Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నదాతల కోసం.. జనసేన

రైతును బిక్షగాడిని మార్చేలా పాలన

పేదల నుంచి ఓటీఎస్‌ వసూళ్లు దారుణం 

జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

తెనాలి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అన్నదాతను బిక్షగాడిని చేసేలా సీఎం జగన్‌ నిర్ణయాలు ఉంటున్నాయని, ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా నిలుస్తుందని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. తెనాలిలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గతంలో అధికారంలోకి వచ్చిన వారు రైతన్న పక్షానే నిలిచారని, ఈ సీఎం మాత్రం అన్ని వర్గాలను దగా చేస్తున్నారన్నారు. నూరు శాతం నష్టపోయిన డెల్టా రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నష్టం అంచనాలపై  నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. నివర్‌ తుఫాన్‌ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ఆరు జిల్లాల్లో పర్యటించి ప్రతి ఎకరాకు రూ.15 వేలు నష్టపరిహారం ఇవ్వాలంటే పట్టించుకోలేదన్నారు. పంట  బీమాలో కూడా లేని షరతులతో రైతులను వంచిస్తున్నారన్నారు. రౌడీలు దౌర్జన్యంగా మామూళ్లు వసూలు చేసే తరహాలో గత ప్రభుత్వాల హయాంలో కట్టిన ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో నగదు కట్టాలని పేదలపై ఒత్తిడి తీసుకు రావడం దారుణమన్నారు. ఈ విషయంలో అధికారులకు  సాయంత్రానికి రూ.4.5 లక్షల వసూలు చేసి తీసుకు రావాలని లక్ష్యాలు పెట్టారన్నారు. ఓటీఎస్‌ నగదు కట్టేందుకు ముందుకురాని వారి పెన్షన్లు, ఇతర పథకాలను నిలిపి వేస్తామని బెదిరింపులకు దిగడం క్షమించరానిదన్నారు. ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల నుంచి వసూళ్లకు దిగడం సరైంది కాదని తెలిపారు.  

మంచి చేస్తాడంటే అప్పుల భారం

తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కంటే మిన్నగా జగన్‌ మంచి చేస్తాడని భావించి ప్రజలు గెలిపిస్తే ఒక్కొక్కరి తలపై వేల కోట్ల అప్పులు భారం మోపారని మనోహర్‌ ఆరోపించారు. గడిచిన రెండున్నరేళ్లలో జగన్‌ పాలన ఏవిధంగా ఉందంటే అందుకు రహదారులే సాక్ష్యాలుగా నిలుస్తాయన్నారు. కొత్తగా రోడ్లు వేయకపోగా చివరకు ఉన్న రోడ్ల మరమ్మతులకు కూడా దిక్కులేని దయనీయస్థితికి తీసుకు రావడంలో పాలనా  రాహిత్యం, మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. డివిజన్‌కు కేవలం రూ.65 లక్షలు మాత్రమే ఇస్తే ఏ విధంగా రోడ్ల రూపురేఖలు మారుస్తారో ముఖ్యమంత్రి, ఆయన పెంచి పోషిస్తున్న సలహాదారులు వివరించాలని డిమాండ్‌ చేశారు. 

5న చెరుకుపల్లిలో బహిరంగ సభ 

తెనాలి డివిజన్‌లో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 5 న చెరుకుపల్లిలో  జన బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు నాదెండ్ల తెలిపారు. సమావేశంలో జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, జిడుగు తులసి, కన్వీనర్‌ రాంబాబు, రవికాంత్‌, షేక్‌ ఇస్మాయిల్‌, గుంటూరు కృష్ణమోహన్‌, పెరికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement