Abn logo
Sep 15 2021 @ 00:12AM

జెండాపై మొండికేసిన మౌంట్‌ బాటెన్‌

చరిత్ర అంటే ఒక వాస్తవాల జాబితా అనే అభిప్రాయం బలీయంగా ఉంది. అదే నిజమైతే, గతించిన కాలంలోని ఒక టెలీఫోన్ డైరెక్టరీకి చరిత్ర భిన్నం కాబోదు. పొంతన లేని భిన్న వాస్తవాలను ఎంపిక చేసుకుని వాటి మధ్య కార్యకారణ సంబంధాన్ని నెలకొల్పడం ద్వారా చరిత్రకారుడు చరిత్రను రచిస్తాడు. మానవుడు స్వతస్సిద్ధంగా హేతువాది అనే సునిశ్చిత విశ్వాసంతో చరిత్రకారుడు తన కృషిని కొనసాగిస్తాడు. అర్థవంతంకాని, వివేకానికి దోహదం చేయని అంశాలను అతడు తిరస్కరిస్తాడు. ‘అమంగళకరమైన’ రోజుల కారణంగా స్వాతంత్ర్యాన్ని అర్ధరాత్రి ప్రసాదించారని, చాలా చతురంగా అర్ధరాత్రి ముహూర్తాన్ని నిర్ణయించారని విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య తమ ‘స్వాతంత్ర్యం అర్ధరాత్రే ఎందుకు వచ్చింది?’ అన్న వ్యాసం (సెప్టెంబర్ 4, ‘ఆంధ్రజ్యోతి’)లో వివరించారు. ఇంతకంటే అసంగతమైన ప్రతిపాదన మరొకటి ఉండబోదు. 


మౌంట్‌బాటెన్ గర్విష్ఠి, పాలితులను లెక్కపెట్టని రాచరిక, సామ్రాజ్యవాద అహంకారి. చౌకబారు ప్రవృత్తికి కూడా అతడు ప్రసిద్ధుడు. అధికార బదిలీ సందర్భంలో యూనియన్ జాక్‌ను అవనతం చేసి, భారత జాతీయ పతాకను ఆవిష్కరించేందుకు ససేమిరా అన్నాడు. స్వతంత్ర భారత పతాకావిష్కరణ తన విధ్యుక్త ధర్మమయినప్పటికీ అతడు మొండికేశాడు. భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం భారత్, పాకిస్థాన్ రెండు దేశాలకూ అధికార మార్పిడికి నియమిత దినం 1947 ఆగస్టు 14. ఆగస్టు 15 కానేకాదు. ఈ కారణంగానే పాకిస్థాన్‌లో అధికార బదలాయింపు 1947 ఆగస్టు 14నే జరిగింది. కరాచీలో పాకిస్థాన్ జాతీయ పతాకను ఆవిష్కరించింది జిన్నా సాహెబ్. పతాకావిష్కరణ అనంతరం సర్క్యూట్ హౌస్‌లో అధికార బదిలీ దస్తావేజుపై మౌంట్‌బాటెన్ సంతకం చేశాడు. 


జాతీయపతాక నియమావళి ప్రకారం జెండాలను ప్రభాత భేరీ అనంతరం మాత్రమే ఆవిష్కరించాలి. అలాగే వాటిని సూర్యాస్తమయం సమయంలో మాత్రమే అవనతం చేయాలి. జెండాలను రాత్రిపూట ఆవిష్కరించడంగానీ, అవనతం చేయడం గానీ నియమ విరుద్ధం. ఈ కారణంగా భారతీయ త్రివర్ణ పతాకను అర్ధరాత్రి ఆవిష్కరించేందుకు ఆస్కారం లేకపోయింది. యూనియన్ జాక్‌ను అవనతం చేయడమనే అవమానకరమైన అనుభవాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే భారత స్వాతంత్ర్య ఆగమనాన్ని అర్ధరాత్రి ప్రకటించడం జరిగింది. అంతేగాక అలా చేయడం వల్ల అది భారత్‌కు ‘విధితో ముఖాముఖీ’ అవుతుందని ఘనంగా చెప్పారు. ఇదొక రాజకీయ లౌక్యం. అందరికీ అనుకూలించిన లౌక్యమది. హాంకాంగ్‌ను చైనాకు బదిలీ చేయడంలో కూడా బ్రిటన్ అదే పద్ధతిని పాటించింది మరి.


