Abn logo
May 8 2020 @ 03:15AM

మద్యాంబుధిలో పడి వ్రతం చెడ్డ మోదీ!

పేద ప్రజలకు ఉదారంగా ఉపకరించే పద్ధతిలో మద్యం సీసాలపై 75 శాతం పెంచామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మేము 11 శాతమే పెంచామని తెలంగాణ ముఖ్యమంత్రి సగర్వంగా ప్రకటించుకొంటున్నారు. మందు అందుబాటులోకి రావాలేగాని, ధరలు చూస్తారా? వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందే మొత్తం సారాయికే కేటాయిస్తారు. చివరకు పేదలే అభాగ్యులు.


విశ్వామిత్రుడు తన లక్ష్యసాధనకు అకుంఠిత తపస్సు తలపెట్టారు. అంతటి మహానుభావుడే ‘మేనక’ మాయలోపడి తపస్సు లక్ష్యాన్ని భగ్నం చేసుకున్నారు. అలాగే 135 కోట్ల ప్రజలున్న భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రాంతీయ పార్టీలు, మతాలు వీటి మధ్య విభేదాలు, తీవ్ర విభేదాలూ ఉన్నాయి. కొవిడ్‌- 19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే.. కనపడని శత్రువుతో యుద్ధం చేసినట్లు ప్రజలంతా ఐక్యంగా నిలబడి విభేదాలు పక్కనబెట్టి ప్రధాని మోదీ ఇచ్చిన లాక్‌డౌన్‌ను జయప్రదం చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లాంటిది కాదు మన ‘భారతదేశం’! ఒక శాతం మంది వద్ద ‘90’ శాతం ఆర్థిక సంపద కేంద్రీకృతమై పేద, ధనిక వ్యత్యాసాలు భూమి ఆకాశమంత తేడాలో ఉన్నాయి. దాదాపు 40 కోట్లమంది వలస, అసంఘటిత కార్మికులకు సరైన కనీస వసతులులేని పరిస్థితి.


అందులో గుడిసె లేకుండా ఫుట్‌పాత్‌లపై నివసించే ప్రజలుంటే, వలస కార్మికులది కమ్యూన్‌ బతుకులే. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఒక్కో కమ్యూన్‌లో 50 నుండి 100మందికి లావెటరీ కూడా లేని పరిస్థితి. గిరిజన ప్రాంతాల్లో ఇంకా దారుణమైన పరిస్థితి. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇళ్ల్లలో ఉండమని ఆదేశం. పక్కా ఇళ్ల్లు ఎవరికున్నాయో వారు అమలుపర్చారు. మిగిలిన అసంఘటిత, వలస కార్మికులకు రక్షణ లేకుండాపోయింది. లాక్‌డౌన్‌ అనంతరం కాంట్రాక్టర్లు మాయమైపోయారు. కార్మికులకు పనిలేకుండా పోయింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా ప్రతి వ్యక్తికి/ కుటుంబానికి ఆర్థికసాయం, ఆహార వస్తువులు అందిస్తామని ఎవరికీ పస్తులతో అలమటించే పరిస్థితిని రానీయమని ప్రధానమంత్రి మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు బహిరంగంగా ప్రకటించారు. అలా ప్రకటించడానికి పునాది ఉంది. ఇప్పటికీ ఆహారధాన్యాలు 5.5లక్షల టన్నులు గిడ్డంగుల్లో ఉన్నాయి. ఇంకో నెలలో 2 లక్షల టన్నుల ధాన్యం గోడౌన్లలో చేరుతుంది.


ఈ ఆహారధాన్యం నుండి ప్రతి కుటుంబానికి 20కేజీల ఆహారధాన్యాలు 3నెలలపాటు ఇచ్చినా ఇంకా మూడొంతుల ఆహారధాన్యం గిడ్డంగుల్లో ఉం టుంది. కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 36 రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసేందుకు కనీసంగా 7 లక్షల కోట్లు ఖర్చని అంచనా. ఒక్క కేరళ రాష్ట్రం మాత్రమే ప్రతి ఇంటికి 19 రకాల ఆహార వస్తువులు 5000 రూపాయలు ఇళ్లకే పంపించింది. ప్రపంచంలోనే కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను కాపాడింది కేరళ రాష్ట్రమని బీబీసీ వార్తాకథనం ప్రశంసించింది. ఈ సత్యాన్ని ప్రధాని ‘మోదీ’ మొదలు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరకు అంగీకరించారు. మోదీ ఇప్పటికి ఐదు మార్లు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అందులో ఆర్థిక ప్యాకేజీ పొరపాటున కూడా ప్రకటించలేదు.


