Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంటగ్యాస్‌పై మీథేన్ పన్ను!

సమస్త జీవుల దేహాలలో కర్బనం, ఉదజని మూలకాలు ఉంటాయి. మరణానంతరం భౌతికదేహాలు క్షీణిస్తాయి. పరిసరాలలో ఆమ్లజని ఉంటే కర్బనం కార్బన్ డయాక్సైడ్ గాను, ఉదజని నీరుగాను పరివర్తన చెందుతాయి. ఆమ్లజని అందుబాటులో లేకపోతే కర్బనం మీథేన్ వాయువుగా మారుతుంది. శిలాజ ఇంధనాల వినియోగం, పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలు, అడవుల నిర్మూలన కారణంగా గ్రీన్‌హౌస్ వాయువులు - కార్బన్ డయాక్సైడ్, మీథేన్ , నైట్రస్ ఆక్సైడ్ మొదలైనవి- విడులదలవుతాయి. వాతావరణంలో వీటి మోతాదు పెరిగితే భూమి నుంచి బయటకు పోయే ఉష్ణ వికిరణాన్ని అడ్డుకుంటాయి. ఫలితంగా ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ మొత్తం కాలుష్యకారక వాయువులలో మీథేన్ 31 శాతం ఉంటుంది. మిగతా గ్రీన్‌హౌస్ వాయువుల కంటే మీథేన్ 28 నుంచి 80 రెట్లు ఎక్కువగా ఉష్ణ వికిరణాన్ని అడ్డుకుని భూమి వేడెక్కడానికి అమితంగా కారణమవుతోంది. గ్లాస్గో వాతావరణ సదస్సులో మీథేన్ ఉద్గారాలను తగ్గించేందుకు 100 దేశాలు అంగీకరించాయి. 


వరిసాగు, పాడిపశువులలో జీర్ణక్రియ, బయోమాస్ దహనం ఈ వాయువు విడుదలకు ముఖ్యవనరులు. వరి పంట పొలాలకు నీటి పారుదల పుష్కలంగా ఉండాలి. ఆ నీటిలోని ఆమ్లజని త్వరితగతిన తగ్గిపోతుంది. నీటి అడుగున ఉండే ఆకులు మొదలైనవి పులిసిపోయి మీథేన్ వాయువు విడుదలవుతుంది. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుల జలాశయాలలోకి ఆకులు, అలములు, కళేబరాలు మొదలైనవి పేరుకుపోయి పులిసిపోవడంతో మీథేన్ విడుదలవుతుంది. ఇదే విధంగా పశువుల పేడ పులిసిపోయినప్పుడు సైతం మీథేన్ విడుదలవుతుంది. 


దేశ ఆర్థిక పురోగతికి వ్యవసాయం, పశుపోషణ, జలవిద్యుదుత్పత్తి రంగాలలో అభివృద్ధి సాధన ముఖ్యం గనుక గ్లాస్గో కాప్ 26 మీథేన్ ఒప్పందంలో భాగస్వామి అయ్యేందుకు భారత్ తిరస్కరించింది. అయితే ఆర్థికాభివృద్ధికి అవరోధం లేకుండానే మీథేన్ ఉద్గారాలను తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు వరి పొలాలకు నీటిని ఎడతెగకుండా కాకుండా మధ్య మధ్య విరామంతో సరఫరా చేయాలి. ఆ స్వల్ప పొడి సమయంలో ఆకులు మొదలైనవి పులియడం ఆగిపోతుంది. కొత్తగా పారే నీరు ఆమ్లజనిని తీసుకువస్తుంది. ఇలా పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం లేకుండానే సాగునీటి పొదుపు, మీథేన్ ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుంది. అలాగే వివిధ జాతుల ఆవులు, గేదెలు మీథేన్‌ను విభిన్న స్థాయిలలో విడుదల చేస్తాయి. మీథేన్‌ను తక్కువ స్థాయిలో విడుదల చేసే జాతి పశువుల పోషణకే మనం ప్రాధాన్యమివ్వాలి. పశువుల పేడ నుంచి గ్యాస్ ను తయారు చేసే గోబర్‌గ్యాస్ కేంద్రాలు మనదేశంలో చాలా పెద్దసంఖ్యలో ఉన్నాయి. పేడ పులిసే ప్రక్రియలో మీథేన్ వాయువు విడుదలవుతుంది. ఇప్పుడు చౌక ఎల్‌పీజీ సరఫరా ఇతోధికంగా జరుగుతున్నందున గోబర్‌గ్యాస్ కేంద్రాల అవసరం దాదాపుగా తీరిపోయింది. శాకాహారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. పశుగ్రాసం మాంసంగా రూపొందే క్రమంలో మీథేన్ చాలా హెచ్చుస్థాయిలో ఉద్గారమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం, ఉత్తరాఖండ్‌లో లఖ్వార్ వ్యాసీ మొదలైన భారీ జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి విద్యుత్‌ను యూనిట్ కు రూ.8, అంతకు మించిన వ్యయంతో ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాజెక్టుల మీథేన్ ఉద్గారాలను నివారించవచ్చు. ఆ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకు అయ్యే వ్యయాన్ని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో మదుపు చేసి యూనిట్‌కు రూ.4 వ్యయంతోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించడం ద్వారా సత్వర ఆర్థికాభివృద్ధి, మీథేన్ ఉద్గారాల తగ్గింపు రెండూ సుసాధ్యమవుతాయి. 


