Abn logo
Jun 4 2020 @ 00:46AM

జాతి హితమే సర్వోత్కృష్టం

చైనా ఒక దీర్ఘకాలిక వ్యూహంతోనే మన భూభాగాల్లోకి చొరబడింది. ఆ పన్నాగానికి దీటుగా ప్రతిస్పందించేందుకై మోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు తగు సమయమివ్వాలి. జాతి హితాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రతి రాజకీయ పార్టీ వ్యవహరించాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకులందరినీ విశ్వాసంలోకి తీసుకోవడం ద్వారా జాతిహితం పట్ల తన నిబద్ధతను ప్రధాని మోదీ నిరూపించుకోవాలి. ప్రధానమంత్రికి ఇబ్బందులు సృష్టించకుండా ఉండడం ద్వారా జాతి హితం పట్ల ప్రతిపక్షాలు తమ నిబద్ధతను చూపాలి.


భారత్-–చైనా పొలిమేరలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జాతీయ భద్రత విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంక్లిష్ట పరిస్థితి. ప్రధాని మోదీకి ఇబ్బందులు సృష్టించేందుకు ప్రతి పక్షాలకు ఇదొక అవకాశమనడంలో కూడా సందేహం లేదు. జాతీయ భద్రత అంశం మోదీ సర్కార్‌కు ఎన్నికల సందర్భంలో ఒక తురుఫు ముక్కగా ఉపయోగపడుతున్నదన్న విషయం విదితమే. 1962 పరాజయం అనంతరం జవహర్ లాల్ నెహ్రూను అటల్ బిహారీ వాజపేయి ఎత్తిపొడిచిన విధంగానే ఇప్పుడు మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ విమర్శిస్తే అందుకు ప్రధాన జాతీయ ప్రతిపక్షాన్ని ఎంత మాత్రం తప్పుపట్టలేము. అయితే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అందుకు పూనుకోకూడని విపత్కర సమయమిది. పార్టీ ప్రయోజనాల కంటే జాతి హితానికే ప్రాధాన్యమిచ్చి తీరాలి. సరిహద్దు సంఘటనలతో నెలకొన్న తన నాయకత్వానికి ఏర్పడ్డ సంక్లిష్ట సవాళ్లను అధిగమించేందుకు ప్రధాని మోదీకి సహకరించితీరాలి. అలా సహకరించని పక్షంలో మన జాతీయ భద్రతకు, జాతి శ్రేయస్సుకు ఎనలేని హాని సంభవిస్తుందనే వాస్తవాన్ని రాజకీయ నాయకులు విస్మరించకూడదు.


వ్యూహాత్మక వ్యవహారాలపై గానీ, భారత్-చైనా సంబంధాలపై గానీ నేనేమీ సాధికారంగా వ్యాఖ్యానించగల నిపుణుడిని కాను. పొలిమేర పరిణామాలు, భారత్-చైనా సంబంధాలపై అవి చూపగల ప్రభావం గురించి పలువురు ఇప్పటికే లోతుగా విశ్లేషించారు. ఈ నిపుణుల అభిప్రాయాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఒక రాజకీయ నిర్ణయానికి రావలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో జాతి హితాన్ని మాత్రమే, అవును, మళ్ళీ చెబుతున్నాను, జాతి హితాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. 


భారత్-చైనా సరిహద్దులో ఏమి జరుగుతోంది? స్పష్టమే. గత కొద్ది దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా మన భూభాగంలోకి చైనా చొర బడింది. ప్రతి వేసవిలోనూ భారత్, చైనా సైనిక దళాల మధ్య నెలకొనే ప్రతిష్టంభన లాంటిది కాదిది. 2017లో డోక్లాంలో చోటుచేసుకున్న చొరబాటు లాంటిది కూడా అసలే కాదు. ముందుగా రూపొందించుకున్న ఒక పథకం ప్రకారం సరిహద్దు పొడవునా పలు ప్రాంతాలలో చొరబాట్లు జరిగాయి. వేలాది చైనీస్ సైనికులు వాస్తవాధీనరేఖ (ఎల్ఏసి)ని దాటి మన భూభాగాల్లోకి వచ్చి తిష్ఠ వేశారు. మన భూభాగాల్లో తిష్ఠ వేసిన తమ సైనికులకు మద్దతుగా, ఎల్‌ఏసికి ఆవల చైనా భూభాగాల్లో చైనా సైనిక దళాలు సర్వసన్నద్ధంగా వున్నాయి. వేల కిలో మీటర్ల సరిహద్దు వెంబడి కీలక ప్రాంతాలలో ఎల్‌ఏసిని మార్చి వేసే సంకల్పంతోనే చైనా ఈ దురాక్రమణలకు పూనుకుందనడంలో సందేహం లేదు.


