Abn logo
Oct 23 2020 @ 05:13AM

కాత్యాయనీ అలంకారం

Kaakateeya

ఉత్సవమూర్తులకు హంసవాహన సేవ


కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 22: శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున గురువారం సాయంత్రం కాత్యాయనిదేవి అలంకారం చేశారు. కుమారి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రెండేళ్ల నుంచి పదేళ్లలోపు బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు ఇచ్చి పూజలు చేశారు. సాయంత్రం భ్రమరాంబదేవి కాత్యాయనీదేవిగా దర్శనమిచ్చారు. నవదుర్గలలో ఆరో రూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి కుడివైపున అభయ హస్తాన్ని, వరదముద్రను, ఎడమవైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. కాత్యాయనీదేవిని ఆరాధించడం వల్ల రోగ, శోక, భయాలను తొలగించుకోవచ్చని పురాణాల్లో ఉంది. ఇంకా శ్రీకృష్ణుడిని భర్తగా పొందేందుకు గోపికలు ఈ అమ్మవారిని పూజించారని, ఈ దేవి ఆరాధన వల్ల జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. వాహన సేవల్లో భాగంగా గురువారం రాత్రి హంసవాహన సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు దంపతులు, వేద పండితులు, అర్చకస్వాములు పాల్గొన్నారు. 


శేష వాహనంపై కాత్యాయనీదుర్గ

మహానంది, అక్టోబరు 22: మహానందిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు గురువారం కామేశ్వరీదేవిని కాత్యాయనిదుర్గగా అలంకరించారు. రాత్రి 9గంటలకు కాత్యాయనిదుర్గ అలంకారంలో ఉన్న అమ్మవారిని శేషవాహనంపై ఆశీనులను చేసి ఉత్సవం నిర్వహించారు. 

Advertisement
Advertisement