Abn logo
May 21 2020 @ 12:10PM

యూఏఈ 'కోవిడ్‌-19' మిష‌న్ కోసం.. 4 నెల‌ల కుమారుడ్ని స్వ‌దేశంలోనే వ‌దిలి వెళ్లిన భార‌త న‌ర్సు

యూఏఈ: కరోనాపై పోరులో భాగంగా యూఏఈకి సాయం చేసేందుకు 105 మంది స‌భ్యుల‌తో కూడిన‌ భార‌త వైద్య బృందం బుధవారం ఉద‌యం అబుధాబి చేరుకున్న విష‌యం తెలిసిందే. యూఏఈకి చెందిన వీపీఎస్ హెల్త్‌కేర్ సంస్థ ఈ వైద్య బృందాన్ని ఎతిహాద్ ప్ర‌త్యేక విమానంలో అబుధాబి తీసుకెళ్లింది. దేశ‌వ్యాప్తంగా వివిధ ఆస్ప‌త్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్న క‌రోనా బాధితుల‌కు ఈ వైద్య బృందం చికిత్స అందించ‌నుంది. కాగా, ఈ వైద్య బృందంలో కేర‌ళ‌కు చెందిన‌ రీను అగస్టిన్ అనే న‌ర్సు కూడా ఉన్నారు. యూఏఈ కోవిడ్‌-19 మిష‌న్ కోసం ఆమె త‌న నాలుగు నెల‌ల బాబును ఇండియాలోనే వ‌దిలి వెళ్లారు.


"నా బిడ్డను నా భర్త, తల్లిదండ్రులతో విడిచిపెట్టడం నా హృదయాన్ని క‌లిచి వేసింది. ఎందుకంటే అతను చాలా చిన్నవాడు. కాని ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభం వేళ‌, ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం ఎంతో ముఖ్యం. అందుకే మానవత్వంతో ఆలోచించి నేను నా ఆనందాన్ని త్యాగం చేస్తున్నాను" అని రీను అన్నారు. ఆమెకు నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. మాన‌వ‌త దృక్ప‌థంతో త‌న వృత్తిధ‌ర్మంలో భాగంగా ఇలా ఇద్ద‌రు చిన్నారుల‌ను రీను అగస్టిన్ స్వ‌దేశంలోనే వ‌దిలి యూఏఈకి వెళ్ల‌డం అభినంద‌నీయం.  


కాగా, వారం రోజుల క్రితం 88 మందితో కూడిన వైద్య బృందాన్ని భార‌త్‌... యూఏఈ పంపించిన సంగ‌తి తెలిసిందే. యూఏఈలోని క‌రోనా బాధితుల‌కు మ‌న ఈ రెండు వైద్య బృందాలు చికిత్స అందించ‌నున్నాయి. అయితే, ఇలాంటి కార్యక్రమాలు దీర్ఘకాలిక, బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు దోహ‌దం చేస్తాయ‌ని యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ అన్నారు. ఇదిలాఉంటే... యూఏఈలో విజృంభిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌తిరోజు వంద‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 26వేల‌కు పైగా మంది ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు. 233 మంది మృతిచెందారు.        

Advertisement
Advertisement
Advertisement