Abn logo
Oct 23 2020 @ 05:12AM

దీక్షిత్‌ విషాదాంతం

Kaakateeya

కిడ్నాపైన రెండు గంటల వ్యవధిలోనే హత్య

పోలీసుల అదుపులో  ప్రధాన నిందితుడు సాగర్‌

సహకరించిన వారి కోసం  కొనసాగుతున్న విచారణ

సెల్‌ఫోన్‌ తెలివితో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన నిందితుడు

పక్కా స్కెచ్‌తో కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు

శనిగపురంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు


మహబూబాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌లో నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపిన తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్‌ వ్యవహారం చివరకు ఊహించని రీతిలో విషాదాంతమైంది. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన దీక్షిత్‌రెడ్డి తుదకు విగతజీవిగా కనిపించడంతో అందరూ దిగ్ర్భాంతికి గురయ్యారు. మహబూబాబాద్‌లో ఓ టీవీ చానల్‌లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న కుసుమ రంజిత్‌రెడ్డి-వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ప్రైవేట్‌ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. రంజిత్‌ స్వగ్రామమైన శనిగపురంలో సమీపాన ఇంట్లో ఉండే మంద సాగర్‌ అనే యువకుడితో రంజిత్‌ కుటుంబానికి మంచి పరిచయం ఉంది. మహబూబాబాద్‌ మూడుకొట్ల సెంటర్‌లో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న సాగర్‌ ఈజీ లైఫ్‌కు ఆలవాటు పడి కష్టపడకుండా అనతికాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు చేస్తుండేవాడు. కొన్ని సినిమాల ప్రభావం కూడా అతడిపై పడింది. ఈ క్రమంలో ఈనెల 18న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో నివసిస్తున్న జర్నలిస్టు రంజిత్‌ ఇంటికి వెళ్లాడు. పాత పరిచయంతో రోడ్డుపై ఆడుకుంటున్న దీక్షిత్‌రెడ్డిని పలకరించి సన్నిహితంగా తన బైక్‌పై వెనుక ఎక్కించుకుని అక్కడి రోడ్డులో సీసీ కెమెరాలకు చిక్కకుండా తాళ్లపూసపల్లి రోడ్డు వైపు వెళ్లిపోయాడు. కేసముద్రం మండలం అన్నారం శివారు స్టోన్‌ క్రషర్‌ సమీపాన గుట్టల్లో పొదల్లోకి తీసుకెళ్లాడు.


రెండు గంటల్లోనే...

కృష్ణ కాలనీ నుంచి సాయంత్రం 6 గంటలకు బలుడిని తీసుకువెళ్లిన కిడ్నాపర్‌ తాళ్లపూసపల్లి రోడ్డులోని గుట్టల పొదల్లో అతడిని ఎక్కువ సేపు ఉంచుకోలేకపోయాడు. అంతేకాకుండా బాలుడిని విడిచిపెడితే తనను ఎలాగైనా గుర్తుపడతాడని భావించిన సాగర్‌.. అక్కడ్నుంచి వెళ్లిపోయేందుకు యత్నించిన దీక్షిత్‌రెడ్డి చేతులు కట్టేసి నోట్లో బలవంతంగా నిద్రమాత్ర వేసి ఆపై గొంతు పిసికి హత్యచేశాడు. ఇదంతా కిడ్నాప్‌ చేసిన రెండు గంటల్లోపే జరిగిపోయింది. అనంతరం తన వద్ద ఉన్న పెట్రోల్‌ను బాలుడి మృతదేహంపై పోసి తగులబెట్టి ఏమీ తెలియనట్లు తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆపై బాలుడి తల్లిదండ్రుల నుంచి రూ.45 లక్షలు రాబట్టేందుకు అనేకమార్లు ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్‌ చేశాడు.


ఇంటర్నెట్‌ కాల్స్‌..

దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసి చంపేసిన దుండగుడు అదే రోజు ఆదివారం రాత్రి రాత్రి 9.15 గంటలకు దీక్షిత్‌రెడ్డి తల్లి వసంతకు ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా ఫోన్‌ చేసి ‘మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేశాం... రూ.45లక్షలు ఇస్తే వదిలిపెడతాం’ అని చెప్పి ఫోన్‌ కాల్‌ కట్‌ చేశాడు. వెంటనే దీక్షిత్‌రెడ్డి తల్లిదండ్రులు మహబూబాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి టౌన్‌ స్టేషన్‌కు చేరుకుని కిడ్నా్‌పకు గురైన బాలుడి తల్లిదండ్రులను విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాత్రికి రాత్రే సుమారు వందమంది పోలీసులను రంగంలో దింపి ఎనిమిది బృందాలుగా విభజించి కిడ్నాపర్‌ కోసం గాలింపు చేపట్టారు. ఇది కొనసాగుతుండగానే సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా డబ్బు డిమాండ్‌తో కిడ్నాపర్‌ బాలుడి తల్లికి ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు. సదరు ఫోన్‌ కాల్‌ ఇంటర్నెట్‌ ద్వారా వస్తుండడంతో కాల్‌ ఎక్కడి నుంచి చేస్తున్నారో గుర్తించడం పోలీసులకు సాధ్యంకాలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కిడ్నాపర్‌ అడిగిన డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. బుధవారం రూ.35లక్షల నగదు, 15 తులాల బంగారం సిద్ధం చేసి ఈ వ్యవహారం మొత్తం వీడియోలో రికార్డు చేసి సోషల్‌మీడియా గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేశారు. అనంతరం పట్టణంలోని మూడుకొట్ల సెంటర్‌లో మధ్యాహ్నం నగదు, బంగారాన్ని బైక్‌లో పెట్టి కిడ్నాపర్‌ కోసం వేచి చూశారు. సాయంత్రం వరకు అతడి జాడ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. 


ఇలా చిక్కాడు..

బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు మూడుకొట్ల సెంటర్‌లో డబ్బులు, బంగారం ఉంచిన బైక్‌పై పోలీసుల నిఘా పెట్టడాన్ని కనిపెడుతూ వచ్చిన ఆగంతకుడు.. చివరికి మరోమారు ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా బాలుడి తండ్రిని ఆ డబ్బు తీసుకుని తాళ్లపూసపల్లి రోడ్డులోని స్టోన్‌ క్రషర్‌ సమీపానికి రమ్మని ఆదేశించారు. తాను బాలుడిని హత్యచేసి తగులబెట్టిన ప్రాంతానికే రప్పించి అనూహ్యంగా పోలీసులు వేసిన పక్కా స్కెచ్‌లో చిక్కాడు. ఈ ప్రాంతంలో మాటువేసి ఉన్న పోలీసులు కిడ్నాపర్‌ మంద సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్‌ చేసి చంపినట్లు సాగర్‌ ఒప్పుకున్నాడని, ఈజీ మనీకి అలవాటుపడి జల్సాల కోసం కిడ్నాప్‌ ద్వారా భారీ మొత్తంలో సంపాదించాలన్న అత్యాశ అతడిని కిడ్నాపర్‌గా మార్చిందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 


అశ్రునయనాల మధ్య...

కిడ్నా్‌పకు గురై హత్య గావించబడిన దీక్షిత్‌రెడ్డి అంత్యక్రియలు గురువారం జిల్లా కేంద్రం శివారు శనిగపురంలో నిర్వహించారు. మహబూబాబాద్‌-తాళ్లపూసపల్లి రోడ్డులోని దానమయ్య గుట్టలవద్ద కిడ్నాపర్‌ చిన్నారి బాలుడిని హత్య చేశాడు.  పోలీసులు  బాలుడి మృతదేహానికి శవపంచనామ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం తన స్వగ్రామం శనిగపురానికి తరలించి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి మృతి వార్త తెలుసుకున్న శనిగపురం గ్రామస్థులు కంటతడిపెట్టారు.  శనిగపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


ఒక్కడేనా..! ఇంకెవరైనా... ఉన్నారా..?

దీక్షిత్‌రెడ్డి హత్యలో మంద సాగర్‌ ఒక్కడే పాల్గొన్నాడా...? లేక అతడికి ఇంకెవరైనా సహకరించారా...? అన్న కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 మందిని విచారించిన పోలీసులు.. ఇందులో కిడ్నాపర్‌కు సన్నిహితులుగా మెలిగిన నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కిడ్నాప్‌ వ్యవహారం, హత్యలో ఎవరెవరి పాత్ర ఉంది? తదితర అంశాలపై విచారణ పూర్తి చేశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. కిడ్నాపర్‌ను గుర్తించేందుకు హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌క్రైం బృందాలు శ్రమించాయని తెలిపారు. కేసు పరిశోధన పూర్తయ్యే వరకు వీరంతా విచారణ కొనసాగిస్తారని ఆయన వెల్లడించారు.


మంత్రుల దిగ్ర్భాంతి...

మహబూబాబాద్‌:  దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌, హత్య ఘటనపై రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌లు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాల బాధకరమని అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి ఫోన్‌ చేసి పూర్వపరాలను తెలుసుకున్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. మరోపక్క మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు బాలుడి కిడ్నాప్‌, హత్య బాధకరమని విచారం వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌ శాసనసభ్యుడు బానోత్‌ శంకర్‌నాయక్‌ బాలుడు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని సందర్శించారు. రంజిత్‌ను పరామర్శించి ఓదార్చారు.  కృష్ణకాలనీలో డోర్నకల్‌ శాసనసభ్యుడు డీఎ్‌స.రెడ్యానాయక్‌ జర్నలిస్టు రంజిత్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.


ఎన్‌కౌంటర్‌ వదంతులు

మహబూబాబాద్‌ క్రైం : దీక్షత్‌రెడ్డి హత్య వెలుగుచూసిన తర్వాత కిడ్నాపర్లు ఎన్‌కౌంటర్‌ అయ్యారంటూ జోరుగా ప్రచారం సాగింది.  దీక్షిత్‌రెడ్డి హత్యకు గురైన తాళ్లపూసపల్లి మార్గంలోని దానమయ్యగుట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో దుండగులను అక్కడే ఎన్‌కౌంటర్‌ చేశారంటూ ప్రచారం జరిగింది.   సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం  నిందితులను తీసుకువెళ్లిన పోలీసులు అక్కడే ఎన్‌కౌంటర్‌ చేశారంటూ సోషల్‌మీడియా ఊదరగొట్టింది. గురువారం  మధ్యాహ్నం వరకు  పోలీసులు ఎవరినీ ఆ గుట్టల్లోకి అనుమతించలేదు. చివరికి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌లు బాలుడి మృతదేహం వద్దకు వెళ్లిన క్రమంలో మీడియాకు అనుమతి ఇచ్చారు.  


కొరకరాని కొయ్య ఇంటర్నెట్‌ కాల్‌

మహబూబాబాద్‌ : దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌, హత్య మిస్టరీని సకాలంలో ఛేదించకపోవడానికి ఇంటర్నెట్‌ కాల్సే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సెల్‌ఫోన్‌ నుంచి జనరల్‌ కాల్‌, వాట్సాప్‌ కాల్‌, వీడియోకాల్‌ చేయడం ద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వారిని టవర్‌ సిగ్నల్స్‌ను బట్టి గుర్తుపడతారు.  అదే ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా ఫోన్‌ చేస్తే సిగ్నల్‌ ఎక్కడ నుంచి వస్తుందో గుర్తుపట్టడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌ కాల్‌పై అవగాహన పెంచుకున్న కిడ్నాపర్‌ మంద సాగర్‌...  ఒక యాప్‌ను తన సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని దాని ద్వారా కాల్స్‌ చేసినట్టు భావిస్తున్నారు. తన ఆచూకీ ఎవరికీ తెలియదన్న భరోసాతో సాగర్‌ నాలుగు రోజులుగా పోలీసుల మధ్యే తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 


గత ఆదివారం నుంచి పోలీసులు ఎంత ప్రయత్నించినా ఇంటర్నెట్‌ కాల్‌ డేటా చిక్కలేదు. ఫలితంగా కిడ్నాపర్‌ ఆచూకీ కనుగొనడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.  ఇంటర్నెట్‌ కాల్స్‌ను గుర్తించే సాంకేతికత ఉంటే అదే రోజు సాగర్‌ గుట్టు బయటపడేదని భావిస్తున్నా రు. దీక్షిత్‌రెడ్డి కేసులో  ఇంటర్నెట్‌ కాల్‌ను ఛేదించకుండానే టాస్క్‌ఫోర్స్‌ పన్నిన వ్యూహం ద్వారా డబ్బు ఎర చూపి కిడ్నాపర్‌ను గుర్తించినట్లుగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement