Abn logo
Jul 15 2020 @ 11:02AM

దేశంలో కరోనా కలకలం: ఒక్కరోజులో దాదాపు 30 వేల కొత్త కేసులు!

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి నానాటికీ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా దాదాపు 30 వేల కరోనా కేసులు వెలుగు చూశాయి. మొత్తం మరణాల సంఖ్య 24 వేలు దాటింది. ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా  29,429 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కి చేరుకుంది. 582 మరణాల సంభవించడంతో మరణాల సంఖ్య 24,209కి చేరుకుంది.


అయితే రోజువారి కేసుల పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని, ప్రస్తుతం అది 3.24 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ‘మార్చి నెలలో రోజువారి పెరుగుదల రేటు 31.28%, మే నెల మొదట్లో ఇది 9.27 శాతంగా మే నెలాఖరున  4.82 శాతంగా ఉంది. ఇక జులై 12 నాటికి ఇది 3.24 శాతానికి పడిపోయింది’ అని ఆరోగ్య శాఖ అధికారి రాజేశ్ భూషన్ తెలిపారు. ఇక దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 592,031కి చేరుకోవడంతో రికవరీ రేటు 63.23 శాతంగా నమోదైంది. అంతేకాకుండా.. కేంద్రం లెక్కల ప్రకారం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రికవరీ రేటు దేశ సగటు కంటే ఎక్కువగా ఉంది. 


భారత్‌లోని 50 శాతం యాక్టివ్ కేసులు మహారాష్ట్ర, తమిళనాడులో నమోదవగా మరో 36శాతం కేసులు..కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, అసోం  రాష్ట్రాల్లో ఉన్నాయి. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో మొత్తం267,665 కేసులు, 10,695 కరోనా మరణాలు సంభవించాయి. ఆ తరువాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 147,324 కరోనా కేసులు, 2,099 మరణాలు నమోదయ్యాయి.


ఇక కరోనా ఉధృతి అంతకంతకూ పెరుగుతున్న కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 605 కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్‌ను జూలై 19 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామని, 1206 ల్యాబుల్లో కరోనా పరిక్షలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement