Abn logo
May 23 2020 @ 02:43AM

8 గంటల్లో ‘వలసల’ రిజిస్ర్టేషన్‌

నమోదుకు ప్రతి జిల్లాలో టీమ్‌

48 గంటల్లో బస్సులు ఏర్పాటు

కుదరకపోతే 98 గంటల్లో రైళ్లు

వలస కార్మికుల సమస్యలపై హైకోర్టు మరికొన్ని మార్గదర్శకాలు

నేటి నుంచే రాష్ట్రమంతా అమల్లోకి.. 


అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా తమ గమ్యస్థానాలకు వెళ్లే దారిలేక చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల తరలింపునకు సంబంధించి గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు తోడు మరికొన్నింటిని కూడా నిర్దేశించింది. వలస కార్మికులు తమ పేరు నమోదు చేసుకున్న 48 గంటల్లో బస్సులు ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో 98 గంటల్లో రైలు సదుపాయం ఏర్పాటుచేసి వారి స్వస్థలాలకు తరలించాలని ఆదేశించింది. మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుని ఆపన్నులను ఆదుకోవాలని సూచించింది. వలస కార్మికుల తరలింపునకు సంబంధించి రాష్ట్ర నమూనా కోసం మార్గదర్శకాలు జారీ చేయాలని అడ్వకేట్‌ జనరల్‌కు సూచించింది. రెడ్‌క్రాస్‌, పారా లీగల్‌ వలంటీర్స్‌ తదితరులతో సమన్వయపరచుకోవాలని కోరింది. కానీ కొంతమంది ప్రభుత్వ ఉన్నతాధికారులు సరిగ్గా సహకరించడం లేదని, వారి పనితీరు సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.


వలస కార్మికుల కోసం హైవే వెంట ఉన్న టోల్‌ప్లాజాలు లేదా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లానే.. ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు  చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న వలస కార్మికుల తరలింపుపై చర్యలు చేపట్టాలంటూ సీపీఐ నేత కె.రామకృష్ణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై  శుక్రవారం మరోమారు విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 


‘‘రెడ్‌క్రాస్‌ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు లేదా స్వచ్ఛంద సేవా సంస్థలు, పారా లీగల్‌ వలంటీర్స్‌, విలేజ్‌ వలంటీర్స్‌ తదితర సేవకులను సమన్వయపరచుకునేందుకు రెవెన్యూ, పోలీస్‌, ఆరోగ్య, స్థానిక అధికార యంత్రాంగంతో బృందాన్ని ఏర్పాటు చేయాలి. వారి ద్వారా వలస కార్మికులకు ఆహారం తదితర సదుపాయాలు అందజేయాలి. తమ స్వస్థలాలకు తరలాలనుకుంటున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వలస కార్మికులకు 8 గంటల్లోపు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి. ఇందుకు మంగళగిరిలోని అక్రూక్స్‌ ఐటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ (కాంటాక్ట్‌ నంబరు: 8897335973) సిబ్బంది సహకారం తీసుకోవాలి. లేనిపక్షంలో అన్ని జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల బృందం ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అనువుగా ఏర్పాట్లు చేపట్టాలి. ఆ బృందం 8 గంటల మేర కనీసం రెండు షిఫ్టుల్లో రోజులో 16 గంటల పాటు పని చేయాలి.


ఇలా రిజిస్ట్రేషన్‌ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా చేపట్టాలి. ప్రతి జిల్లా అధికారులతోనూ సమన్వయం చేసుకునే బాధ్యతను రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ తీసుకోవాలి. ప్రతిరోజూ వలస కార్మికుల శిబిరాలను సందర్శించి, వారి సమస్యలు తెలుసుకునేందుకు అనువుగా అక్కడ కనీసం గంటపాటు జాయింట్‌ కలెక్టర్‌, రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌, తహసీల్దార్‌ తదితరులతో కూడిన బృందం ఉండేలా కలెక్టర్‌ పర్యవేక్షించాలి. ప్రతి జిల్లాలో లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి ఆయా క్యాంపులకు వెళ్లి వలస కార్మికులకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించాలి. ఈ మార్గదర్శకాలను శనివారం నుంచే అమలు చేసి, పరిశీలించండి.


వీటి అమలుకు సంబంధించి సంబంధిత అధికారులకు అడ్వకేట్‌ జనరల్‌ కూడా తెలియజేయాలి.బస్సులు, రైళ్ల ద్వారా వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టాలి. కేంద్రం తరఫున వాదనలు వినిపించేందుకు వచ్చిన ఎం.ఇంద్రాణి ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు రైళ్లను ఏర్పాటు చేసేలా ఈ మార్గదర్శకాలను రైల్వేశాఖకు తెలియజేయాలి. వలస కార్మికుల తరలింపునకు కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement