Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇరుగైనా పొరుగైనా, పురుగు ఒక్కటే!

స్వరాజ్యం కోసం తపనపడిన భారతదేశంతో వలసపాలకులు ఆడిన నెత్తుటి క్రీడలు చరిత్ర తెలిసినవారెవరూ మరచిపోలేరు. విభజించి పాలించే దుష్టత్వం, చరిత్రను మతకల్మషంలో ముంచి వక్రీకరించిన కుటిలత్వం, అనేకానేక భవిష్యత్ కల్లోలాలకు ముందే గోతులు తీసిపెట్టిన దూరదృష్టి-.. బ్రిటిష్ పాలకుల విశిష్టతలలో కొన్ని మాత్రమే. అధికార మార్పిడి జరిగి ముప్పాతిక శతాబ్ది గడుస్తున్న సమయంలో, గుర్తుపెట్టుకోవలసినవి, నయం చేసుకోగలిగినవి, విస్మరించగలిగినవి అయిన గాయాలను వేరువేరుగా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఎందుకనిపించిందో కానీ, స్వాతంత్ర్యమే కాదు, దేశవిభజనను, దాని చుట్టూ ఆవరించిన చీకటిని కూడా స్మరించుకోవాలన్నారు ప్రధానమంత్రి. అందుకోసం ప్రత్యేకించి ఒక రోజును, పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే ఆగస్టు 14ను, స్మారకదినంగా ఆయన ప్రకటించారు కూడా. 


దేశవిభజన గురించిన తర్జన భర్జనలు ఇంకా జరుగుతూ ఉండగానే, ఉద్రేకాలు వ్యాపించడం మొదలయింది. మానవత్వం తలవంచుకోవలసిన ఆనాటి విషాదానికి అనేక రంగస్థలాలు. ఒక్కోచోట ఒకరు బాధితులు. మొత్తంగా రెండు నవజాత దేశాలు తమ బాల్య అమాయకత్వాన్ని, స్వేచ్ఛా విలువల ధర్మావేశాన్నీ కోల్పోయి, నైతికంగా దోషులుగా నిలబడ్డాయి. అటువంటి అనేక హింసావేదికలలో, నౌఖాళీ (నవకాళి) హత్యాకాండ ఒక విషాదబీభత్సం. ఐదువేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. లూటీలు, దొమ్మీలు, విధ్వంసాలు సరేసరి. పెద్దసంఖ్యలో బలవంతపు మతమార్పిడులు జరిగాయి. హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉండే ప్రాంతం అది. అనేకానేక సామాజికార్థిక కారణాలు, స్థానిక ప్రేరణలు హింసాకాండకు నేపథ్యంగా చెప్పవచ్చును కానీ, బాధితులు మాత్రం అత్యధికులు హిందువులే. అక్కడి దారుణాలను తన సత్యాగ్రహంతో ఉపశమింపజేస్తానని దీక్షకు కూర్చున్న గాంధీజీ చివరకు నిరాశనే ఎదుర్కొన్నారు. దేశం సమైక్యంగా ఉండడానికి అనువైన సామరస్యం సాధ్యమేనని ఆయన నిరూపించదలచుకున్నారు కానీ, ఆయన దీక్షలో ఉండగానే దేశవిభజనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. 1946 అక్టోబర్‌లో, సరిగ్గా 75 సంవత్సరాల కిందట దుర్గాపూజల రోజుల్లోనే, నవకాళిలో చిచ్చు రాజుకున్నది. తరువాతి కథ తెలిసిందే.


చిటగాంగ్ డివిజన్‌లోని నవకాళి, దేశవిభజనతో బంగ్లాదేశ్‌లో భాగమైంది. ఇప్పుడు మళ్లీ ఈ ఏడాది అక్టోబర్ దుర్గాపూజ రోజుల్లోనే తిరిగి మతహింస మొదలైంది. అనేక దుర్గా మండపాలు, దేవాలయాలతో పాటు, నవకాళిలోని ‘ఇస్కాన్’ దేవాలయం కూడా ధ్వంసమయింది. హత్యలు, లూటీలు, గృహదహనాలు, అత్యాచారాలు ఏదో ఒక స్థాయిలో పదిహేను రోజుల దాకా సాగుతూనే ఉన్నాయి. కఠినచర్యలు తీసుకుంటానన్న ప్రధాని హసీనా మాటలు శుష్కంగానే మిగిలిపోయాయి. ఆనాడు జాతీయోద్యమ విలువలు దేశవిభజన హింసాకాండ ముందు వీగిపోయాయి. ఇప్పుడు, బంగ్లాదేశ్ తనను తాను సంపాదించుకున్న యాభైఏళ్లకు, వంగ సాంస్కృతిక విలువన్నీ మంటకలిసి, మరో మతోన్మాద జాతి రూపుదిద్దుకుంటున్నది. 


బంగ్లాదేశ్ ఏర్పాటు వెనుక అంతర్జాతీయ వ్యూహాలు, భూభౌగోళిక రాజకీయాలను ఎట్లా పరిగణించినప్పటికీ, బంగ్లా ప్రజలు చేసింది, మతభావనను అధిగమించిన లౌకిక ఉద్యమం. మతం ఒక్కటే అని కదా, సాటి బెంగాలీల నుంచి విడిపడి తూర్పు బెంగాల్‌గా మారింది! కానీ, సాటి మతస్థులే, భాష పేరుతో సంస్కృతి పేరుతో హీనపరుస్తుంటే, సైనిక పాలనలు అణగార్చి వేస్తుంటే, తూర్పు బెంగాలీలు తిరగబడ్డారు. బంగ్లా మాట్లాడుకునే ముస్లిములు వేరు, మేము విడిగా ఉంటాము అని ఆకాంక్షించి అవతరించిన దేశం, ఎక్కువ కాలం సెక్యులర్‌గా మిగలలేదు. 1988లో ఇస్లామిక్ దేశంగా మారిన బంగ్లాదేశ్‌ను తిరిగి, తన తండ్రి హయాంలో ఏర్పడిన 1972 నాటి సెక్యులర్‌ రాజ్యాంగాన్ని పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన షేక్ హసీనా, మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు.


నిరుపేద దేశంగా ఉన్న బంగ్లాదేశ్‌ను రాజకీయ అస్థిరత, సైనికపాలనలు మరింత కుంగదీశాయి. రాజకీయ వైఫల్యాలు సంక్షోభాలకు దారితీస్తాయి, ప్రజలు తీవ్రపరిష్కార మార్గాలు వెదుక్కునేటట్టు చేస్తాయి. మతాన్ని తిరస్కరించి, సొంత సంస్కృతి కోసం పోరాడిన వారు, మతతీవ్రవాదానికి ఆకర్షితులు కావడం మొదలయింది. పాకిస్థాన్‌లో లాగే, బంగ్లాదేశ్‌లో కూడా నాయకులు, మతోన్మాద శక్తులను సంతృప్తిపరచడానికి ప్రయత్నించవలసి వస్తోంది. భారతదేశంలో ఉన్న మతసామాజిక పరిస్థితులను చూపి, తమ దేశంలో సామరస్యాన్ని భగ్నపరిచేందుకు అక్కడి ఉన్మాద శక్తులు ప్రయత్నించసాగాయి. ఈ నెలలో మతహింసాకాండ తీవ్రం కాగానే, దుండగులను ఒకపక్క హెచ్చరిస్తున్నట్టు ప్రకటిస్తూనే, భారతదేశంలో బంగ్లా హింసకు ప్రతిఫలనాలు లేకుండా చూసుకోవాలని హసీనా ‘హితవు’ చెప్పడం వివాదాస్పదం అయింది. 


ఉపఖండంలో మతసామరస్యం అన్నది ఏ దేశానికి ఆ దేశంలో విడివిడిగా నెలకొనేది కాదని, పరస్పరాధారితం అన్న అర్థాన్ని బంగ్లా ప్రధాని వ్యక్తం చేయడంలో అనేక అన్వయాలను గ్రహించవచ్చు. ఆశ్చర్యకరంగా, భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో మితభాషిత్వం ప్రకటించింది. ఇటువంటి సందర్భాలలో వీరంగం వేయాలని ఆశించే ఔత్సాహికులకు మోదీ ప్రభుత్వం తీరు మింగుడు పడడం లేదు కూడా. ఏమి చేయాలో తెలియక, మత ఉద్రిక్తతల మీద ఆధారపడి జీవించేవారు, ఇదే అదనుగా భారతదేశపు లౌకికవాదులను విమర్శిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసను మీరెందుకు ఖండించడం లేదు? అంటూ నిలదీస్తున్నారు. నిజానికి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లేఖాస్త్రాలు సంధిస్తూ, విమర్శలను గుప్పిస్తున్నవారిలో భారతీయ లౌకికవాదులే ఎక్కువ. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ నుంచి మేధావులు, రచయితలు పుంఖానుపుంఖంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్షణ కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌కు ఉన్న మరొక దురదృష్టం ఏమిటంటే, అక్కడ మన దేశంలో ఉన్నంత మధ్యతరగతి మేధావి వర్గం, పౌరసమాజం లేకపోవడం. తప్పొప్పులు తెలిసి, నలుగురికి చెప్పగలిగినవారిలో అత్యధికులను వివిధ ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వంతో సహా, మూగబోయేట్టు చేశాయి. అదృశ్యాలు, అపహరణలు, చట్టబాహ్య హత్యలు, బంగ్లాదేశ్‌లో నిర్బంధాలు చెప్పనలవికానివి. అయినప్పటికీ, బలహీనంగా అయినా కొన్ని గొంతులు పెగులుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొర్తాజా, రంగ్ పూర్‌లో జరిగిన హింస, గృహదహనాలు తన గుండెను గాయపరిచాయని అన్నాడు. ‘‘స్కాట్ లాండ్ చేతిలో టి20 మ్యాచ్ ఓడిపోవడం ఒక నష్టం అయితే, మరో నష్టం యావత్ దేశానిది. ఈ ఎరుపూ ఈ ఆకుపచ్చా కాదు మనం చూడాలనుకుంటున్నదీ, ఎన్నో స్వప్నాలు, ఎన్నో కష్టార్జిత విజయాలు ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయి, అల్లా మనలకు దారి చూపించుగాక’’ అని మొర్తాజా చేసిన ప్రకటన సాహసంతో కూడినదే. 


