May 9 2021 @ 17:30PM

‘డర్టీ హరి’ని మించేలా.. ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’

‘డర్టీ హరి’ చిత్రంతో దర్శకుడిగా మరోసారి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు.. ఆ చిత్రంతో మంచి విజయాన్నే అందుకున్నారు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన దర్శకుడిగానూ.. తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మే 10 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన డైరెక్ట్ చేయబోతున్న తదుపరి చిత్రాన్ని ఆదివారం (మే 9) ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘7 డేస్ 6 నైట్స్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించనున్న ఈ చిత్రాన్ని సుమంత్ అశ్విన్, రజనీకాంత్. ఎస్ నిర్మించనున్నారు.


ఈ సందర్భంగా ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్న హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన.. నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ ‘7 డేస్ 6 నైట్స్’ సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుడుతున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. కొంత హైదరాబాద్.. మరికొంత గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. ‘డర్టీ హరి’తో తన సత్తా చూపించిన నాన్నగారు, మరో విభిన్నమైన జానర్‌లో ఈ సినిమా చేయనున్నారు’’ అని తెలిపారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ‘‘యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. సంగీతం, ఇతర సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తాం. గత ఏడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసలు మరువలేనివి. చాలామంది పెద్దవాళ్ళు నేను గొప్పగా తీశానని మెచ్చుకున్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ‘డర్టీ హరి’కి నాకు అండగా నిలబడి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నిర్మాత గూడూరు శివరామకృష్ణగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రానికి కూడా ఆయన వెన్నంటే ఉంటారు. ‘డర్టీ హరి’ని మించి ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు.