Abn logo
Jan 20 2021 @ 17:23PM

'బార్క్' మాజీ సీఈవోకు బెయిలు నిరాకరణ

ముంబై: బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా బెయిల్ దరఖాస్తును సెషన్స్ కోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్ (టీఆర్‌పీ) కుంభకోణంలో నిందితుడైన దాస్ గుప్తా టీఆర్‌పీ రిగ్గింగ్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం అనారోగ్యంతో ముంబైలోని జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్యుడిషయల్ కస్టడీలో ఉన్న ఆయనకు గత శనివారం బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగడంతో తలోజా కేంద్ర కారాగారం నుంచి జేజే ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చారు.

టీఆర్‌పీ రిగ్గింగ్ కేసులో గత డిసెంబర్ 24న ఆయనను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లిక్ టీవీతో సహా పలు ఛానెల్స్‌కు అనుకూలంగా టిఆర్‌పీ రిగ్గింగ్‌లో ఆయన కీలక పాత్ర పోషించినట్టు కనిపిస్తోందని ముంబై కోర్టు ఈ నెల ప్రారంభంలో అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని ఛానెల్స్‌కి రేటింగ్స్ పెంచడం కోసం పలు ఛానెళ్ల రేటింగ్స్ తగ్గిస్తూ టీఆర్పీ రేటింగుల ట్యాంపరింగ్‌కి పార్పడినట్లు పార్థో దాస్‌ గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబర్ 31 వరకూ పోలీస్ కస్టడీలో ఉన్న దాస్‌గుప్తా ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement