Abn logo
Jun 4 2020 @ 04:56AM

రూ.288 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం

జులైలో సీఎంతో శంకుస్థాపన

మంత్రి మోపిదేవి వెల్లడి


బిట్రగుంట, జూన్‌ 3 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి రూ.288 కోట్లతో నిర్మించనున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ఇందుకు సంబంధించి జులైలో సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. బోగోలు మండలం జువ్వలదిన్నెలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ స్థలాన్ని బుధవారం మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీరంలో ఉన్న వసతులు, వనరులను అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని  చెప్పారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, కావలి ఏఎంసీ చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి, ఆఫ్‌కాప్‌ చైర్మన్‌ కొండూరు అనీల్‌, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, మత్స్య శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు. 


ఫిషింగ్‌ లాండింగ్‌ కేంద్రానికి..

అల్లూరు : ఇస్కపల్లి తీరప్రాంతంలో ఫిషింగ్‌ లాండింగ్‌ కేంద్రానికి బుధవారం మంత్రులు అనిల్‌కుమార్‌, మోపిదేవి వెంకటరమణ, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మల్యే బీద మస్తాన్‌రావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మంత్రులు మత్స్యకారులతో కాసేపు మాట్లాడారు. రూ.2.30 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని దీని ద్వారా మత్స్య సంపదను ఆరబెట్టుకోవడంతోపాటు నిల్వ చేసుకునే వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. 


మంత్రుల సుడిగాలి పర్యటన

కావలి టౌన్‌ : రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మోపిదేవి వెంకటరమణ కావలిలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా మద్దూరుపాడులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న చిల్డ్‌ ఐస్‌ ఫ్యాక్టరీ, అనంతరం ఆర్టీసీ డిపో వెనుక చేపల మార్కెట్‌ భవన నిర్మాణ స్థల పరిశీలన చేశారు. మద్దూరుపాడులో కలెక్టర్‌ శేషగిరిబాబు, ఆర్డీవో సుధాకర్‌ మంత్రులకు స్వాగతం పలికారు. కాగా ఎక్కడా పట్టుమని పది నిమిషాలైనా మంత్రుల పర్యటన సాగకుండా హడావుడిగా జరగడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు.

Advertisement
Advertisement
Advertisement