విభిన్నమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విష్ణు విశాల్. ప్రస్తుతం మను ఆనంద్ దర్శకత్వంలో ‘ఎఫ్ఐఆర్’ అనే చిత్రంలో నటించడమే కాకుండా, చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తన సొంత నిర్మాణ సంస్థ విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానరులో ‘మోహన్‌దాస్’ అనే చిత్రానికి గత యేడాదే శ్రీకారం చుట్టారు. కానీ కరోనా కారణంగా షూటింగు ప్రారంభించలేదు. ఈ క్రమంలో బుధవారం ఈ సినిమా షూటింగు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ‘కలవు’ చిత్రం ద్వారా ప్రతి ఒక్కరినీ తనవైపునకు తిప్పుకున్న మురళి కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో విష్ణు విశాల్ హీరోగా నటిస్తుండగా, ఇటీవల ‘కలైమామణి’ అవార్డును సొంతం చేసుకున్ని ఐశ్వర్యా రాజేష్‌ను హీరోయిన్గా ఎంపికచేశారు. ఓ కీలక పాత్రలో ఇంద్రజిత్ కనిపించనున్నారు. వీరితో పాటు పూర్ణిమా భాగ్యరాజ్, కరుణాకరన్, అక్షయ్ రాధాకృష్ణన్, షారిక్, లాలూ, ప్రకాష్ రాఘవన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కలవు’ చిత్రానికి పనిచేసిన టెక్నీయన్లంతా పనిచేస్తున్నారు. విష్ణు విశాల్ (వివి) స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరో విష్ణు విశాల్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కేఎస్ సుందరమ్మూర్తి సంగీతం సమకూరుస్తున్నారు.