Abn logo
Sep 6 2020 @ 03:40AM

పల్లెకో పార్కు

Kaakateeya

గ్రామాల్లో ముమ్మరంగా ప్రకృతి వనాల పనులు

ఉమ్మడి జిల్లాలో కనువిందు చేయనున్న పార్కులు 

వనాల ఏర్పాటులో మేడ్చల్‌ మొదటి స్థానం

పూలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే భారీ వృక్షాల పెంపకం


 నగరాలు, పట్టణాలకే పరిమితమైన పార్కులు పల్లెల్లోనూ కనువిందు చేయనున్నాయి. ఈ వనాల్లో ఆహ్లాదాన్ని నింపేలా, సేదతీరేలా.. అన్ని రకాల పూలు, పండ్ల మొక్కలు నీడనిచ్చే భారీ వృక్షాలు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే చెట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న స్థలాలను సేకరించింది. హరితహారంలో భాగంగా ఈ వనాలను తీర్చిదిద్దనున్నారు. ఉపాధిహామీ నిధులను విని యోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌)/(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)/ (ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో కనీసం ఎకరా విస్తీర్ణానికి తగ్గకుండా ప్రకృతి వనాలను అభివృద్ధి చేస్తున్నారు. గ్రామాల్లో వేర్వేరు ప్రదేశాల్లో స్థలం అందుబాటులో ఉంటే చిన్న వనాలను ఏర్పాటు చేస్తున్నారు. పార్కుల్లో మూడు వరుసల్లో మొక్కలు నాటుతున్నారు. వేప, రావి, మర్రి, కానుగ, బాదం వంటి భారీ వృక్షాలను పెంచుతున్నారు. గన్నేరు, మందార తదితర మొక్కలను నాటుతున్నారు. పండ్లు, ఔషధ, నిత్యావసర మొక్కలను నాటుతున్నారు. వనాల్లో పిల్లలకు ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయనున్నారు. పార్కు చుట్టూ ఫెన్సింగ్‌తో రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. 


రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలు 307 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఈ రెండూ కలిపి 867 గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 517 గ్రామ పంచాయతీల్లో భూమిని గర్తించారు. 440 పంచాయతీల్లో లాండ్‌ లేవలింగ్‌ పూర్తి చేశారు. 381 ప్లాంటింగ్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.64.63 లక్షలు ఖర్చు చేశారు. 


మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లోనూ పల్లె ప్రకృతి వనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 75శాతం వరకు మొక్కలను నాటారు. ప్రకృతి వనాల ఏర్పాటులో మేడ్చల్‌ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపడుతున్నారు. పంచాయతీల్లోని ట్రాక్టర్ల సహాయంతో భూమిని చదును చేస్తున్నారు. హరితహారం నర్సరీల్లో నుంచి మొక్కలను సేకరిస్తున్నారు. 


వికారాబాద్‌ జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అనుబంధ గ్రామాలతో కలిసి 697 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటి వరకు 285 గ్రామాల్లో వనాల పనులు ప్రారంభమయ్యాయి. 80 గ్రామాల్లో ఎకరా స్థలంలో, మిగిలిన 200 గ్రామాల్లో అర ఎకరా స్థలంలో వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎకరా స్థలంలో పల్లె ప్రకృతి వనం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు రూ.6.20 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే వికారాబాద్‌ మండలంలోని నారాయణపూర్‌లో ఏర్పాటు చేసిన ప్రకృతివనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ వనం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 


వాకర్స్‌ ట్రాక్‌ల ఏర్పాటు..

గ్రామాల్లో కూడా ప్రస్తుతం మార్నింగ్‌, ఈవినింగ్‌వాక్‌ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారి కోసం మూడు వరుసల చెట్ల తర్వాత మొరంతో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. ట్రాక్‌ వెంట సేద తీరేందుకు మూడు, నాలుగు బేంచీలు ఏర్పాటు చేస్తున్నారు. 


నీడనిచ్చే చెట్లు..

ఎకరా భూమిలో దాదాపు 4 వేల చెట్లు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మధ్యలో నీడకోసం చింత, ఉసిరి, నేరేడు, వేప, వెలుగ, ఇప్ప, సాండల్‌ఉడ్‌, రేగు, కుంకుడు, పనస, సీమచింత తదితర చెట్లను పెంచేవిధంగా పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. 


మూడు వరుసల్లో.. 

ప్రకృతి వనం కోసం ఎంపిక చేసిన స్థలంలో బౌండరీ వద్ద మూడు వరుసల్లో మొక్కలు నాటుతున్నారు. మొదట ఏపుగా పెద్దగా పెరిగే మొక్కలు, మధ్య వరుసల్లో మీడియం సైజ్‌ మొక్కలు నాటుతున్నారు. ఈ రెండు వరుసల్లో వేప, గుల్మోహర్‌, రెయిన్‌ట్రీ, రావి, కానుగ, పెల్టోఫోరమ్‌, బాదాం, తదితర మొక్కలు నాటుతున్నారు. ఇన్నర్‌ సైడ్‌ పూల మొక్కలైన గన్నేరు, టెకోమా, బోగన్‌వాలా, మందారతో పాటు ఈత, హెన్నా, సీతాఫలం, దానిమ్మ, జామ, కరివేపాకు, మల్బరీ, వెదురు, జమ్మి, వావిల్లి మొక్కలు పెంచుతున్నారు. 


డీఆర్‌డీవోలకు పర్యవేక్షణ బాధ్యత 

ప్రకృతి వనాల కోసం స్థలాలు సేకరించే బాధ్యత పంచాయతీ శాఖకు అప్పగించగా, పనులు పర్యవేక్షించే బాధ్యత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై ఉంచారు. ప్రకృతి వనాల్లో నాటేందుకు అవసరమైన మొక్కలను ఈజీఎస్‌, అటవీ శాఖ నర్సరీల్లో నుంచి తీసుకోవాలని సూచించగా, డిజైన్‌, ఆకట్టుకునే మొక్కలు నాటాలనుకుంటే పంచాయతీ నిధుల్లో పచ్చదనానికి కేటాయించిన 10 శాతం నిధుల్లో నుంచి దీనికోసం ఖర్చు చేస్తున్నారు.

Advertisement
Advertisement