అమూల్ నుంచి పాలకు అందిన తొలిబిల్లు
పులివెందుల, డిసెంబరు 1: పులివెందుల నియోజకవర్గంలోని వంద గ్రామాల్లో అమూల్ సంస్థ ద్వారా పాలసేకరణ నవంబర్ 20 నుంచి ప్రారంభించారు. దీనికి సంబంధించి రైతులకు మొదటి దఫా బిల్లులను అమూల్ చెల్లించింది. ఈ సందర్భంగా గతంలో పాలు విక్రయిస్తున్న సమయంలో ఎంత ఆదాయం వచ్చింది, అమూల్ సంస్థకు విక్రయిస్తుంటే ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాలపై రైతులతో బుధవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి చర్చించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకోసం లింగాల మండలంలోని వెలిదండ్ల, లింగాల, పార్నపల్లె, కోమన్నూతల, పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, వేముల మండలంలోని నల్లచెరువుపల్లె, వేముల, వి.కొత్తపల్లె, వేంపల్లె మండలంలోని రామిరెడ్డిపల్లెను అధికారులు ఎంపిక చేశారు. 9 గ్రామాలను ఎంపిక చేసినప్పటికీ నల్లపురెడ్డిపల్లె, రామిరెడ్డిపల్లె గ్రామాల రైతులతో మాత్రమే ముఖ్యమంత్రి జగన్ ముఖాముఖి మాట్లాడనున్నారు. మిగిలిన ఏడు గ్రామాల రైతులు ముఖ్యమంత్రి సమీక్ష వీడియో మాత్రమే చూస్తారని అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పరిశీలించిన జాయింట్ కలెక్టర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లైవ్ ద్వారా రైతులతో మాట్లాడనున్న సందర్భంగా నల్లపురెడ్డిపల్లె ఆర్బీకేలో చేసిన ఏర్పాట్లను మంగళవారం జాయింట్ కలెక్టర్ గౌతమి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం పలువురు లబ్ధిదారులతో జేసీ మాట్లాడి వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ వసంతకుమారి, లైవ్‌స్టాక్ డీపీఎం నవీన్‌కుమార్‌రెడ్డి, ఏపీఎం గిరిధర్‌రెడ్డి, యానిమేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.