వాస్తవాధీనరేఖను చైనా ఎందుకు మార్చాలనుకుంటున్నది? మనకు తెలియదు. డోక్లాం ప్రతిష్టంభన సందర్భంలో వలే ఇప్పుడు తమ చొరబాట్లను చైనా అంగీకరించడం లేదు. ఇంక కారణాలు ఎలా వెల్లడిస్తుంది? చైనా ప్రభుత్వం ఇటువంటి చర్యలను అన్యమనస్కంగా చేపట్టదు. ఏదైనా రెచ్చగొట్టే చర్యకు అనాలోచితంగా ప్రతిస్పందించదు. ఒక సుదీర్ఘ వ్యూహంలో భాగంగానే ప్రస్తుత చొరబాట్లు జరిగాయి. చైనా విస్తరణవాద విధానాలకు ఈ చొరబాట్లు తిరుగులేని తార్కాణాలని మనం భావిస్తే అది మన మానసిక బద్దకాన్ని మాత్రమే సూచిస్తుంది. ఎల్‌ఏసికి ఈవల మన భూభాగాల్లో మౌలిక, సైనిక సదుపాయాలను ఆవల చైనాకు ఉన్నవాటికి దీటుగా అభివృద్ధి పరచడానికి న్యూఢిల్లీ పూనుకున్నది. భారత్ ఇలా వ్యవహరించడాన్ని బీజింగ్ వ్యతిరేకిస్తుందని మరి చెప్పనవసరం లేదు. భారత్‌ను దెబ్బ తీసేందుకే ప్రస్తుత చొరబాట్లకు చైనా సైన్యం పూనుకున్నదా? జమ్మూ-కశ్మీర్ విభజన అనంతరం లద్దాఖ్ ప్రాంతానికి కొత్త భౌగోళిక పటాన్ని రూపొందించడం పట్ల ప్రతిస్పందనగానే చైనా ఈ దురాక్రమణలకు పాల్పడిందా? అమెరికా నేతృత్వంలోని చైనా వ్యతిరేక కూటమిలో చేరవద్దని భారత్‌ను హెచ్చరించడమే చైనా లక్ష్యమా? ప్రస్తావిత అంశాలన్నీ ఈ చొరబాట్లకు, బహుశా, దారి తీసివుండొచ్చు.


నిర్దిష్ట కారణమేమిటో మనం స్పష్టంగా తెలుసుకోలేము.. ఎందుకంటే తన చర్యలు, నిర్ణయాలకు ప్రేరణలు ఏమిటనేది వెల్లడించే ఆనవాయితీ చైనా రాజ్యవ్యవస్థకు మొదటి నుంచీ లేదు. కనుక చైనా చర్యలను బట్టే దాని ఉద్దేశాలేమిటో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ చర్యలు మనకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మన జాతీయ భద్రతకు దీర్ఘకాలిక ముప్పు పాకిస్థాన్ నుంచి గానీ, మరే ఇతర స్నేహరహిత పొరుగు దేశం నుంచిగానీ రావడం లేదు. మనం ఒకే ఒక్క దాని గురించి కలవరపడవలసివున్నది. అది, అపరిమిత ఆర్థిక బలం, శక్తి మంతమైన సైనిక పాటవం కలిగివున్న చైనా. నిస్సందేహంగా మనం చైనా సంకల్పం గురించి భయపడవలసివున్నది. దీర్ఘకాలిక వ్యూహాలు రచించుకుని అమలుపరచడంలో చైనా ను మించిన దేశం మరొకటి లేదు. చైనాతో వేల కిలో మీటర్ల పొడవైన అస్పష్ట సరిహద్దు వున్న మన దేశం సహజంగానే బీజింగ్ వ్యూహాలు, పథకాల గురించి తరచు వ్యాకుల పడవలసివస్తోంది. 


