Abn logo
May 4 2021 @ 14:53PM

Modi తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు : పశ్చిమ బెంగాల్ గవర్నర్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌కు మంగళవారం మోదీ ఫోన్ చేసి, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలో లూటీలు, హత్యలు జరుగుతుండటంపై తీవ్ర ఆందోళన, మనోవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ధన్‌కర్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేశారని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, దహనకాండ, దోపిడీలు, హత్యలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రికి తెలిపానని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు సంబంధితులు తక్షణం చర్యలు ప్రారంభించాలన్నారు. 


శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో హింసాకాండ ప్రారంభమైందని బీజేపీ ఆరోపించింది. ఈ హింసాకాండపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీజేపీ నేత గౌరవ్ భాటియా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 


టీఎంసీ కార్యకర్తలు తమ పార్టీకి చెందిన నలుగురిని హత్య చేశారని, ఈ హింసాకాండకు బాధ్యత అధికార పార్టీదేనని బీజేపీ ఆరోపించింది. టీఎంసీని నాజీలతో పోల్చింది. పశ్చిమ బెంగాల్‌లో ఫాసిస్టు ప్రభుత్వం ఉందని మండిపడింది. 


Advertisement
Advertisement
Advertisement