Abn logo
Nov 1 2020 @ 02:23AM

స్కీంల పేరుతో వల

Kaakateeya

జ్యూయలరీ షాపుల్లో విపరీత ధోరణి

బట్టలు, హోంనీడ్స్‌ షాపుల్లోనూ అదే పరిస్థితి

కస్టమర్లను ఆకట్టుకొనేందుకు అక్రమ మార్గాలు

సులభ వాయిదాల పేరుతో దోచుకుంటున్న వ్యాపారులు

బహిరంగంగా డ్రాల నిర్వహణ

గతంలో పలాయనం చిత్తగించిన సంఘటనలెన్నో


మంచిర్యాల, అక్టోబరు 31: సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలను బడా వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. రకరకాల స్కీంల పేరుతో అందిన కాడికి దండుకుంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. స్కీంలు పూర్తికాగానే వస్తు, నగదు రూపంలో తిరిగి చెల్లించాల్సిన వ్యాపారులు బోర్డులు తిప్పేసి పలాయనం చిత్తగిస్తున్నారు. ఇలా స్కీంల పేరుతో అందిన కాడికి దండుకొని దుకాణాలు మూసేసి పారిపోయిన సంఘటనలు జిల్లా కేంద్రంలో గతంలో అనేకం ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో స్కీంల దందా జ్యూయలరీ షాపులు, బట్టల దుకాణాలు, హోంనీడ్స్‌, వాహన షోరూముల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రజలను ఆకట్టుకొనేందుకు ఆయా వర్గాల వ్యాపారస్తులు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ ప్రచారం ఊదరగొట్టేస్తున్నా అడ్డుకొనేవారు కరువయ్యారు. ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సందర్భంగా స్కీం దందా జోరుగా సాగుతుండగా, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.


నెలసరి వాయిదాల పద్ధతిలో....

జిల్లా కేంద్రంలో చిన్న దుకాణాలు మొదలుకొని, పెద్ద షోరూంల వరకు స్కీంల పరంపర కొనసాగుతోంది. నెలసరి వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుంచి గోల్డ్‌ సేవింగ్‌ పథకం పేరుతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. జ్యూయలరీ షాపుల్లో సులభ వాయిదాల పేరుతో నెలకు రూ. 2000 చెల్లించే విధంగా స్కీంలు రూపొందిస్తారు. గరిష్టంగా 15 నుంచి 20 నెలల వరకు స్కీం కాలపరిమితి ఉంటుంది. ఇలా కాలపరిమితి పూర్తికాగానే అప్పటి వరకు జమ అయిన డబ్బులకు అదనంగా వ్యాపార సంస్థలు రూ. 1000 బోనస్‌ చెల్లిస్తామని చెబుతారు. ఒక్కో స్కీంలో 200 మంది సభ్యులు చేరే వరకు స్కీం ప్రారంభం కాదనే నిబంధన విధిస్తారు. సభ్యులందరికీ చెల్లించిన డబ్బులకు సమానంగా బంగారు లేదా వెండి ఆభరణాలు అందజేస్తామని ప్రకటిస్తారు. అనంతరం మొదటి నెల నుంచి చివరి నెల వరకు ప్రతి నెల నిర్ణీత తేదీలలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. నిర్ణీత గడువులోపు నెలసరి వాయిదా చెల్లిస్తేనే వారి పేర్లు డ్రాలో ఉంటాయని ముందుగానే చెప్తారు. డ్రాలో గెలుపొందిన విజేత తదుపరి వాయిదాలు చెల్లించనవసరం లేదని ప్రకటిస్తారు. అయితే స్కీం గడువు పూర్తయ్యే వరకు ఎలాంటి బహుమతులు ఇవ్వబడవనే నిబంధన ముందుగానే ప్రకటిస్తారు.


