Abn logo
Oct 21 2021 @ 00:00AM

ముస్లిం మహిళ కుంచెలో వెన్నదొంగ!

కళ మతాలకూ, వర్గాలకూ అతీతమని నిరూపిస్తున్నారు జస్నా సలీం.కేరళలోని కొళిక్కోడ్‌కు చెందిన ఆమె వేసిన బాల గోపాలుడి చిత్రాలు అనేక ఆలయాల్లో అలంకృతమై, భక్తులను ఆకర్షిస్తున్నాయి.కానీ ‘ఆలయం లోపల, మూలవిరాట్‌ సమక్షంలో నా చిత్రాన్ని సమర్పించాలన్నది నా కల’ అని చెప్పే జస్నా ఈ మధ్యే ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నారు.


‘‘చిన్నప్పుడు, టీచర్లు మ్యాప్‌ గీయమంటే నా చేతులు వణికిపోయేవి. డ్రాయింగ్‌ క్లాస్‌ అంటే భయం వేసేది. అలాంటి నేను ఇన్ని శ్రీకృష్ణ చిత్రాల్ని రూపొందిస్తున్నానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది యాదృచ్ఛికంగా మొదలైంది’’ అని చెబుతారు జస్నా సలీం. 


అందులో తప్పేముంది?

అయితే... జస్నాకు ఆమె అత్తింటి బంధువర్గం నుంచి గట్టి అభ్యంతరాలే ఎదురయ్యాయి. ‘ఇది ఇస్లాం మత సిద్ధాంతాలకు వ్యతిరేకం, ఈ బొమ్మలు గీయడం ఆపెయ్యాలి’ అని వాళ్ళు ఆమెతో గట్టిగానే చెప్పారు. కానీ, ‘‘నా భర్త, కుటుంబ సభ్యులు మాత్రం మద్దతుగా నిలిచారు. కృష్ణుడి బొమ్మను నేను పెయింట్‌ చెయ్యడాన్ని కళగానే వాళ్ళు పరిగణించారు. నాకు హిందూ స్నేహితులు చాలామంది ఉన్నారు. వారి ఇళ్ళకు నేను వెళ్ళినప్పుడు నమాజ్‌ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. మరి వేరొకరు తమ మతం వారు కొలిచే దైవాన్ని ఒక పెయింటింగ్‌ రూపంలో వేసి ఇస్తే తప్పేముంది?’’ అని ప్రశ్నిస్తున్నారు జస్నా.


అయిదు వందలకు పైనే...

జస్నా భర్త సలీం దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఇంటి బాధ్యతలు పూర్తయ్యాక, ఖాళీ సమయాల్లో ఆమె పెయింటింగ్స్‌ వేస్తారు. ఎప్పుడూ వేసేది ఒకే చిత్రం... వెన్న కుండతో ఉన్న బాల కృష్ణుడే! అయితే జస్నా పెయింటింగ్స్‌కు మంచి ఆదరణ ఉంది. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల నుంచీ, ఆలయాల నుంచీ తమ కోసం ఓ పెయింటింగ్‌ వెయ్యాలన్న విజ్ఞాపనలు వస్తూ ఉంటాయి. ‘‘ఎక్కువగా తమిళనాడు, కర్నాటక నుంచి నన్ను సంప్రతిస్తూ ఉంటారు. నెలకు అయిదు నుంచి ఆరు చిత్రాలు వేస్తా. ఇప్పటివరకూ అయిదు వందలకు పైగా చిత్రాలు గీశాను’’ అంటున్నారామె. శ్రీకృష్ణాష్టమి, విషు పండుగల సందర్భంగా... గత ఆరేళ్ళ నుంచీ గురువాయూరు ఆలయానికి ఆమె పెయింటింగ్స్‌ పంపుతున్నారు.


