Abn logo
Sep 25 2020 @ 04:36AM

ఎమ్మెల్సీ పోరు రసవత్తరం!

Kaakateeya

రేస్‌లో పలువురు నేతలు

జోరుగా సభ్యత్వ నమోదు 

బరిలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

ఆయనకు మద్దతుగా వామపక్షాలు

టీఆర్‌ఎస్‌ మద్దతు కోసం భారీ పోటీఈ సారి ఎమ్మెల్సీ ఎన్నిక సాదాసీదాగా జరిగేలా కనిపించడం లేదు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అనేకమంది సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో తమ పట్టును నిలుపుకోవాలని బీజేపీ భావిస్తుండగా, టీఆర్‌ఎస్‌ తన మద్దతుదారుడిని గెలిపించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక, కాంగ్రెస్‌ కూడా ఓటర్ల చేర్పింపుతో దూసుకు పోతోంది. అయితే, గతంలో రెండుసార్లు ఇక్కడ నుంచి విజయం సాధించిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా మళ్లీ బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దింపేం దుకు కసరత్తు మొదలు పెట్టాయి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు గ్రేటర్‌ ఎన్నికల వ్యూహాల్లో మునిగి పోయాయి. జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతు న్నాయి. ఇప్పటికే అధికారపార్టీ రోజూ సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సభ్యత్వ నమోదు బాధ్యతలు చూస్తున్నారు. వీరికి పార్టీ నాయకత్వం టార్గెట్లు కూడా ఇచ్చింది. ఇక కాంగ్రెస్‌పార్టీ కూడా సభ్యత్వ నమోదు చేపట్టింది. ఆ పార్టీ మద్దతు ఆశిస్తున్న నేతలు స్థానికంగా కొత్త ఓటర్లను నమోదు చేయించే పనిలో నిమగ్నమయ్యారు.


మరోవైపు బీజేపీ కూడా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించింది. బీజేపీ, వాటి అనుబంధ సంస్థలు ఈ బాధ్యతలు చూస్తున్నాయి. ఇది బీజేపీకి సిట్టింగ్‌ స్థానం కావడంతో ఆ పార్టీ ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకుంటోంది. ఎమ్మెల్సీ స్థానంతోపాటు గ్రేటర్‌ ఎన్నికలు కూడా దాదాపు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా గ్రేటర్‌ పరిధిని ఆరు భాగాలు విభజించి కొత్తఅర్బన్‌ అఽధ్యక్షులను నియమించింది. ఈ సరికొత్త వ్యూహం బీజేపీకి ఎంతవరకు లాభిస్తుందో వేచి చూడాలి. ఇక, ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలనుకుంటున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు వామపక్షాలు మద్దతునివ్వాలని నిర్ణయిం చాయి. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఆయన రెండు సార్లు పోటీచేసి ప్రధాన పార్టీలను ఓడించి ఘన విజయం సాధించారు. మరోసారి ఆయన బరిలో ఉండడంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మార నున్నాయి. 


ఆశావహులు వీరే..

ఇదిలా ఉంటే ఆయా పార్టీల్లో ఆశావహులు పార్టీ అధినాయకత్వం పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఇప్పటికే పార్టీ అధినేతలను కలిసిన కొందరు నేతలు గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీలో ఎక్కువ మంది రేస్‌లో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగేందుకు జీహెచ్‌ఎంసీ మేయర్‌  బొంతు రామ్మోహన్‌తోపాటు మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, కాసాని వీరేశ్‌, నాగేందర్‌గౌడ్‌, శుభప్రదపటేల్‌ పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్‌ తరపున మాజీ ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌, కూనశ్రీశైలం, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పోటీలో ఉన్నారు. ఇక బీజేపీ తరుపున ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తమకు కూడా అవకాశం కల్పించాలని మరికొందరు నేతలు కోరుతున్నారు. ముఖ్యంగా హెచ్‌ఏఎల్‌ డైరెక్టర్‌, బీజేపీ ఉమ్మడి రంగారెడ్డిజిల్లా మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ ముఖ్యనేతలను కోరుతున్నారు. ఈసారి ఎమ్మెల్సీగా బరిలో నిలిచేందుకు ఎక్కువ మంది పోటీ పడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement