Abn logo
Sep 27 2020 @ 07:01AM

వాడివేడిగా మున్సిపల్‌ సమావేశం

అధికారులను నిలదీసిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌

మంచిర్యాల, సెప్టెంబరు 26: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన మున్సిపల్‌ సాధారణ సమావేశం వాడివేడిగా కొనసాగింది. వివిధ సమస్యలపై అధికారులను కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నిలదీశారు. సమావేశం సందర్భంగా వివిధ పనుల కోసం 38 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టగా ఎట్టకేలకు అవి ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఉప్పలయ్య, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లు వేములపల్లి సంజీవ్‌, అబ్దుల్‌ మజీద్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ రామగిరి బానేష్‌ మాట్లాడారు. పారిశుధ్య కార్మికులపై పని ఒత్తిడి పెంచుతున్నారని చెప్పారు.  కనీసం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని నిలదీశారు. మున్సిపాలిటికి చెందిన పర్మినెంట్‌ పారిశుద్య విభాగపు జవాను బరిగల లచ్చయ్య కరోనాతో చనిపోగా పాలక వర్గం స్పందించకపోవడంపై నిలదీశారు. కనీసం సెలవు కూడా ఇవ్వకుండా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్లాతో రాత్రి 9 గంటల వరకు సమావేశాలు నిర్వహించడం వల్ల తెల్లవారుజామున నిద్రలేచి, విధులకు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ఎలాంటి వారసత్వం లేకుండా అక్రమంగా నియమితులైన కార్మికులను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. వివిధ వార్డుల్లో అభివృద్ది పనులు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయని, పాత పనులు చేపట్టని కాంట్రాక్టర్లను ఎందుకు బ్లాక్‌ లిస్టులో పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ నిధులను అభివృద్ది పనులకు రూ. 2 కోట్లపై చిలుకు కేటాయించగా జిల్లా అదనపు కలెక్టర్‌ ఆమోదం తెలిపారని చెప్పారు. అదే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫండ్‌ కేటాయించిన పనులను  ఎందుకు తిరస్కరించారని నిలదీశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు కేటాయించిన పనులు ప్రణాళిక బద్దంగా లేవనే ఉద్దేశంతోనే అదనపు కలెక్టర్‌ తిరస్కరించారని గుర్తు చేశారు. అలా అవసరం లేని చోట పనులు ఎందకు పెడుతున్నారని నిలదీశారు.

అలాగే మున్సిపాలిటీ పరిధిలో మూడు వేల మంది వీది ప్యారులను గుర్తించారని, వారి కోసం 25 సెంటర్లు ఏర్పాటు చేస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. అధికారుల వైఖరి వల్ల దళారుల వ్యవస్థ పురుడుపోసుకొనే ప్రమాదం ఉందని అన్నారు. కాగా కమిషనర్‌ స్వరూపారాణి అత్యవసర సమయాల్లో ఫోన్లు లేపడం లేదని, పాలక వర్గ సభ్యులు కార్యాలయానికి వస్తే కనీసం మర్యాద ఇవ్వడం లేదని అధికార పార్టీ కౌన్సిలర్‌ మినాజ్‌ అన్నారు. స్పందించిన కమిషనర్‌ తాను అందరితో మర్యాద పూర్వకంగా ఉంటున్నానని, ఫోన్లు సైతం ఎత్తుతున్నానని సమాధానం ఇచ్చారు. వాటర్‌ పైపులైన్‌ ఏర్పాటుకు సీసీ రోడ్లు కట్‌ చేస్తున్నారని, తిరిగి వాటికి మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. పైపులైన్‌  వేసిన వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ విషయమై ముఖ్య అతిఽథిగా హాజరైన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను అదేశించారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌  గాజుల ముకేష్‌గౌడ్‌తోపాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు, మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు, ఎంఈ సుమతి, ఏఈ నర్సింహాస్వామి, టీపీఓ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


పారిశుధ్య కార్మికులకు సన్నానం..

కరోనా కారణంగా మరణించిన ప్రజలకు అంత్యక్రియలు చేసిన పారిశుధ్య కార్మికులు చిప్పకుర్తి మహేంధర్‌, కొత్తూరి సత్తయ్య, చిప్పకుర్తి రాకేష్‌, చిప్పకుర్తి భీమయ్యలను ఎమ్మెల్యే, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, ఇతరులు ఘనంగా సన్మానించారు. అలాగే ఉత్తమ సేవలు అందించినందుకుగాను ప్రతి నెల చేపట్టే సన్మానంలో భాగంగా కాశిపాక గట్టయ్య, పూరిటి జమునలను శాలువాలతో సత్కరించారు. 

Advertisement
Advertisement
Advertisement