Abn logo
Oct 17 2020 @ 05:03AM

జగజ్జననికి నవరాత్రి శోభ

Kaakateeya

నేటి నుంచి దసరా వేడుకలు 

ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకరణలు

శ్రీశైలం, మహానందిలో తగ్గిన ఉత్సవాల కళ

కొవిడ్‌ నిబంధనల మేరకే కార్యక్రమాలు

 

కర్నూలు (కల్చరల్‌), అక్టోబరు 16: జగజ్జనని అయిన దుర్గాదేవిని కొలిచే నవరాత్రులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. జిల్లాలో కూడా వివిధ దేవీ ఆలయాల్లో దసరా వేడుకలు తొమ్మిదిరోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు.


అయితే ఈ ఏడాది కొవిడ్‌-19 ఆంక్షల మధ్య ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీశైలం, మహానంది, యాగంటి తదితర క్షేత్రాల్లో ఉత్సవాలను ఆలయాలకే పరిమితం చేశారు. ఊరేగింపులు, గ్రామోత్సవాలు వంటివి రద్దయ్యాయి. జిల్లాలోని వాసవీ కన్యకా పరమేశ్వరి (అమ్మవారిశాలల్లో)ఆలయాల్లోనూ దేవీ నవరాత్రి వేడుకలు సాధారణంగా నిర్వహిస్తున్నారు. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు నగరంలో దుర్గామాత విగ్రహాలను పెట్టి పూజించి, ముగింపు రోజున నిమజ్జనం చేయడం ఒక సంప్రదాయంగా సాగుతోంది. ఈ ఏడాది ఆ సందడి ఉండే అవకాశం లేదు. 


 కర్నూలు నగరంలో..

కర్నూలు నగరంలో ఈ ఏడాది కొవిడ్‌-19 నిబంధనల నేపథ్యంలో ఆలయాలకే ఉత్సవాలను పరిమితం చేస్తున్నారు. స్థానిక పాత నగరంలోని పెద్ద అమ్మవారిశాల, చిన్న అమ్మవారిశాల, కాళికాంబ దేవాలయం, గీతామందిరం, కేసీ కెనాల్‌ సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయంలోని చౌడశ్వరి మాత ఆలయం, కల్లూరులోని చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నిత్య హోమాలు, విశేష అలంకరణ కార్యక్రమాలను చేపడుతున్నారు.


శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

శ్రీశైలంలో శనివారం నుంచి దసరా మహాత్సవాలు ఆరంభం కానున్నాయి. ఏటా ఈ ఉత్సవాలు లక్షలాది భక్తజనం మధ్య కొనసాగుతుండగా, ఈ ఏడాది కొవిడ్‌-19 ఆంక్షల మధ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది స్వామి అమ్మవార్లకు నిర్వహించే గ్రామోత్సవం రద్దు చేశారు. రోజూ ఆలయంలోనే అర్చక స్వాములు భౌతిక దూరం పాటిస్తూ ఉత్సవం నిర్వహిస్తారని దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు. శనివారం ఉదయం 8.30 గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ఆరంభిస్తామని, ఈనెల 25న ఉదయం యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. 

Advertisement
Advertisement