Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందరికీ ఆర్థిక సాధికారత

ఆర్థిక సాంకేతిక విప్లవంతోనే

ఆర్థిక సేవల సమ్మేళనమే ఫిన్‌టెక్‌ విప్లవానికి చోదకం 

సాంకేతిక భద్రతతోనే ఫిన్‌టెక్‌  పరిష్కారాలు సంపూర్ణం 

 ఇన్ఫినిటీ ఫోరమ్‌ సదస్సులో  ప్రధాని మోదీ 


న్యూఢిల్లీ: భారతీయులందరికీ ఆర్థిక సాధికారికత కల్పించేందుకు ఆర్థిక సాంకేతిక (ఫైనాన్షియల్‌ టెక్నాలజీ్‌స-ఫిన్‌టెక్‌) విప్లవం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో ఫిన్‌టెక్‌ సేవల రంగం ఇప్పటికే భారీ పురోగతి సాధించిందని, సామాన్య జనాల్లోనూ ఈ సేవలకు ఆమోదం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఇన్ఫినిటీ ఫోరమ్‌ పేరుతో ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎ్‌ఫఎ్‌ససీఏ) ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్‌ సదస్సును ప్రధాని శుక్రవారం ప్రారంభించారు. ఫిన్‌టెక్‌ విప్లవానికి ఆర్థిక సేవల సమ్మేళనమే ప్రధాన చోదకమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘‘ఆదాయం, పెట్టుబడులు, బీమా, వ్యవస్థాగత రుణం అనే నాలుగు స్తంభాలపై ఆర్థిక సాంకేతికత రంగం ఆధారపడి ఉంది. ప్రజల ఆదాయం పెరిగితేనే, పెట్టుబడి సాధ్యపడుతుంది. అలాగే, బీమా కవరేజీతో రిస్క్‌ తీసుకునే సామర్థ్యం పెరగడంతో పాటు పెట్టుబడులకూ దోహదపడుతుంది. వ్యవస్థాగత రుణాలు విస్తరణకు రెక్కలు తొడుగుతాయి. ఈ నాలుగు స్తంభాల బలోపేతానికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింద’’న్నారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే..  

జూ జనసామాన్యానికి ఉపయోగపడటంతో పాటు వారికి లబ్ధి చేకూర్చడంపైనే ఫిన్‌టెక్‌ సేవల విజయం ఆధారపడింది. ఆర్థిక సాంకేతిక ఆవిష్కరణలకు దేశంలోని అసామాన్య జనాభాయే సరైన వేదిక. దేశంలోని ప్రతి ఒక్కరికీ రుణాలు, సంఘటిత రుణ వ్యవస్థను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలో ఫిన్‌టెక్‌ రంగం వినూత్న సేవల్ని అందించేందుకు కృషిచేస్తోంది. ఫిన్‌టెక్‌ రంగ ప్రయత్నాలను విప్లవంగా మలచాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఈ విప్లవం దోహదపడుతుంది. 


 ఆర్థిక రంగంలో సాంకేతికత భారీ మార్పులు తీసుకువస్తోంది. గత ఏడాది దేశంలో మొబైల్‌ ద్వారా చెల్లింపులు.. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణల స్థాయిని మించిపోయాయి. ఒక్క భౌతిక శాఖ కూడా లేకుండా పూర్తి డిజిటల్‌ బ్యాంక్‌ ఏర్పాటు ఇప్పటికే సాకారమైంది. దశాబ్దంలోపే ఈ డిజిటల్‌ బ్యాంక్‌లు సాధారణం కానున్నాయి. 


 ఆధునిక సాంకేతికత వినియోగంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని ప్రపంచానికి చాటిచెప్పాం. డిజిటల్‌ ఇండి యా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలే దేశంలో వినూత్న ఆర్థిక సేవలకు ద్వారాలు తెరిచాయి.  


