Abn logo
Mar 26 2020 @ 03:30AM

అమాత్యునికి రూల్స్‌ వర్తించవా?

మందీమార్బలంతో దుర్గగుడికి మంత్రి వెలంపల్లి

కరోనా నేపథ్యంలో మంత్రి తీరుపై విమర్శలు

విజయవాడ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంలో భాగంగా రాష్ట్రంలోనూ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తోంది. జనం తప్పనిసరి పరిస్థితుల్లో అయినా రోడ్ల మీదకు వస్తే పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యం త్రాంగం మొత్తం కరోనాను కట్టడి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అయితే.. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాత్రం.. బాధ్యతలు మరిచి దుర్గగుడిని మందీమార్బలంతో సందర్శించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో గత ఆదివారం జనతా కర్ఫ్యూ అమలు చేసినప్పటి నుంచి కనకదుర్గమ్మ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం అమ్మవారికి వేదపండితులు మాత్రమే ఏకాంత సేవలు కొనసాగిస్తున్నారు.  బుధవారం ఉగాది కావడంతో దేవస్థానం అధికారులు సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. దీనికీ భక్తులెవరికీ అనుమతి లేదు. అయితే మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాత్రం.. తన కు టుంబ సభ్యులు, చుట్టూ మందీ మార్బలంతో బుధవారం ఉదయం కనకదుర్గమ్మ గుడిని సందర్శించారు. మంత్రివర్యులు గుడికి వస్తున్నారని తెలుసుకుని ఫ్రొటోకాల్‌ ప్రకారం దేవదాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.పద్మ, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి పాలక మండలి ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తదితర ప్రముఖులు వచ్చారు. ఇలా వచ్చినవారంతా ప్రముఖులే కావడంతో దుర్గగుడి అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి, ఆయన కు టుంబ సభ్యులు, ఇతర ప్రముఖులంతా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐదుగురికి మించి ఎక్కువమంది గుమిగూడవద్దని, వారు కూడా కనీసం మూడు మీటర్ల ఎడంతో సామాజిక దూరా న్ని పాటించాలనే నిబంధన ఉన్నా.. మంత్రి, ఎమ్మెల్యేలతోపాటు వచ్చినవారందరూ ఎలాంటి సామాజిక దూరాన్ని పాటించకుండా ఒకేచోట గుమిగూడి పంచాంగ శ్రవణాన్ని విన్నారు. అమ్మవారి సన్నిధిలో వేదపండితుల ఆశీర్వచనాలు సైతం అలాగే తీసుకున్నారు. దీంతో మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.  


Advertisement
Advertisement
Advertisement