అనేక ఆలయాల్లో ఆమె గీసిన చిత్రాలు కొలువుతీరాయి. అయితే... ముస్లిం కావడం వల్ల హిందూ ఆలయ ప్రవేశం ఆమెకు కలగలేదు. ఆలయం లోపల... మూలవిరాట్‌ ఎదురుగా తన చిత్రాన్ని సమర్పించాలన్నది ఆమె కల. ఎంతోకాలం నిరీక్షించిన తరువాత... పుణేకి చెందిన ‘తత్త్వమసి’ అనే భక్త బృందం రూపంలో అది నెరవేరే అవకాశం వచ్చింది. పందళంలోని ఉలనాడు శ్రీకృష్ణ స్వామి ఆలయానికి ఒక పెయింటింగ్‌ బహూకరించాలని ఆ బృందం అనుకుంది. జస్నా వేసిన బొమ్మలను సోషల్‌ మీడియాలో చూసి, ఉలనాడు ఆలయ వర్గాల ద్వారా ఆమెను సంప్రతించింది. ఆ ఆలయంలో శ్రీకృష్ణుడు బాలుడి రూపంలో ఉంటాడు. జస్నా వేసే బొమ్మల్లో కృష్ణుడు అలాగే కనిపిస్తాడు. అందుకే ‘తత్త్వమసి’ నుంచి ప్రతిపాదన రాగానే... ఆలయ వర్గాలు సరేనన్నాయి. ఆ ఆలయ చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, ఆకర్షణీయమైన చిన్ని కృష్ణుడి బొమ్మ గీసి ఇచ్చారు జస్నా. ఇతర మతస్తులు ఆ ఆలయంలో ప్రవేశించడానికి అభ్యంతరాలేవీ లేకపోవడంతో... స్వామివారి ఎదుటే తన చిత్రాన్ని సమర్పించే అవకాశాన్ని ఆమెకు ఆలయ అధికారులు కల్పించారు. ఆమెను ఘనంగా సత్కరించారు.


‘‘ఎట్టకేలకు నా కల నిజమైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆలయ వర్గాలకు నా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మాటలు రావడం లేదు అని చెబుతున్న జస్నాకు మరో కోరిక కూడా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకొని... బాల కృష్ణుడి పెయిటింగ్‌ బహూకరించడం. అది నెరవేరే రోజు ఎంతో దూరం లేకపోవచ్చు.

‘కన్నా’ అని పిలిచేవాళ్ళు...

ఇరవై ఎనిమిదేళ్ళ జస్నా స్వస్థలం కేరళలోని కొళిక్కోడ్‌. కొన్నేళ్ళ కిందట, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. దాంతో కొన్నాళ్ళు మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది. కాలక్షేపం లేకపోవడంతో విసుగ్గా ఉండేది. అలాంటి సమయంలో... ఒక న్యూస్‌ పేపర్‌లో... వెన్న కుండ ముందు పెట్టుకొని కూర్చున్న చిన్ని కృష్ణుడి పెయింటింగ్‌ ఆమె కంటపడింది. ‘‘మేం ముగ్గురు అక్కచెల్లెళ్ళం. నేనే ఆఖరుదాన్ని. నన్ను మా తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు ‘కన్నా’ అని పిలిచేవాళ్ళు. అంటే ‘కృష్ణుడు’ అని కదా అర్థం. అందుకేనేమో... పేపర్లో ఆ బొమ్మ చూడగానే అలాంటిది గీయాలన్న ఆసక్తితో కుంచెనూ, రంగుల్నీ అందుకున్నాను. నేను కోరుకున్నట్టు వచ్చేదాకా ఆ చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతూనే ఉన్నాను. ఆ తరువాత దాన్ని ఏం చెయ్యాలో తెలియలేదు. మా సంప్రదాయంలో అలాంటి చిత్రాలను ఇళ్ళలో పెట్టుకోం. కాబట్టి మా పొరుగున ఉన్న హిందూ కుటుంబానికి దాన్ని బహుమతిగా ఇచ్చేశాను. వాళ్ళు దాన్ని పూజా మందిరంలో పెట్టుకున్నారు’’ అని గుర్తు చేసుకున్నారు జస్నా. ఆ చిత్రం తమ ఇంట్లోకి వచ్చాక... కోరుకున్నవన్నీ జరుగుతున్నాయని పొరుగువారు చెప్పడం జస్నాకు సంతోషం కలిగించింది. పొరుగింట్లో ఆ బాల కృష్ణుడి చిత్రాన్ని చూసినవారు తమ కోసం ఒక పెయింటింగ్‌ వెయ్యాలంటూ అడగడం మొదలెట్టారు. ఆమె సరదాగా వేస్తూ వచ్చారు.