Abn logo
Aug 7 2020 @ 03:41AM

వేటకుక్కలై వెంటాడతారు..జాగ్రత్త!

  • సీఎం జగన్‌కు రఘురామ హెచ్చరిక
  • రాజధాని మహిళలను కుక్కలంటారా?
  • ఆ పోస్టులపై వెంటనే చర్య తీసుకోవాలి
  • త్వరలో అమరావతిలో మనోధైర్యయాత్ర

న్యూఢిల్లీ, ఆగస్టు6 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి గారూ...అమరావతి రైతులకు దగాచేసి, వారిని అనేక విధాలుగా అవమానంపాలు చేస్తే...అక్కడ మహిళా రైతులంతా వేట కుక్కలై మిమ్మల్ని వేటాడే పరిస్థితి దగ్గరపడింది’’ అని వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. అమరావతి రాజధానికోసం భూములిచ్చిన రైతులు, మహిళా రైతులను కుక్కలతో పోల్చుతూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అలా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో రోడ్డున పడిన రైతులకు మనోధైర్యం కల్పించేందుకు తాను త్వరలోనే మనోధైర్యయాత్ర చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. పునర్విభజన చట్టం ప్రకారం ధర్మబద్ధమైన రైతుల పోరాటానికి కచ్చితంగా విజయం లభిస్తుందని రఘురామ ఆశాభావం వ్యక్తంచేశారు.


అయోధ్యలో ప్రధాని పాల్గొన్న రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన ఎస్వీబీసీ చానల్‌లో ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయలేదని రఘురామ ప్రశ్నించారు. కరోనా పరీక్షలు చేయడంవల్లే కేసులు ఎక్కువగా ఉన్నాయన్న మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు సరికాదన్నారు. పరీక్షల సంఖ్య పెరిగితే పాజిటివ్‌ మాత్రమే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు గుడి కడతానన్న గోపాలపురం ఎమ్మెల్యే తలారు వెంకట్రావు వైఖరిపై రఘురామ మండిపడ్డారు. ఆయనకు జగన్‌పై అంత భక్తి ఉంటే మరో విధంగా చాటుకోవాలేతప్ప, గుడులు కడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని హితవు పలికారు. కావాలంటే చర్చిని కట్టుకోవచ్చునని సలహా ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement