Advertisement
Advertisement
Abn logo
Advertisement

భువనేశ్వరికి అండగా నందమూరి కుటుంబం

హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అండగా నందమూరి కుటుంబం నిలిచింది. శనివారం మీడియా సమావేశంలో తమ మనోభావాలను వ్యక్తం చేశారు. జరిగిన పరిణామాలు దురదృష్టకరమైనవని వారు అన్నారు. వ్యక్తిగత అజెండాగా పెట్టుకుని వైసీపీ నేతలు మాటల దాడి చేశారని మండిపడ్డారు. అసలు  అసెంబ్లీలో ఉన్నామా?.. గొడ్ల చావిడిలో ఉన్నామా? అర్థం కాలేదన్నారు. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు సరైనవికావని, సభలోవాగ్వాదం సహజమని, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆనవాయితీ అని నందమూరి కుటుంబం పేర్కొంది.

ఇప్పటికైనా వైసీపీ నేతలు మారకుంటే మెడలు వంచి మారుస్తామని నందమూరి కుటుంబం హెచ్చరించింది. అధికారం శాశ్వతం కాదని, ఇక్కడ మేము చేతులు కట్టుకుని కూర్చోలేదని అన్నారు. పార్టీ ఆఫీస్‌పై దాడి చేసినా సహించామంటూ... ఇకపై తమ ఆడవాళ్ల జోలికి వస్తే సహించేది లేదన్నారు. తమ కుటుంబంపై మాట్లాడితే ఖబడ్దార్‌... అంటూ నందమూరి కుటుంబం తీవ్రస్థాయిలో హెచ్చరించింది. మెజార్టీ ఉంది కదా అని విర్రవీగి మాట్లాడితే ఊరుకునేది లేదని నందమూరి కుటుంబం హెచ్చరించింది. ఇకపై నీచ, నికృష్ట పదజాలం వాడితే ఒక్కొక్కరి భరతం పడతామంది. ఇకపై చంద్రబాబు అనుమతి కూడా తమకు అవసరం లేదని నందమూరి కుటుంబం స్పష్టం చేసింది.


అసెంబ్లీ అనేది దేవాలయంతో సమానమని భువనేశ్వరి సోదరి లోకేశ్వరి అన్నారు. సమస్యలను చర్చించి పరిష్కరించే సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. నందమూరి తారక రామారావు కోడలు వసుంధర మాట్లాడుతూ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వారి ఇంటి ఆడపిల్లలే సమాధానం చెప్పాలన్నారు. దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని మాట్లాడుతూ తమ కుటుంబ మహిళలు ఎనాడూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. సభలో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సరికాదన్నారు.

నందమూరి రామకృష్ణ గద్గద స్వరంతో మాట్లాడారు. వైసీపీ నేతలు అదుపులో ఉండాలని హెచ్చరించారు. తన సోదరికి జరిగినట్టు ఏ మహిళకు జరగకూడదన్నారు. ఇక మీదట నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కుటుంబసభ్యుల జోలికి వస్తే ఊరుకునేది లేదని, సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. నందమూరి శ్రీమంతిని మాట్లాడుతూ మహిళలకు నందమూరి కుటుంబంలో పెద్దపీట వేశారన్నాన్నారు.అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.


నందమూరి కుటుంబీకుడు చైతన్య కృష్ణ మాట్లాడుతూ నందమూరి కుటుంబం అందరితో గౌరవంగా ఉంటుందన్నారు. వైసీపీ నేతలకు సిగ్గు, లజ్జా ఉందా? అని ప్రశ్నించారు. నందమూరి తారకరామారావు మహిళలకు సమాన హక్కు ఇచ్చారని, కండక్టర్లుగా మహిళలకు అవకాశం ఇచ్చారన్నారు. మహిళల కోసం చంద్రబాబు డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చారన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీకృష్ణను బర్తరఫ్‌ చేయాలని చైతన్యకృష్ణ డిమాండ్ చేశారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని అసభ్య పదజాలంతో దూషించడం దిగ్ర్భాంతికరమన్నారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి కానీ.. కుటుంబ సభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదన్నారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండటం వల్లే వైసీపీ మనుగడ సాగిందన్నారు. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో వంద తప్పులు పూర్తయ్యాయన్నారు. ప్రతి ఒక్క టీడీపీ సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారని నారా రోహిత్ హెచ్చరించారు.

Advertisement
Advertisement