Abn logo
Sep 30 2020 @ 05:20AM

నల్లమలలో నరకం

Kaakateeya

అధ్వాన్నంగా కేజీ జాతీయ రహదారి

రోడ్డు దిగితే ఇరుక్కుపోతున్న వాహనాలు

సింగిల్‌ రోడ్డుకు ఇరువైపులా సుద్ద మట్టి


ఆత్మకూరు, సెప్టెంబరు 29: నల్లమలలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ప్రకాశం జిల్లా పరిధిలోని రస్తా అధ్వాన్నంగా తయారైంది. ఆ దిశగా ప్రయాణించే వాహనదారులకు అగ్ని పరీక్ష ఎదురవుతోంది. రహదారిపై నుంచి వాహనం కాస్త కిందకు దిగితే మట్టిలో ఇరుక్కుపోతోంది. ఆత్మకూరు నుంచి దోర్నాలకు వెళ్లాలంటే కేజీ రహదారిపై సుమారు 67 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందులో రోళ్లపెంట ఘాట్‌ 27 కి.మీ. వరకు కర్నూలు జిల్లా పరిధిలో ఉంది.


ఆ తర్వాత మిగిలిన 40 కి.మీ. దూరం ప్రకాశం జిల్లా పరిధిలో ఉంది. నాగార్జున సాగర్‌-శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం పరిధిలో ఉండటం వల్ల నల్లమల అటవీ ప్రాంతంలోని కేజీ రోడ్డు చాలా వరకు సింగిల్‌ లైన్‌గా ఉంది. ప్రకాశం జిల్లా పరిధిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. రాజధాని అమరావతి, శ్రీశైల క్షేత్రానికి వెళ్లే వాహనాలతో పాటు గుంటూరు, చీరాల, ఒంగోల్‌, రాజమండ్రి, కాకినాడ, మార్కాపురం, దోర్నాల, తుని, తణుకు తదితర ప్రాంతాలకు రాకపోకలు జరిపే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  


ఇరువైపులా సుద్దమట్టి 

ప్రకాశం జిల్లా పరిధిలో కేజీ రోడ్డుకు ఇరువైపులా గుంతలు ఏర్పడ్డాయి. అక్కడి అధికారులు వెలిగొండ ప్రాజెక్ట్‌ నుంచి సేకరించిన సుద్దమట్టిని రోడ్డుకు ఇరువైపులా వేసి చదును చేశారు. ఎండాకాలంలో దుమ్ము రేగి వాహనదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. వర్షాకాలం మొదలవ్వగానే సుద్ద మట్టి మెత్తబడి వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుక్కుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. కేజీ రోడ్డుకు ఇరువైపులా సుద్దమట్టి బదులు బిలుకురాళ్లను వేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదని వాహనదారులు అంటున్నారు.


అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రయాణం సంకటంగా మారిందని వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కేజీ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఇరుక్కుపోయి చాలాసార్లు ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. వాహన చోదకులకు తగు సూచనలు ఇస్తున్నారు. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. 


అడ్డగిస్తున్న వాగులు, వంకలు

ఇటీవల కురుస్తున్న వర్షాలతో నల్లమలలో కేజీ రహదారిపై వాగులు, వంకలు అడ్డంకిగా మారాయి. ఆత్మకూరు మండలం సంజీవనగర్‌ తండా-బైర్లూటి మధ్య సిద్దాపురం అలుగు పొర్లి ప్రవహిస్తోంది. దీంతో కేజీ రహదారిపైకి నీరు రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొందరు వాహనదారులు దాటేందుకు యత్నించి మధ్యలోనే నిలిచిపోయి ఇక్కట్లకు గురవుతున్నారు. బస్సులు, లారీలు వంటి పెద్దవాహనాలు మాత్రమే వెళ్తున్నాయి. మరో రెండు చోట్ల కూడా వాగుల వల్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. జిల్లా పరిధిలోని కేజీ రహదారిపై చాలా చోట్ల గుంతలు ఏర్పడటంలో వాహన చోదకులకు ఇక్కట్లు తప్పడం లేదు. 


హైలెవల్‌ బ్రిడ్జిలతో పరిష్కారం

ఈ సమస్యను పరిష్కారించాలంటే వాగులు, వంకల ప్రదేశంలో హైలెవల్‌ బ్రిడ్జిలను నిర్మించాలని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్‌హెచ్‌ 340సీ కేజీరోడ్డు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పరిధిలో ఉండటంతో స్థానికంగా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. 

Advertisement
Advertisement
Advertisement