Advertisement
Advertisement
Abn logo
Advertisement

మళ్లీ ‘సీటు’ కావాలంటే ఆ పని చేయాల్సిందే.. ycp నేతల్లో ఆందోళన.!

వైసీపీలో ‘పీకే’ ఫీవర్

ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్న ఎమ్మెల్యేలు..


అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రెండేళ్లు ముందే ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లారా? హైకమాండ్‌కు కూడా భయపడని కొందరు నేతలు.. ఇప్పుడెందుకు కంగారుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఆందోళనకు కారణమేంటి? తెర వెనుక జరుగుతున్న అసలు కథ ఏంటి?.. వివరాలు ఇవాల్టి ‘ఇన్‌సైడర్’లో..

పీకే టీం రీఎంట్రీతో ఆందోళన..

ఎన్నికలకు మరో రెండేళ్లకుపైగా సమయంగా ఉండగానే.. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారులంతా వెళ్లిపోయిన తర్వాత సీఎం జగన్.. పీకే టీమ్ మళ్లీ ఎంట్రీ ఇస్తోందనే విషయాన్ని మంత్రులకు చెప్పారు. సీఎం ఈ విషయం చేప్పేసరికి అక్కడున్న మంత్రులందరికీ చెమటలు పట్టాయి. ఏసీ హాల్లో నుంచి బయటకు వచ్చినా.. కొంతమందికి మాత్రం చెమటలు పట్టాయట. కొందరు వైసీపీ నేతలు హైకమాండ్‌ను లెక్క చేయకపోయినా.. ప్రశాంత్ కిషోర్ పేరు చెబితే చాలు భయపడిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులలో పీకే టీమ్ భయం పట్టుకుంది. గత ఎన్నికల సమయంలో మాదిరిగా పీకే ఎవరి పని తీరు బాగోలేదంటే వారిని పీకేస్తారేమోనన్న ఆందోళన వీరిని వెంటాడుతోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కాకముందే, పీకే ప్రస్తావన ఇప్పుడే ఎందుకొచ్చిందనే అంతర్మథనం వైసీపీ ఎమ్మెల్యేల్లో మొదలైంది.

 పార్టీపై వైసీపీ సీరియర్ నేతల విమర్శలు..

మంత్రులను పీకే భయం ఎందుకు అంతగా వెంటాడుతోంది? సీఎం నోటి వెంట ప్రశాంత్ కిషోర్ పేరు ఎందుకొచ్చిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నాలుగు నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు మినహా, అభివృద్ధిని పట్టించుకోని వైసీపీ ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు పడ్డాయి. వీటిని పూడ్చేందుకు, కొత్త రోడ్లు వేసేందుకు కాంట్రాక్టు పిలిచినా.. ఎవరూ ముందుకు రాలేదు. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించినా.. బ్యాంకు అధికారులు ముఖం చాటేశారు. దీనికి తోడు రేషన్ కార్డులు, పెన్షన్లను అనర్హుల పేరుతో తొలగిస్తున్నారని క్షేత్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, భూకబ్జాలు వంటి ఘటనలు పార్టీ ప్రతిష్టను మసకబారే విధంగా చేశాయని వైసీపీ సీనియర్ నేతలే చెబుతున్నారు.

ఎక్కడికెళ్లినా వ్యతిరేకత..

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతి తరలింపు వంటి అంశాలు అంతర్గతంగా ప్రజల్లో అసంతృప్తికి దారి తీశాయి. వీటన్నింటికీ మించి ఇసుక వ్యవహారంతో క్షేత్రస్థాయిలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. చివరికి వైసీపీ నేతలు చెప్పినప్పటికీ ఇసుక రావడం లేదని.. పలు సమీక్షాసమావేశాల్లో ఎమ్మెల్యేలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పార్టీ నేతల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినా అలా ముఖం చూపించి వచ్చేస్తున్నారట.

 మంత్రులకు జగన్ హితబోధ..

ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులలో నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందని తెలుసుకున్న వైసీపీ కీలక నేతలు.. కొత్త వ్యూహానికి పదును పెట్టారనే చర్చ జోరుగా సాగుతోంది. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుండడంతో.. మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకునేందుకు పీకే బృందం రంగంలోకి దిగుతుందని, కేబినెట్ మీటింగ్‌లో జగన్ తెలిపారు. పీకే టీమ్ సర్వే విషయాన్ని ఎమ్మెల్యేలకు కూడా చెప్పాలని మంత్రులకు హితబోధ చేశారు. ఈ విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో ఎమ్మెల్యేలు, మంత్రులలో ఆందోళన ప్రారంభమైంది.

 అసలే ఆందోళనలో ఉండగా.. మళ్లీ..

2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ టీమ్ పలుమార్లు సర్వే చేసింది. వైసీపీ హైకమాండ్ కూడా వారు చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చింది. చివరి నిమిషంలో కూడా కొన్ని మార్పులు చేసి జాబితాను ప్రకటించింది. పీకే టీం వల్లే తాము గెలిచామనే భావనలోకి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఇప్పటికే ఆందోళనలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు పీకే సర్వే పేరుతో మరోసారి జగన్ హెచ్చరికలు పంపారని.. అధికార పార్టీకే చెందిన ఓ సీనియర్ నేత విశ్లేషించారు. మళ్లీ ఎమ్మెల్యేలు రోడ్ల మీదకు రావాలని, తాను కూడా వచ్చే సంవత్సరం నుంచి ప్రజల్లోకి వస్తానని సీఎం చెప్పడంలో ఆంతర్యం ఇదేనని.. వారు తమ వాదనకు సీఎం చేసిన వ్యాఖ్యలను బలంగా చూపిస్తున్నారు.

మళ్లీ సీటు కావాలంటే తప్పదు..

వైసీపీ ఎమ్మెల్యేలంతా మళ్లీ గ్రామాలు, పట్టణాలలో వార్డుల బాట పట్టాలనే వ్యూహంతోనే.. జగన్ పీకే బాంబ్ విసిరారనే వాదనలు వినిపిస్తున్నాయి. తన భయం లేకపోయినా, కనీసం పీకే టీమ్ భయం అయినా ఉంటుందనేది జగన్ భావన అని మరికొందరు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తానికి క్యాబినేట్‌లో జగన్ చెప్పిన పీకే టీమ్ సర్వే, వైసీపీలో కొంతమంది నేతలకు మత్తును వదిలించింది. వచ్చే ఎన్నికల్లో సీటు కావాలంటే మళ్లీ జనం దగ్గరకు వెళ్లాల్సిందేనని చెప్పడమే ఇందులోని ఆంతర్యమని అంటున్నారు. జనం వద్దకు వెళ్లాలంటే వారు వేసే ప్రశ్నలకు.. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీపై జనం నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. 

ప్రజల్లోకి వెళ్లాలంటే భయం..

పెన్షన్లు, రేషన్ కార్డులు తొలగించడంపై ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ బిల్లుల్లో బాదుడు, పురపాలక, నగరపాలక సంస్థలలో చెత్త పన్ను, విలువ ఆధారిత పన్ను పేరుతో అదనంగా పన్నులు వసూలుపై కూడా నిరసన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లో వెళ్లడానికి భయపడుతున్నారు. ఓ వైపు పీకే టీమ్ సర్వే టెన్షన్.. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు మళ్లీ ప్రజల మధ్యలోకి వెళ్తారో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement