Abn logo
Apr 22 2021 @ 05:05AM

పని ఎక్కువ.. జీతం తక్కువ

  • రెండు గంటలు చెపితే చాలన్నారు...ఇప్పుడు రోజంతా చాకిరీ 
  • బోధనే కాదు... బోధనేతర పనులూ తప్పవన్నారు
  • వేతనాలు పెంచమన్నందుకు షోకాజ్‌ ఇచ్చారు.. కేజీబీవీ పీజీటీల ఆవేదన


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

 ‘కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచరు ఉద్యోగం. ఇంటర్‌ విద్యార్థులకు రోజుకు రెండు గంటలు చెపితే చాలు. రూ.12 వేలు ఇస్తాం’ అంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూసి పీజీ చేసిన పలువురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లను (పీజీటీ) ఎంపిక చేశారు. 2018 నుంచి వీరంతా రాష్ట్రంలోని వివిధ కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్నారు. మొదట్లో రెండు గంటలతోనే ఆరంభమైనా... ఇప్పుడు రోజంతా పని చేయాల్సిందే, పాఠశాలలో ఉండాల్సిందే అంటూ అధికారులు హుకుం జారీ చేశారు. బోధనతోపాటు బోధనేతర పనులు... ముఖ్యంగా ఇంటర్‌ బోర్డుతో ఉత్తర ప్రత్యుత్తరాల వంటి పనులనూ వీరే నిర్వహించాలంటూ తేల్చి చెప్పేశారు. వీటికి తోడు వారానికి రెండు రోజులు స్టడీ అవర్స్‌ పేరుతో నైట్‌ డ్యూటీలూ తప్పడం లేదు.


పెరిగిన పని భారానికి తోడు, పెరగని జీతాలతో మూడేళ్లుగా నెట్టుకొస్తున్నారు. గతంలో కార్పొరేట్‌ కళాశాలల్లో రూ.25 నుంచి రూ.40 వేలకు చేస్తున్న పనిని వదులుకొని రావడం తప్పయిందన్న భావన ఇప్పుడు వారిని వేధిస్తోంది. ‘‘ఇదే కేజీబీవీల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు బోధించే టీజీటీలకు నెలకు రూ.22 వేల వేతనం ఇస్తున్నారు. కనీసం వారికి ఇస్తున్నంతైనా ఇంటర్‌ ఉపాధ్యాయులమైన మాకు ఇవ్వరా?’’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రస్తావిస్తూ, వేతనాలు పెంచాలని కోరుతూ కొన్ని జిల్లాల పీజీటీలు, సమగ్ర శిక్షా ఉన్నతాధికారులను వాట్సాప్‌ ద్వారా కోరారు. దీనిపై ఆగ్రహించిన అధికారులు వాట్సా్‌పలో వినతిపత్రం ఇచ్చిన పీజీటీలకు షోకాజ్‌ ఇచ్చారు. వినతిపత్రాలు ఇవ్వడానికి వాట్సాప్‌ వేదిక కాదని తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement