Abn logo
Aug 6 2020 @ 23:38PM

థియేటర్లలోకి కాదు... నెట్టింట్లోకి ‘ములాన్‌’

కరోనా ప్రభావం కారణంగా థియేటర్లు మూత పడటంతో ఇప్పటికి పలుమార్లు వాయిదా పడిన ‘ములాన్‌’ని వచ్చే నెలలో నెట్టింట విడుదల చేయాలని డిస్నీ పిక్చర్స్‌ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా సహా కెనడా, న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా, మరికొన్ని యూరప్‌ దేశాలలో ఓటీటీలో సెప్టెంబర్‌ 4 నుంచి ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు డిస్నీ ప్లస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. వీడియో ఆన్‌ డిమాండ్‌ పద్దతిలో విడుదల చేస్తున్నారు. డిస్నీ ప్లస్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఉన్న వినియోగదారులైనా సరే సినిమా చూడాలంటే టికెట్‌ కొనాల్సిందే. టికెట్‌ ధరను 29.99 డాలర్లుగా నిర్ణయించారు. ఏయే దేశాలలో ఓటీటీలో అందుబాటులో ఉండదో, అక్కడ థియేటర్లలో విడుదల చేయనున్నారు. నిజానికి, ఈ ఏడాది మార్చి 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా వాయిదా పడింది. తర్వాత మరో మూడుసార్లు విడుదల తేదీ ప్రకటించి వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఏకంగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement