Oct 20 2021 @ 13:50PM

సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’ ?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, తనయుడు నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బంగార్రాజు’. సూపర్ హిట్ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో బంగార్రాజు అనే పాత్రతో ఘోస్ట్ గా వినోదాన్ని, ఎమోషన్స్ ను పండించారు నాగ్. ఇప్పుడు అదే పాత్రతో సీక్వెల్ తీస్తున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నాగార్జున అనుకుంటున్నారట. ఆ మేరకు డిసెంబర్ నెలాఖరుకల్లా షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారట. 



‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఆ ఏడాది నాగ్ సినిమానే హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు నమోదు చేసింది. అందుకే ఆ సినిమాకి సీక్వెల్ అయిన బంగార్రాజు సినిమాను సైతం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే వచ్చే సంక్రాంతి సీజన్ వరుసగా భారీ చిత్రాలతో నిండిపోయింది. తారక్, చెర్రీల ‘ఆర్.ఆర్.ఆర్’,  పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ చిత్రాలు వరుసగా విడుదల తేదీలు లాక్ చేసుకున్నాయి. మరి ఈ నాలుగు భారీ చిత్రాలతో ‘బంగార్రాజు’  పోటీకి తట్టుకొని నిలబడుతుందా? అలాంటి రిస్క్ నాగ్ చేస్తారా అన్నదే చూడాలి.