 డిజిటల్‌ చెల్లింపులు వంటి సాంకేతికతలను విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా సామాన్యులు ఫిన్‌టెక్‌ సేవలపై తమకున్న అపార నమ్మకాన్ని ప్రదర్శించారు. ఈ నమ్మకాన్ని కొనసాగించడం ఫిన్‌టెక్‌ కంపెనీల బాధ్యత. ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం రుణాలైతే, సాంకేతికత దాని వాహకం. అంత్యోదయ, సర్వోదయ లక్ష్యాల సాధనకు ఈ రెండూ ముఖ్యమే. 


సమాచార గోప్యత, ‘క్రిప్టో’ 

బిల్లులను సమర్థించిన అంబానీ 

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సమాచార గోప్యత (డేటా ప్రైవసీ), క్రిప్టోకరెన్సీ బిల్లులను భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ సమర్థించారు. ప్రభుత్వం ముందుచూపుతో విధానాలు, నిబంధనలు రూపొందిస్తోందన్నారు. వ్యూహాత్మక డిజిటల్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రక్షణ.. భారత్‌తోపాటు ప్రతి దేశం హక్కు అని ఆయన అన్నారు. ఈ డిజిటల్‌ యుగంలో డేటా సరికొత్త ఇంధనమని అన్నారు. వ్యక్తిగత సమాచార గోప్యత ప్రతి ఒక్కరి హక్కు అని.. దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. క్రిప్టోకరెన్సీలపై నియంత్రణకు సంబంధించి అంబానీ స్పందిస్తూ..‘‘బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై నాకు నమ్మకం ఉంది. ఇది క్రిప్టోకరెన్సీకి మాత్రమే పరిమితమైన సాంకేతికత కాదు. విశ్వసనీయ, సమసమాజ ఏర్పాటుకు బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత ఎంతో ముఖ్యమ’’న్నారు. అంతేకాదు, వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న 5జీ సేవలతో భారత్‌ ప్రపంచంలోని అధునాతన డిజిటల్‌ మౌలిక సదుపాయాలు కలిగిన దేశాల్లో ఒకటిగా ఎదగనుందన్నారు. 


  భారత్‌ భవిష్యత్‌పై నమ్మకం ఉంది: సన్‌ 

భారత్‌ బంగారు భవిష్యత్‌తో పాటు దేశంలోని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలపై తనకు ఎంతగానో నమ్మకం ఉందని జపాన్‌ టెక్నాలజీ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ చీఫ్‌ మసయోషి సన్‌ అన్నారు. గడిచిన పదేళ్లలో సాఫ్ట్‌బ్యాంక్‌ భారత కంపెనీల్లో 1,400 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. కేవలం ఈ ఏడాదిలోనే 300 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు ఆయన చెప్పారు. 


 విదేశాలకు ఎన్‌పీసీఐ సేవల విస్తరణ 

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల కోసం అభివృద్ధి చేసిన స్టాక్‌ (సాంకేతిక వ్యవస్థ) ఆధారంగా ఇతర దేశాలు సొంత చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పడనున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎండీ, సీఈఓ దిలీప్‌ అస్బే తెలిపారు. ‘‘ఎన్‌పీసీఐ ఇప్పటికే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌), ప్రపంచ బ్యాంక్‌తో కలిసి పనిచేస్తోంది. అలాగే ఇప్పటికే 50-60 దేశాల నియంత్రణ మండళ్లనూ సంప్రదించాం’’ అని ఆయన అన్నారు. 


ఆధార్‌ ఇక గ్లోబల్‌!

ఆధార్‌ కార్డులు జారీ చేసే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) తన సేవలను విదేశాలకు విస్తరించాలనుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ గుర్తింపు వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు యూఐడీఏఐ సీఈఓ సౌరభ్‌ గార్గ్‌ తెలిపారు. అంతేకాదు, ఆధార్‌ కార్డుదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత పెంచడంతో పాటు ఆధార్‌ ద్వారా మరిన్ని రకాల లావాదేవీలను జరిపేందుకు వీలుకల్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. 

Advertisement
Advertisement