భారతదేశంలోని అనేక పరిణామాలు అంతర్జాతీయ సమాజం దృష్టికి వెళ్లినప్పుడు, కొన్ని స్పందనలు రావడం సహజం భారతదేశంలో గత ఏడేళ్లుగా నెలకొని ఉన్న భావ వాతావరణంపైన, ఇటీవలి రైతు ఉద్యమం మీద అంతర్జాతీయ ప్రముఖులు వ్యాఖ్యలు చేసినప్పుడు, కొన్ని దేశాల నుంచి విమర్శలు వచ్చినప్పుడు, మన దేశంలోని అధికార ప్రతినిధులు కొందరు ‘ఆంతరంగిక వ్యవహారాలలో బయటివారి జోక్యం కూడద’న్న ధోరణిలో ప్రతి విమర్శలు చేశారు. ఇప్పుడు బంగ్లా సంఘటనలపై మితిమీరి వ్యాఖ్యానిస్తే, అటువంటి సమాధానమే వస్తుందేమోనన్న భయం ప్రభుత్వ పెద్దలలో ఉండవచ్చు. సంఘటనలు బాధాకరమని, హసీనా చిత్తశుద్ధి మీద నమ్మకం ఉన్నదని ఒక ప్రకటన అయితే చేశారు కానీ, అంతకుమించి పెదవి విప్పలేదు. ప్రభుత్వాధినేతల భక్తులు మాత్రం, చూశారా, పౌరసత్వ చట్టం ఆవశ్యకత అర్థం అయిందా, ఆ మతం వారి దుర్మార్గం తెలిసివచ్చిందా అన్న తీరులో సామాజిక మాధ్యమాలలో ఆవేశపడుతున్నారు. 


నవకాళీ అయినా, గుజరాత్‌ అయినా భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కావు. అవి మన మనస్సులను ఆవరించే ద్వేషోన్మాదవేదికలు. అసహనానికి పాలుపోసి పెంచి, ఏదో ఒక వర్గాన్ని పరాయిగా చిత్రించి దానిపై కార్పణ్యాన్ని చిమ్ముతూ, ఇక్కడ కూడా, మన దేశంలో కూడా, సందర్భం వచ్చినప్పుడు బద్దలయ్యే అగ్నిపర్వతాలుగా మనుషులను మార్చుకుంటున్నాము. ఈ దేశం మాది కూడా కదా, మే మిక్కడే ఉంటాం, ఉండడానికి పోరాడతాము-.. అని బంగ్లా హిందువులు అంటున్నారు. ఆ మాటలు మన దగ్గర కూడా విన్నట్టు లేవూ? బాధితుల భాష ఎక్కడైనా ఒక్కటే. 


ఇతరులు ఏది చేస్తే నీకు కష్టం కలుగుతుందో, నువ్వది ఇతరులకు చేయకపోవడం కంటె మించిన ధర్మం లేదంటుంది భారతం. బాధితుల నెప్పిని పంచుకోవాలనుకుంటున్నప్పుడు, మనం ఇతరులకు ఎప్పుడూ బాధ కలిగించకూడదని నేర్చుకుంటాము. వలసపాలన, దుర్మార్గ దేశీపాలన కలసి ఉపఖండ ప్రజల మెదళ్లలో దట్టించిన ద్వేషభాస్వరాన్ని కడిగిపారేయకపోతే, దేశం పేరేమైతేనేమి, మతం ఏదయితేనేమి, అంతటా ఒకే నెత్తురు!


కె. శ్రీనివాస్

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...