బహుశా, చాలామందికి తెలియని ఒక వాస్తవాన్ని ఇక్కడ చెప్పి తీరాలి. స్వతంత్ర భారతదేశ ప్రప్రథమ గవర్నర్ -జనరల్‌గా ఉన్న మౌంట్‌బాటెన్ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఎక్కడా భారత త్రివర్ణ పతాకను ఆవిష్కరించలేదు. 1947 ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోటపై జవహర్ లాల్ నెహ్రూ మన మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎర్రకోటే ఎందుకు? బ్రిటిష్ వలసపాలనకు పూర్వం సర్వోన్నత అధికారానికి అది నెలవు. ప్రతిష్ఠాత్మక ప్రతీక. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటపై జాతీయ పతాకను ఆవిష్కరించడమనే (నెహ్రూ నెలకొల్పిన) సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. 


అర్ధరాత్రి స్వాతంత్ర్య ముహూర్తాన్ని నిర్ణయించడంలోని రాజకీయ లౌక్యం ఆనాటి వార్తాపత్రికలతో సహా ఎవరి దృష్టికీ రాలేదు. అయితే ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ పుస్తక రచయితలు ఆ రాజకీయ లౌక్యం నుంచి దృష్టిని మరల్చే ప్రయత్నంలో భాగంగా ‘అమంగళకర దినం’ అనే ఒక అసత్యాన్ని కల్పించారు. ఇది అర్ధరాత్రి ముహూర్తానికి ఆకర్షణీయమైన మెరుగులద్దింది. అయితే సంప్రదాయ భారతీయ పంచాంగంపై అవ గాహన ఉన్నవారికి ఆ అబద్ధం ఎంతైనా వినోదం కలిగించింది. వారిని బాగా ఉల్లాసపరిచింది. కృష్ణపక్షం (చంద్రకళల క్షీణ దశ)లో చతుర్దశి తరువాత అమావాస్య వస్తుంది. 1947 ఆగస్టు 14 చతుర్దశి. మరుసటిరోజు అంటే ఆగస్టు 15 అమావాస్య. ఈ రెండూ పూర్తిగా అమంగళకర దినాలు అని మన సంప్రదాయం ఘోషిస్తుంది. లోకులు ఆ ఆచారాన్ని విశ్వసిస్తున్నారు, పాటిస్తున్నారు. 


ఈ కారణంగా, ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ పుస్తక రచయితలు ప్రచారంలో పెట్టిన ‘అమంగళకర దినం’ అనేది ఒక కల్పిత కథ. అది విశ్వసింపదగింది కాదు. ఏ విధంగా చూసినా అది ఒక తెలివైన సంజాయిషీ. వలస ప్రభుత్వాధినేత స్వతంత్ర భారత జాతీయపతాకను ఆవిష్కరించేందుకు ఇష్టపడలేదు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకే ‘అమంగళకర దినం’ అనే సాకుతో భారత స్వాతంత్ర్యానికి అర్ధరాత్రి ముహూర్తం నిర్ణయించారు. కర్తవ్యపాలన నుంచి తప్పించుకునేందుకు చెప్పిన కారణాలలోని అహేతుకతను చరిత్ర దాచిపెడుతుందా?

కెప్టెన్ (డాక్టర్) ఎల్. పాండురంగా రెడ్డి

తడకమళ్ల వివేక్

తెలంగాణ చరిత్ర పరిశోధనా మండలి