ఈ ప్రత్యామ్నాయ పద్ధతులను సమర్థంగా, ప్రభావశీలంగా అమలుపరచాలంటే ప్రస్తుత పన్ను విధానాలలో మార్పులు చేయవలసిన అవసరముంది. తొలుత సాగునీటి ధరను పెంచి తీరాలి. రైతులు వినియోగించుకునే నీటి ఘనపరిమాణం ప్రకారం సాగునీటి ధరను నిర్ణయించాలి. వరి పొలాలకు నిరంతరాయంగా కాకుండా విడత విడతగా పారించే పద్ధతులను అనుసరించేలా రైతులను ప్రోత్సహించాలి. అలాగే ఎల్‌పీజీ ధర కూడా పెంచి తీరాలి. గోబర్‌గ్యాస్‌ను ఉత్పత్తి చేయడమే రైతులకు లాభదాయకంగా ఉండే పరిస్థితి కల్పించాలి. అన్ని రకాల మాంసాలపై పన్ను విధించాలి. తద్వారా శాకాహారాన్ని ప్రోత్సహించాలి. భారీ జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణానికి స్వస్తి చెప్పాలి. ఉన్న వాటిని తొలగించేందుకు కూడా పూనుకోవాలి. జల విద్యుదుత్పత్తిపై అధిక పన్ను విధించాలి. సౌర, పవన విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలి. 


మీథేన్ ఉద్గారాలను నియంత్రించేందుకు విధించే ఈ పన్నుల కారణంగా బియ్యం, ఎల్‌పీజీ, మాంసం, జలవిద్యుత్తు ధరలు తప్పక పెరుగుతాయి. అయితే పెరిగిన పన్నుల ద్వారా సమకూరే ఆదాయాన్ని దేశ పౌరులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పంపిణీ చేయవచ్చు. ఈ ‘మీథేన్’ పన్నుల రూపేణా వినియోగదారులు చేసే అదనపు చెల్లింపుల సొమ్ము తిరిగి వారికే దక్కుతుంది. సాగునీటిపై మీథేన్ పన్ను వల్ల ప్రభుత్వానికి రూ.1000 కోట్లు సమకూరుతుందనుకుందాం. బియ్యాన్ని వినియోగించుకునే 40 కోట్ల మందిలో ఒక్కొక్కరు రూ.25 చొప్పున చెల్లించడం జరుగుతుంది. తద్వారా సమకూరే రూ.1000 కోట్లను ప్రతి పౌరుడికి రూ.7.40 చొప్పున 135 కోట్ల మందికి బదిలీ చేస్తుంది. ఈ పంపిణీ వల్ల బియ్యానికి చెల్లించే రూ.25లలో వినియోగదారుడు తిరిగి రూ.7.40 పొందగలుగుతాడు. బియ్యాన్ని ఆహారంగా వినియోగించుకోని వారు కూడా రూ.7.40 ధనలాభం పొందుతారు. మీథేన్‌ను ఉద్గారం చేసే వరి నుంచి ఇతర పంటల సాగుకు, ఇతర ఆహారధాన్యాల వినియోగానికి రైతులు, ప్రజలు మళ్ళేందుకు ఆ నగదు పంపిణీ ప్రోత్సహిస్తుంది.. 


ఇదేవిధంగా ఎల్‌పీజీపై మీథేన్ పన్ను నుంచి ప్రభుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం సమకూరుతుందనుకుందాం. ఎల్‌పీజీని ఉపయోగించుకునే 40 కోట్ల మంది ఒక్కొక్కరు రూ.25 చొప్పున చెల్లిస్తారు. ఆ రాబడిని ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.7.40 చొప్పున 135 కోట్ల మందికి బదిలీ చేస్తుంది. ఎల్ పీజీ వినియోగదారులకే కాకుండా గోబర్ గ్యాస్ వినియోగదారులకు కూడా రూ.7.40 ధనలబ్ధి చేకూరుతుంది. ఈ విధంగా మీథేన్ ఉద్గారాలు తక్కువస్థాయిలో ఉండే ఆర్థికవ్యవస్థ దిశగా మనం ముందడుగు వేయవచ్చు. ప్రజల సంక్షేమంపై ప్రతికూల ప్రభావం లేకపోవడంతో పాటు సత్వర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయవలసిన అవసరం ఉంది. మీథేన్ పన్నుల రూపేణా సమకూరిన ఆదాయాన్ని ప్రభుత్వోద్యోగుల వేతనభత్యాలు, ఇతర ప్రభుత్వా వినియోగాలకు కాకుండా ప్రజలకు మళ్లీ నగదు రూపేణా బదిలీ చేసేందుకే వినియోగించి తీరాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...