యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్న చిత్రానికి 'వరుడు కావలెను' అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఎయిట్ ప్యాక్ బాడీతో చొక్కా విప్పి, విల్లు ఎక్కిపెట్టి వచ్చిన నాగశౌర్య లుక్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నాగశౌర్య 20వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై.. నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి `లక్ష్య` అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ సోమవారం సాయంత్రం 5:04 నిమిషాలకు స్పెషల్ పోస్టర్ని విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో నాగశౌర్య సూపర్ ఫిట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.