దీంతో డ్రాలో విజేతగా నిలిచిన వారు సైతం స్కీం కాలపరిమితి పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. స్కీం మధ్యలో నెలసరి వాయిదాలు ఆపేసిన వారికి కాలపరిమితి పూర్తయ్యాక అంతే విలువగల ఆభరణాలు అందజేస్తామనే నిబంధన విధిస్తారు. చివరగా నగదుగానీ, ప్యూర్‌ గోల్డ్‌(బిస్కెట్‌)గానీ, ముద్ద వెండిగానీ, ఇవ్వబడదనే గమనిక ట్యాగ్‌లైన్‌ చేర్చి, నిట్టనిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. బట్టల దుకాణాలు, హోంనీడ్‌ షాపులు, వాహన షోరూముల్లో ద్విచక్ర వాహనాలు, కార్ల పేరుతో స్కీంలు నడుపుతూ అక్రమ మార్గాలలో దండుకుంటున్నారు.


బహిరంగంగా లక్కీ డ్రాల నిర్వహణ....

1978 నగదు మార్పిడి స్కీం నిషేధ చట్టం ప్రకారం లక్కీ డ్రాల ద్వారా వస్తువుల విక్రయం, పంపిణీ చట్టరీత్యా నేరం. బహుమతుల ప్రదానం, చిట్టీల నిర్వహణ కోసం బ్రోచర్లు, కూపన్లు, టిక్కెట్లు ముద్రించడం చేయరాదు. అలాగే స్కీం నిర్వహించడం చట్టప్రకారం నిషేధం. దీన్ని అతిక్రమించిన వారికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా విధించే అవకాశం ఉంది. కనిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా విధించవచ్చు. అలా కాక ఏక కాలంలో రెండూ అమలు చేసే అవకాశాలున్నాయి. అయినప్పటికీ బహిరంగంగా లక్ష్కీ డ్రాలు నిర్వహిస్తూ బహుమతులు అందజేస్తున్నా అడిగేవారు లేరు. ఆయా వ్యాపార సంస్థల ముందు బహిరంగంగా కటౌట్లు, బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు బ్రోచర్లు ముద్రించి బహిరంగంగా పంపిణీ చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు.. 


బోర్డులు తిప్పేసిన వ్యాపార సంస్థలు

ప్రజలను ఆకట్టుకొనేందుకు రకరకాల స్కీంలు ఏర్పాటు చేసి, అనంతరం బోర్డులు తిప్పేసిన వ్యాపార సంస్థలు జిల్లా కేంద్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. రైల్వే స్టేషన్‌ రోడ్డులోని పద్మావతి జ్యూయలర్స్‌, గాయత్రి జ్యూయలర్స్‌, లక్ష్మీ గాయత్రి జ్యూయలర్స్‌ వినియోగదారులతో స్కీంలు నిర్వహించి, అనంతరం పలాయనం చిత్తగించాయి. లక్ష్మీ గాయత్రి జ్యూయలర్స్‌ నిర్వాహకుడు చిలువేరు శ్రీకాంత్‌ స్కీంలు నిర్వహించి, అనంతరం 2013 అక్టోబర్‌లో భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఘటనలో భార్యా భర్తలు ఇరువురు మృతి చెందగా, పిల్లలు అనాథలుగా మారారు. ఇలా పదుల సంఖ్యలో సంఘటనలు చోటు చేసుకుంటున్నా స్కీంల నిర్వహణ ఆగకపోగా రోజురోజుకూ కొత్తవి పుట్టుకురావడం గమనార్హం. 


చర్యలు తీసుకుంటాం...ఉదయ్‌కుమార్‌ రెడ్డి, డీసీపీ, మంచిర్యాల

వ్యాపార సంస్థల్లో స్కీంలు ప్రవేశపెట్టడం చట్టరీత్యా నేరం. స్కీంలు, మనీ సర్క్యులేషన్‌ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను మోసగిస్తే ఉపేక్షించేంది లేదు. స్కీంలు నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలపై ధృష్టి సారిస్తాం. ఏయే సంస్థల్లో స్కీంలు ప్రారంభించారో గమనించి తనిఖీలు నిర్వహిస్తాం. చట్టబద్దత లేకుండా అక్రమ వ్యాపారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదు. ప్రజలు ఈ విషయమై ఫిర్యాదులు చేస్తే అవసరమైన చర్యలు చేపడతాం. 

Advertisement
Advertisement