Abn logo
Mar 22 2020 @ 04:52AM

స్వీయ నిర్బంధం బేఖాతర్‌

రాష్ట్రపతి విందుకు మేరీకోమ్‌ హాజరు 

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రస్తు తం రెండోదశలో ఉన్న కరోనా వైరస్‌.. కఠినమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే సామూహికంగా వ్యాప్తిచెందే మూడో దశకు చేరే అవకాశముందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) హెచ్చరిస్తోంది. కానీ దానిని ప్రజలు చివరకు.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారూ బేఖాతరు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ కూడా జాగ్రత్త చర్యలను తోసిరాజనడం గమనార్హం. జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లో జరిగిన ఆసియా ఓషియానా ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ బాక్సింగ్‌ టోర్నీలో పాల్గొన్న మేరీ.. ఈనెల 13న స్వదేశానికి తిరిగి వచ్చింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమె 14 రోజుల పాటు అంటే ఈనెల 26 వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలి. కానీ ఆ నిబంధనను రాజ్యసభ సభ్యురాలు కూడా అయిన మేరీ ఖాతరు చేయలేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 18న రాష్ట్రపతి భవన్‌లో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ ఎంపీలకు ఇచ్చిన ఉదయం అల్పాహార విందులో ఆమె పాల్గొంది. ఆ విందుకు సంబంధించి రాష్ట్రపతి భవన్‌ అధికార ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన నాలుగు ఫొటోలలో ఇతర పార్లమెంటు సభ్యులతో కలిసి మేరీ కనిపించింది. ఆ విందుకు హాజరైన బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌.. బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ ఇచ్చిన పార్టీకీ హాజరయ్యారు. అయితే కనికాకు కరోనా పాజిటివ్‌గా రావడంతో దుష్యంత్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. కాగా.. జోర్డాన్‌ టోర్నీలో పాల్గొన్న భారత జట్టు సభ్యులంతా 14 రోజుల నిర్బంధంలో ఉన్నారని బాక్సింగ్‌ కోచ్‌ శాంటియాగొ నీవియా చెప్పాడు.  

Advertisement
Advertisement
Advertisement