Abn logo
Apr 20 2021 @ 00:45AM

‘కరోనా ముక్త్‌ భారత్‌’ పోరులో మోదీ

కరోనాపై రెండవ పెద్ద యుద్ధం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారం రోజుల క్రితమే ప్రకటించారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కరోనా విషయంలో గత ఏడాదితో పోలిస్తే మనకు ఇప్పుడు మెరుగైన అనుభవం, వనరులు అందుబాటులో ఉన్నాయి. వాక్సిన్ కూడా అందుబాటులో ఉన్నది. ఇవాళ భారత దేశంలో జరుగుతున్నంత వేగంగా వాక్సినేషన్ ఏ దేశంలోనూ జరగడం లేదు. కొవిడ్ నివారణలో పదికోట్ల మందికి టీకా ఇచ్చేందుకు చైనాకు 109 రోజులు, అమెరికాకు 89 రోజులు పడితే మన దేశానికి కేవలం 85 రోజులే పట్టింది. దేశంలో ప్రతి ఒక్కరికీ వాక్సినేషన్ జరగాలని, ఆ కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ ప్రజలు గతంలో తీసుకున్న విధంగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని ప్రధానమంత్రి ఇప్పటికి కొన్ని వందలసార్లు చెప్పారు. దేశంలో కంపెనీలు తమ ఉత్పాదక స్థాయికి తగ్గట్లుగా వాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం పధ్నాలుగున్నర కోట్ల వాక్సిన్‌ను రాష్ట్రాలకు సరఫరా చేసింది. మరో పదికోట్ల వాక్సిన్ ఉత్పత్తి అయి రవాణా దశలో ఉన్నది. వాక్సిన్ కొరత లేదని, అనుకున్న ప్రణాళికకు అనుగుణంగా సరఫరాలు జరుగుతూనే ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ తమకు వాక్సిన్ అందడం లేదని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కొన్ని రాజకీయాలు చేస్తున్నాయి.


కరోనాపై నిర్ణాయక పోరును ప్రారంభించడం, భారత శాస్త్రవేత్తలకు అండదండగా నిలిచి కరోనా విరుగుడుకు వాక్సిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, ‘దవాయి భీ కడాయి భీ’ అంటూ వాక్సిన్‌తో పాటు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించడం, ఆర్థికవ్యవస్థ తిరిగి కోలుకునే కీలకచర్యలు తీసుకోవడం మొదలైన విషయాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందించిన నాయకత్వాన్ని ఎవరూ విస్మరించలేరు. కరోనా తగ్గుముఖం పట్టి జనజీవనం మళ్లీ యథాస్థితికి చేరుకుంటున్న క్రమంలో అది రెండోసారి విపత్కర పరిస్థితులు సృష్టించడం ఊహించని పరిణామమేమీ కాదు. నిజానికి ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం. ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్ని ఆధునిక వైద్య వసతులు ఉన్నప్పటికీ ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలో సంభవిస్తున్నాయి. 33 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో ప్రతి పదిలక్షల మందికి 1747 మంది కరోనా వాతపడి మరణిస్తున్నారు. అదే 139 కోట్ల మంది, అత్యధిక జనసమ్మర్థం ఉన్న భారతదేశంలో పదిలక్షల మందికి 129 మంది మరణిస్తున్న విషయం మనం తెలుసుకోవాలి. అయినప్పటికీ కేంద్రం ఏనాడూ పరిస్థితిని విస్మరించలేదు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ర్యాలీల్లో ప్రధానమంత్రి విస్తృతంగా పాల్గొంటున్నారని, హరిద్వార్‌లో కుంభమేళాను అనుమతించారని, మోదీ విధానాల వల్లే కరోనా తీవ్రతరమవుతోందని ఇటీవలి కాలంలో ప్రతిపక్షాలు మరో కొత్తరాగాన్ని ఎంచుకున్నాయి. ఒక రాజకీయపార్టీలో ముఖ్యమైన నేతగా పశ్చిమబెంగాల్‌లోనే కాదు, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ తరఫున ప్రచారం చేయడం మోదీ కర్తవ్యం. ఆయన ఎక్కడ అడుగుపెట్టినా ప్రజలు నీరాజనాలు పలకడం, ఆయన పిలువుకు ప్రతిస్పందించి బీజేపీకి బ్రహ్మరథం పట్టడం సహించలేక ప్రతిపక్షాలు కరోనావ్యాప్తిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 


అసలు దేశప్రజల సమస్యలను, ముఖ్యంగా కరోనా తీవ్రతను మోదీ విస్మరించిన రోజుందా? పశ్చిమబెంగాల్‌లో ఆయన దాదాపు 20 ఎన్నికల సభల్లో పాల్గొని ఉండవచ్చు. కాని అదే సమయంలో ఎన్నికల మధ్యలోనే ఆయన ఢిల్లీ వచ్చారు. ఈ ఏప్రిల్ నెలలోనే అనేకసార్లు కరోనా పరిస్థితిని సమీక్షించారు. ఏప్రిల్ 4న అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి టీకామందు కార్యక్రమాన్ని సమీక్షించారు. కరోనా మహమ్మారిని అదుపు చేయడం కోసం ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ (పరీక్షలు, రోగులను కనిపెట్టడం, చికిత్స చేయడం) ప్రాధాన్యతను స్పష్టం చేశారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇతర సౌకర్యాల కల్పన ద్వారా వీలైనంత మేరకు మరణాలు తగ్గించాలని కోరారు. ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చిన జిల్లాల్లో యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినం రోజు కూడా రోగ నిరోధకశక్తి పెంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 8న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి వైరస్‌పై సంఘటిత పోరాటం చేయాలని, ప్రజల్లోనూ, పాలనా యంత్రాంగంలోనూ కరోనా పట్ల ఉదాసీనత పనికి రాదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి నుంచి ఏప్రిల్ 14న బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వరకు టీకా ఉత్సవం ప్రారంభించి కరోనాపై రెండవ అతి పెద్ద యుద్ధం జరుగుతోందని స్పష్టం చేశారు. అంబేడ్కర్ జయంతి రోజున గవర్నర్‌తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రాలకు అందించాల్సిన మార్గదర్శకత్వం గురించి వారికి వివరించారు. ఏప్రిల్ 17న ఆయన మళ్లీ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాల సంసిద్ధత గురించి సమీక్షించారు. వాక్సిన్ ఉత్పత్తి పెంపు, మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు, పడకలు, ఇంజక్షన్ల నుంచి వెంటిలేటర్ల లభ్యత వరకు అన్ని విషయాలపై ప్రధాని ఆరా తీశారు. ఏప్రిల్ 18న తన స్వంత నియోజకవర్గం వారణాసిలో కరోనా పరిస్థితిపై ప్రాంతీయ ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 19న కూడా ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇన్ని వరుస సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు దేశానికి మార్గదర్శకత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కరోనా పట్ల శ్రద్ధ వహించడం లేదని ఎవరైనా అనగలరా?


ఎన్నికల్లో బిజెపి గెలవడం మోదీకి ముఖ్యమే కావచ్చు కానీ, ఆయనకు అంతకంటే ముఖ్యం ప్రజల మనసులను గెలుచుకోవడం. రాజకీయాలను ఎంతవరకు పరిమితం చేయాలో, దేశశ్రేయస్సు కోసం ఎటువంటి చర్యలనైనా వెనుకాడకుండా ఏ విధంగా తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే అవినీతిపై పోరాటాన్ని ప్రారంభించినా, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం తిరుగులేని నిర్ణయాలు తీసుకున్నా, మెజారిటీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా అడుగులు వేసినా, గత ఏడాది కాలం నుంచీ కరోనాను నిర్మూలించేందుకు అవసరమైన నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నా ఆయన తనదైన నిజాయితీతో కూడిన శైలిని ప్రదర్శిస్తున్నారు. మోదీ పనిచేసే పద్ధతే ప్రజల్లో ఆయన పట్ల ఆదరణ పెంచితే, అదే శైలి ప్రతిపక్షాల వెన్నులో చలిని పుట్టిస్తోంది.

వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Advertisement
Advertisement
Advertisement