Abn logo
Aug 7 2020 @ 03:42AM

రఘురామరాజుకు కేంద్ర బలగాల భద్రత

  • ‘వై’ కేటగిరీ రక్షణ కల్పించిన హోం శాఖ
  • ఇక నియోజకవర్గంలో పర్యటిస్తా: ఎంపీరఘురామరాజుకు 
  • కేంద్ర బలగాల భద్రత


న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఆయనకు ‘వై‘ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్‌ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల నుంచి తన ప్రాణానికి ముప్పుందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై కేసులు పెడుతున్నారని.. రాష్ట్ర పోలీసుల రక్షణపై తనకు విశ్వాసం లేదని.. ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విన్నవించిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం తనకు రాష్ట్ర పోలీసులతో 1+1 భద్రత ఉన్నదని, ఇది కాకుండా అదనంగా కేంద్ర బలగాలతో వ్యక్తిగత రక్షణ కల్పించాలని  కేంద్రాన్ని కోరారు. ఆ ప్రకారం కేంద్రం 11 మందితో వై కేటగిరీ (3+3+3+2) రక్షణ కల్పించింది. 9 మంది జవాన్లు ముగ్గురేసి చొప్పున మూడు షిఫ్టుల్లో భద్రతగా నిలుస్తారు. కమాండో శిక్షణ ఉన్న ఇద్దరు గన్‌మెన్‌ కూడా ఉంటారు. రఘురామరాజు ఎప్పుడు బయటకు వెళ్లినా ముగ్గురు సిబ్బందితో పాటు ఓ కమాండో కూడా ఆయన వెంట ఉంటారు. కేంద్రం తనకు సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పించినందున త్వరలో తన నియోజకవర్గమైన నరసాపురం వెళ్తానని ఎంపీ గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు అమరావతి వెళ్లి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తానన్నారు.

Advertisement
Advertisement
Advertisement