బీజేపీ ప్రభుత్వంతో విభేదించినవారితో సహా ప్రధాని పిలుపుని ఆమోదించారు. అలా ఎందుకు చేశారు? వైద్యంలేని జబ్బుతో పోరాడాలంటే ప్రధాని సందేశం అమలు చేయాలని దేశభక్తియుతంగా అంగీకరించారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో ‘కరోనా’ వైరస్‌ నిలువరించడంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం బహు భేష్‌ అంటున్నారు. అయితే ఇక్కడ దాగి ఉన్న ఒక వాస్తవాన్ని విస్మరించకూడదు. పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశ వాతావరణం ప్రజలకిచ్చిన వరం. ‘‘సహజ వ్యాధి నిరోధక శక్తి’’, దానితో పాటు లాక్‌డౌన్‌.


లాక్‌డౌన్‌ అప్పటికప్పుడే ఉన్నపళంగా ప్రకటించింది కాదు. ప్రకటనకు ముందుగానీ, ప్రకటించాకగానీ వలస కార్మికులపై అవగాహన ఉండాలి కదా! వారి సమస్యల పరిష్కారం కొరకు అనేక సూచనలు చేసినా పెడచెవిన పెట్టారు. చివరకు ఆకలిచావులకు, సుదూర కాలినడకకు గురైన ప్రజలు దాదాపు 60–70మంది చనిపోయారు. 4-5వందల కిలోమీటర్ల్లు కాలినడకన భార్యాబిడ్డలతో కదిలారు. చివరకు సహనం కోల్పోయిన వలస కార్మికులు సూరత్‌, ముంబై, హైదరాబాద్‌ తదితర పట్టణాలలో తిరగబడ్డారు. అప్పటికిగానీ కేంద్ర ప్రభుత్వం కదలలేదంటే కేంద్ర నిఘా విభాగం ఏమైంది? కేంద్ర ప్రభుత్వం ఆ నిఘా విభాగంతో ఏమి పనిచేయిస్తోంది?


తీరా అతికష్టంమీద వలసకార్మికులను స్వస్థలాలకు పంపమని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. వివిధ రాష్ట్రాలలోనున్న లక్షలాది మంది కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయలేక రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. లాక్‌డౌన్‌ ముందుగానీ, ప్రకటించిన తక్షణమే గానీ ఈ తరలింపు జరిగుంటే అటు కార్మికులకుగానీ, నిర్మాణ సంస్థలకుగానీ ఉపయోగం ఉండేది. ఇప్పుడు ఈ ప్రక్రియ ‘‘రెండింటికీ చెడ్డరేవడి’’గా దాపురించింది. కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా నిలబడింది. అయినా ఇంకా ‘కొవిడ్‌ 19’ అంత తొందరగా పోదనీ సహజీవనం చేయాల్సిందేనని బాధ్యతాయుత రాజకీయనాయకులే బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన బ్రిటిష్‌ ప్రధానే కరోనా వైరస్‌కు గురై చావుబతుకులతో పోరాడి ఎలాగో బయటపడ్డారు. ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మన ప్రధాని ఏమి సందేశం ఇస్తారోనని ఎదురు చూస్తున్న వేళ ‘‘చావుకబురు చల్లగా’’ సారాయి అమ్ముకొని బతకమని రాష్ట్రాలకు సలహా ఇచ్చారు.


అప్పటికే ఆవురావుమంటున్న దుష్టశక్తులకు వేయి ఏనుగుల బలం వచ్చింది. తక్షణం స్పందించిన ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఆగమేఘాలపై యుద్ధప్రాతిపదికన మద్యం షాపులు తెరిచేశారు. ఆ వార్త విన్న పానకాశురులకు ఉత్తేజం వచ్చింది. షాపులు తెరిచే దానికన్నా 6గంటలకు ముందే మద్యం షాపుల వద్దకు ఎగబడ్డారు. అప్పటివరకు భౌతికదూరం అని పదేపదే చిలుక పలుకులు పలికిన మోదీగారి పలుకులు పంజరంలోనే నిర్భందించబడ్డాయి. పాపం పోలీస్‌ సిబ్బందికి సంకట పరిస్థితి ఏర్పడింది. అటు కరోనా నిబంధనలు అమలుపరుస్తారా లేక బ్రాందీ షాపుల వద్ద బారులు తీరి వీరంగం చేస్తూ డాన్సులేస్తున్న సారాసురులను కంట్రోలు చేస్తారా?


ఏదో పేద ప్రజలకు ఉదారంగా ఉపకరించే పద్ధతిలో మద్యం సీసాలపై 75 శాతం పెంచామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మేము 11 శాతమే పెంచామని తెలంగాణ ముఖ్యమంత్రి సగర్వంగా ప్రకటించుకొంటున్నారు. పైపెచ్చు బ్రాంది షాపులకు వెళ్లే వారికి షాకిస్తున్నామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. మందు అందుబాటులోకి రావాలేగాని, ధరలు చూస్తారా? వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా అందే మొత్తం సారాయికే కేటాయిస్తారు. అటు ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును ఇటు మద్యం తయారు చేసే కంపెనీలకు ఎక్కువగా, మిగిలింది ట్యాక్స్‌ రూపంలో వారి నుండి లాగేసుకుంటారు. చివరకు పేదలే అభాగ్యులు. డబ్బులుండే వారే మద్యం కొంటారు. పేదలు కొనరని ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది. కనులుంటే చూడొచ్చు, చెవులుంటే వినవచ్చు తెలుసుకోండి మీ నిఘా విభాగాల ద్వారా. టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మందు షాపుల ముందున్న గుంపులో నల్లచొక్కాలవారున్నారా, తెల్లచొక్కా వారున్నారా?


ఒక దఫా సినీ నటుడు చిరంజీవికి ఉత్తరం రాశాను. ‘అయ్యా మీరు కోకోకోలా, థమ్‌్స ఆప్‌‌ తాగమని యువతకు ప్రోత్సాహమిస్తూ టీవీలకు ప్రకటనలిస్తున్నారు. దానివలన యువత చెడిపోతున్నారు. మీలాంటి వారు ఆ పని చేయకం’డని సూచించాను. రెండు రోజుల తర్వాత అల్లు అరవింద్‌ నాకు ఫోన్‌చేసి ‘ప్రకటనల ద్వారా వచ్చిన సొమ్ము చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కు కేటాయిస్తున్నాం. అది ప్రజలకే ఉపయోగపడుతోందని’ చెప్పారు. ‘అడుసు తొక్కనేల కాళ్లు కడుగనేల... రక్తం చెడిపోయే విధంగా కోకోకోలా తాగమని యువతను ఎగదోలతారు. తీరా వారి రక్తం చెడిపోయాక చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ నుండి రక్తమివ్వడమేలా?’ అన్నాను.


దాంతో 6 నెలల వ్యవధిలో వారు దానికి స్వస్తి చెప్పారు. అది విజ్ఞుల పని. కానీ ఇక్కడ ధరలు పెంచి మద్యం అమ్మి దాన్నే సామాజిక సేవ అని చెప్పుకునే దివాళాకోరు రాజకీయ నాయకులు మన పాలకులు! ప్రజలు దౌర్భాగ్యులా, పాలకులు దౌర్భాగ్యులా? భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం చేయకుండా సారా అమ్ముకుని బతకండని సెలవిస్తే తగుదునమ్మా అని రాష్ట్రాలు ఆవురావురు మంటూ గంగిగోవులపై పులులు పడినట్లు పేద ప్రజల రక్తమాంసాలను హరించి వేస్తున్నాయి. ఇంతకు కరోనా వైరస్‌కు విరుగుడుగా అకుంఠిÄత తపస్సు తలపెట్టిన మోదీ మేనక వలలోపడి తపస్సు భగ్నం చేసుకున్న విశ్వామిత్రుని లాగా లేరూ? అయ్యో పాపం.

డాక్టర్‌ కె. నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి

Advertisement
Advertisement
Advertisement