చైనాతో ప్రతిష్టంభనకు ముందు మనలను మనమే నిందించుకోవలసివున్నది. ఎందుకంటే మన వైపునే పొరపాటు జరిగింది. అది చాలా మూర్ఖమైన పొరపాటు. చైనా చొరబాట్లను సకాలంలో ఊహించి, శీఘ్రగతిన ప్రతిస్పందించడంలో స్థానిక కమాండర్ లేదా ఉన్నతస్థాయిలోని వారు విఫలమయ్యారు. ఏమైనా మొదటి ఎత్తువేసిన చైనాకే మరింతగా పురోగమించేందుకు ఇప్పుడు సానుకూల పరిస్థితులు వున్నాయి. సరిహద్దు వెంబడి మన సైనిక దళాల మొహరింపు పెరిగింది. అయినా చైనానే అన్ని విధాల మనకంటే మెరుగ్గా వున్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మన భూభాగాల నుంచి చైనా సైనికులను వెళ్ళగొట్టేందుకు భారత సైన్యం ఇప్పుడు చేయగలిగింది చాలా తక్కువ. తుపాకులకు పని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల పరిస్థితులు మనకు మరింత ప్రతికూలంగా పరిణమించే ప్రమాదమున్నది. ఆర్థికంగా, సైనికంగా చైనా ఒక మహాశక్తి. చైనా, పాకిస్థాన్ కాదు.


చైనాకు వ్యతిరేకంగా బాలాకోట్ తరహా సర్జికల్ దాడుల గురించి కలలో కూడా మీరు ఆలోచించలేరు. మరి ప్రత్యామ్నాయమేమిటి? చైనాతో సంప్రదింపులు జరపడమే. ఈ విషయమై చైనా ఆసక్తి చూపడం లేదు. బీజింగ్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పనిచేయదు. సరే, మొదటి నుంచీ మనకు మిత్రరాజ్యాలుగా ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌తో సహా ఇరుగు పొరుగు దేశాలన్నిటినీ న్యూఢిల్లీ ఎంతైనా సతాయించింది. ప్రస్తుత పాలకుల అజ్ఞానం, దురహంకారం కారణంగా ఇరుగుపొరుగు దేశాలతో మన సంబంధాలు ఉండవలసిన రీతిలో లేవు. ఇదొక కఠోర వాస్తవం. అయినప్పటికీ రాజకీయ నాయకత్వం నేర్పుగా వ్యవహరించడంలో విఫలమయింది. చైనా చొరబాట్లను సకాలంలో ఊహించి, శీఘ్రగతిన ప్రతిస్పందించక పోవడానికి కారకులు ఎవరైనప్పటికీ అందుకు అంతిమ బాధ్యత ప్రధానమంత్రి కార్యాలయానిది. కాదూ, రక్షణ మంత్రిది. ఎల్‌ఏసిని మార్చివేసేందుకు చైనా ప్రయత్నించడం లేదని భారత సైన్యం అంటోంది. చైనీస్ సరుకులను బాయ్‌కాట్ చేయమనడం మినహా జాతీయవాద బ్రిగేడ్ మరేమీ మాట్లాడడం లేదు! 


రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలుత ఎల్‌ఏసిని స్పష్టంగా నిర్ణయించలేదని అన్నారు. ఆ తరువాత చైనా సైనికుల చొరబాట్లు నిజమేనని అంగీకరించారు. రక్షణ మంత్రి ఇలా మాట్లాడడం చైనాపై మన ఆరోపణలకు బలం చేకూరలేదు. ఇంతకూ చైనా సైనికదళాలు ఎల్‌ఏసిని దాటి మన భూభాగాల్లోకి రావడం పట్ల రక్షణ మంత్రి ఇంకా ఆక్షేపణ తెలుపలేదు. చైనా దళాలు ఆక్రమించుకున్న ప్రాంతాలు భారత్ భూభాగాలేనన్న విషయాన్ని ఎలుగెత్తి చెప్పలేదు. ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారు. పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు అప్పగించినట్టున్నారు. చైనా చొరబాట్ల విషయమై మోదీని మీడియా ఇంతవరకు ఎలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగలేదు. ఈ సానుకూల పరిస్థితి ఎంతో కాలం వుండదు చైనా ‘దురా క్రమణ’ను మోదీ ప్రభుత్వం నిరాక్షేపణీయంగా ఎలా సమ్మతించిందన్న మహా ఇబ్బందికరమైన ప్రశ్నను ఎవరో ఒకరు త్వరలోనే తప్పక అడుగుతారు.


దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఇటువంటి సందర్భంలోనే ఆనాటి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూపై ప్రతిపక్ష నేత వాజపేయి ఒక తీవ్ర ఆరోపణ మోపారు. నీఫా (నేటి అరుణాచల్ ప్రదేశ్)లో చైనా చేతుల్లో మన సైనిక దళాలు ఘోర పరాభవానికి గురయిన తరుణమది. 1962 నవంబర్ 9న రాజ్యసభలో వాజపేయి మాట్లాడుతూ మన భూభాగాలను చైనా ఆక్రమించుకోవడాన్ని ఎలా అనుమతించారని నిలదీసి ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధంగా మోదీని నిలదీయవచ్చు. సరిహద్దుల్లో పరిస్థితుల విషయమై వాస్తవాలు స్పష్టంగా వెల్లడించాలని రాహుల్ గాంధీ ఇప్పటికే డిమాండ్ చేశారు. 


ప్రధాని మోదీకి ఇదొక ఇబ్బందికరమైన పరిస్థితి అనడంలో సందేహం లేదు. అయితే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆయనపై ధ్వజమెత్తే విషయంలో సంయమనం చూపాలి. ఎందుకని? కరోనా వైరస్ కారణంగా మనం ఇప్పుడు ఒక జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితిలో ఉన్నాం. జాతీయ భద్రత విషయమై రాజకీయ దాడి వల్ల కొవిడ్ మహమ్మారిపై చేస్తున్న పోరు నుంచి ప్రభుత్వం తన దృష్టిని మళ్ళించవలసివస్తుంది. ఇది ప్రజారోగ్య పరిరక్షణకు శ్రేయస్కరం కాదు. ఒక మహా ఆర్థిక సంక్షోభంలో కూడా ఉన్నామనే వాస్తవాన్నికూడా మనం విస్మరించడానికి వీలులేదు. చైనాతో సైనికంగా తలపడడం గానీ లేదా తలపడేందుకు సంసిద్ధమవ్వడం గానీ మన ఆర్థిక వ్యవస్థను మరింతగా కుదేలు పరుస్తుందనడంలో సందేహం లేదు. ఇటువంటి దుస్థితి వాటిల్లకుండా మనం జాగ్రత్త పడాలి. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే ఒత్తిడి వల్ల మోదీ ప్రభుత్వం అనాలోచిత చర్యలకు లేదా దుస్సాహసాలకు పాల్పడవచ్చు.


దీనివల్ల మన జాతీయ ప్రయోజనాలకు హాని కలుగుతుంది. చైనా ఒక దీర్ఘకాలిక వ్యూహంతోనే మన భూభాగాల్లోకి చొరబడిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఆ పన్నాగానికి దీటుగా ప్రతిస్పందించేందుకై మోదీ ప్రభుత్వానికి తగు సమయమూ, అవకాశమూ ఇవ్వాలి. జాతి హితాన్ని దృష్టిలోఉంచుకుని మాత్రమే ప్రతి రాజకీయ పార్టీ వ్యవహరించాలి. జాతీయ భద్రత అనేది బాగా దుర్వినియోగమయిన పదం. దానినొక స్ఫూర్తిదాయకమైన భావన, లక్ష్యంగా రూపొందించి సార్థకం చేసేందుకు భారత్-చైనా పొలిమేరలో ప్రతిష్టంభన ఒక అరుదైన అవకాశమని చెప్పవచ్చు. ప్రధాన ప్రతిపక్ష నాయకులందరినీ విశ్వాసంలోకి తీసుకోవడం ద్వారా జాతి హితం పట్ల తన నిబద్ధతను ప్రధాని మోదీ నిరూపించుకోవాలి. ప్రధానమంత్రికి ఇబ్బందులు సృష్టించకుండా ఉండడం ద్వారా జాతి హితం పట్ల ప్రతిపక్షాలు తమ నిబద్ధతను చూపాలి.


యోగేంద్ర యాదవ్

(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

Advertisement
Advertisement
Advertisement