Abn logo
Sep 27 2020 @ 03:00AM

ఆరోగ్య కేంద్రంలో వసతుల కల్పనకు కృషి

ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి


అవుకు, సెప్టెంబర్‌: అవుకు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. శనివారం సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని ఆసుపత్రి అభివృద్ది కమిటీతో సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2013 డిసెంబరులో 30పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకొని, ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) అధీనంలోకి వెళ్లినా డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు సమకూరక పోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కలసి 46 మంది విధులు నిర్వర్తించాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటికీ డిప్యుటేషన్‌పై ఒక డాక్టర్‌తో పాటు నలుగురు సిబ్బందితో నెట్టుకొస్తున్నారన్నారు. దీంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు.


సమస్యలను ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 1లక్ష నిధులతో ఆసుపత్రికి తాగునీరు, ల్యాబ్‌ పరికరాలు, జిరాక్స్‌ మిషన్‌, ఇన్‌వర్టర్‌ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆసుపత్రి అభివృద్ది కోసం రూ. 2.50కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ తిరుపాలయ్య, ఎంపీడీవో ఆజాంఖాన్‌, ఈవోఆర్డీ బాలాంజనేయులు, కాటసాని తిరుపాల్‌రెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ బీసీ సెల్‌ కార్యదర్శి మద్దిలేటిగౌడు, కంబగిరిస్వామి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement