరగడమా!’ అన్నారు గానీ, మహిళకి జరిగిన అవమానమే ఆమె భర్తకీ జరిగింది, రెండో పురుషుడికీ జరిగింది. 


‘రాజకీయాల్లో లేని స్త్రీ గురించి అసెంబ్లీలో ఎందుకు?’ అంటారు ఎంతసేపూ! రాజకీయాల్లో వున్న స్త్రీయే అయితే, ఆమె గర్భ పరీక్షల్ని అసెంబ్లీలో జరపడానికి అభ్యంతరాలు లేనట్టే అవుతుందా? 


ఇంకో వింత! ‘ఒక భారత మహిళని అవమానించిన ఈ నేరం ఇంకోసారి జరిగితే వూరుకునేది లేదు. ఇంకోసారి జరగకూడదు’ అని తుది హెచ్చరికలు! - ఇంకోసారి జరిగితే, వూరుకోరట! ఈ సారికి వూరుకుంటారు! ‘ఇంకోసారి జరగకూడదు.’ మొదటిసారి జరగవచ్చు! - ఆ స్త్రీకి పుట్టిన బిడ్డకి, ‘డి.ఎన్.ఏ’ పరీక్ష జరగాలి - అనేదేదో ‘చిట్టి పొట్టి పలుకు మాత్రమే’ అయినట్టు! ఈ పలుకుని, ఈ సారి క్షమిస్తారు! ఈ మొదటి పలుకే ఘోర నేరం ఎందుకు కాకుండా వుండాలి? దీన్ని అయినా ఎందుకు సహించాలి? -‘సహించక ఏం చేస్తాం’ అంటారా? - రేపు రెండో మహిళ మీద ఇదే జరిగితే, అప్పుడేదో చేస్తామని ప్రకటించారుగా? అది ఇప్పుడే చేసి తీరవల్సినంత క్షుద్రనేరం కాదా ఇది? ‘ఇది, ఇంకోసారి జరగ కూడదు’ అని చర్చకులే చేతులు దులిపేశారంటే, ఎదటి దోషులేనా అంత అగ్న్యానులు? ఇంకోసారి కూడా మళ్ళీ ఇలాగే చేస్తారా? వాళ్ళకి ఎన్నెన్నో క్షుద్ర ఉపాయాలు దొరకవా? కొత్త ప్లాను ఏదో తయారు చేస్తోనే వుంటారు. అప్పుడు, అదే మొదటిదవుతుంది! దాని మీద కూడా మళ్ళీ, ‘ఇది, ఇంకోసారి జరగకూడదు’ అని హెచ్చరికతో ఆప వలిసిందే కదా? 


ఈ మొదటిసారి నీచత్వానికే ఎటువంటి శిక్ష పడాలో, నిర్ణయించలేరా? నేరస్తులకు తక్షణం శిక్ష ఇవ్వలేక పోయినా, ఈ సారికి వదిలేశాం అన్నట్టు ప్రకటనా! 


‘పోలీసులు, ప్రభుత్వానికే లొంగి పని చెయ్యడం ఎందుకు?’ అంటారు వీరే. మరి, పోలీసులు వుండేది ఎందుకు? అధికారంలో ఏ పార్టీ వుంటే, ఆ పార్టీ కోసమే పనిచేస్తారు. సాధారణ ప్రజల విషయంలో అయితే చెప్పనే అక్కర లేదు. నిన్న మొన్న ‘మరియమ్మ’ అనే దళిత శ్రామిక స్త్రీ విషయంలో ఏం జరిగింది? యజమాని చెప్పిన దొంగతనం నేరంతో, మరియమ్మని పోలీసులు అరెస్టు చేసి, లాకప్పులో కొట్టి కొట్టి చంపారని చూశాం! దొంగతనానికి శిక్ష, మనిషిని కొట్టి కొట్టి హింసించడమా? ఆ దెబ్బలతోనే ఆమె చనిపోయింది. 


అసెంబ్లీ సంఘటనలో, ఆందోళనకారులలో జరిగినదిగా నాకు కనపడిన విషయం ఏమిటంటే, ప్రతీ వాళ్ళూ, ‘ఇది చాలా దురదృష్టం! దురదృష్టం!’ అనడం. ఇంకేదైనా సందర్భంలో అయితే, ‘అదృష్టం! అదృష్టం!’ అంటారు. ఈ ‘అదృష్టాలూ, దురదృష్టాలూ’ తప్ప, నిజంగా కళ్ళ ముందు వున్న ఏ నిజాలూ, ఏ వాస్తవాలూ, ఏ దుర్మార్గాలూ, ఎవ్వరికీ కనపడలేదు. అదృష్టాలూ - దురదృష్టాలూ - ఈ 2 మాటలే. వీటితో సంతృప్తి పడతారు! నిన్న మొన్నటి సమస్యగా జరిగింది, ‘దురదృష్టమే’ అయితే, ఇక దాన్ని ఎవరేం చెయ్యగలరు? దానితో ఎవరు పోరాడగలరు? దురదృష్టాన్ని భరించవలిసిందే కదా? దాని మీద ఈ చర్చలెందుకు? దురదృష్టం అని తేల్చడానికా ఈ చర్చలు! 


‘‘ఇంకోసారి ఇది జరగకూడదు’’ - అని దురదృష్టానికే చెపుతారా? చెప్పారుగా మరి. దురదృష్టం వింటుందో లేదో!

రంగనాయకమ్మ

Advertisement
Advertisement